ఉషశ్రీ రచనల ముద్రణకు ముందుకొచ్చిన మూర్తి-వాణి దంపతులు
హైదరాబాద్: రామనామం… రామనామం అంటూ గళమెత్తిన అభినవ లవకుశులుగా పేరుపొందిన కంభంపాటి సోదరులు కృష్ణ ఆదిత్య, కృష్ణ శశాంక్ లతో ప్రేక్షకులు కూడా తమ గొంతును కలిపారు. మరికొందరు తాదాత్మ్యంతో కరతాళ ధ్వనులు చేశారు. ఉషశ్రీ సంస్కృతి సత్కారం అందుకున్న ఆదిత్య-శశాంక్ తదనంతరం రామ కీర్తనలను గానం చేశారు. ఈ సంకీర్తనలు అన్నింటినీ ఆదిత్య రచించి, స్వరపరిచారు. సత్కారానికి స్పందిస్తూ వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. హనుమంతుడి వాక్చాతుర్యాన్ని వివరించే సందర్భంలో ఉషశ్రీ గారు చెప్పిన అంశాలు తమకు ఆచరణీయాలు అయ్యాయని తెలిపారు.

అంతకు ముందు జరిగిన సభకు ఏపీ పూర్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రహ్మణ్యం, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీనివాస బంగారయ్య శర్మ, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి ప్రసంగించారు. ఎల్. వి. సుబ్రహ్మణ్యం తన ప్రసంగంలో ఉషశ్రీ గారి రచనల గురించి ప్రస్తావించారు. కొన్ని ఇప్పటికీ అముద్రితాలుగా ఉండడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. ఉషశ్రీ శతజయంతి సందర్భంగా చేసే కార్యక్రమాలకు తన వంతు సహకారాన్ని అందిస్తాను అన్నారు.

బంగారయ్య శర్మ మాట్లాడుతూ, ఉషశ్రీ గారి కుమార్తెల పేర్లను ప్రస్తావిస్తూ, ప్రాధాన్యతను వివరించారు. డాక్టర్ అనంతలక్ష్మి మాట్లాడుతూ ఉషశ్రీ గారి వచోవైభవాన్ని కళ్ళకు కట్టేలా వివరించారు. ఉషశ్రీ గారు తాను అనుకున్నది చేశారని, కర్తవ్య నిర్వహణలో చాల కఠినంగా ఉండేవారని తెలిపారు. ఆదిత్య-శశాంక్ సోదరులకు ఉషశ్రీ మిషన్ ఉషశ్రీ సంస్కృతి సత్కారం అందించారు.

కార్యదర్శి నివేదికను డాక్టర్ వైజయంతి అందిస్తూ, ఉషశ్రీ శతజయంతికి సన్నద్ధమవుతున్నామనీ, ఇందుకు అందరి సహకారం అవసరమనీ తెలిపారు. ఉషశ్రీ గారి రచనలను సమగ్ర సంపుటిగా ప్రచురించాలని అనుకుంటున్నామని చెప్పారు. ఈ సందర్భంలో శ్రీమతి చెరువు వాణి, మూర్తి దంపతులు, ప్రచురణకు అయ్యే ఖర్చును తాము అందజేస్తామని చెప్పారు. వారికి ఉషశ్రీ మిషన్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలను తెలియజేస్తోంది.

పురాణపండ శ్రీనివాస్ ప్రచురించి అందించిన అదివో.. అల్లదివో పుస్తకాన్ని, తిరుమల వెంకన్న లడ్డూ ప్రసాదాన్ని ప్రేక్షకులకు నిర్వాహకులు అందించారు. అందుకు ఉషశ్రీ మిషన్ శ్రీనివాస్ కు ధన్యవాదాలు చెప్పింది.

డాక్టర్ గాయత్రీ వందన సమర్పణ చేసిన సభలో, సన్మాన పత్రాన్ని పద్మావతి చదివారు. తొలుత చిరంజీవి ప్రణవ నాద ప్రియ ప్రార్ధనతో సభ ప్రారంభమైంది.
