అందరి అంచనాలను నిజం చేస్తూ విక్రమ్ లాండర్ సజావుగా చంద్రుని ఉపరితలాన్ని ముద్దాడింది. సరిగ్గా ఆరు గంటల నాలుగు నిముషాలకు విక్రమ్ నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంది. ఆ క్షణంలో యావద్దేశం ఆనంద పరవశమైంది. ఇప్పటి వరకూ అమెరికా, చైనా, రష్యా దేశాలు మాత్రమే చంద్రుణ్ణి చేరుకోగలిగాయి. ఇప్పుడు ఆ ఘనతను భారత్ అందుకుంది. చంద్రుడి దక్షిణ ధృవం మీద కాలు మోపిన దేశంగా పేరు తెచ్చుకుంది. ఈ ధృవాన్ని మనకంటే ముందే చేరుకోవాలని రష్యా చేసిన యత్నం లూనార్ 25 మూడు రోజుల క్రితం లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.
విక్రమ్ తలుపులు నాలుగు గంటల అనంతరం అంటే రాత్రి పది గంటలకు తెరుచుకుంటాయి. తరవాత ప్రజ్ఞాన్ చంద్రుని ఉపరితలంపైకి వస్తుంది. తన పరిశోధనను ప్రారంభిస్తుంది. ఈ సంచలన విజయాన్ని నమోదు చేసిన క్షణాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృశ్య మాధ్యమంలో వీక్షించారు. శాస్త్రవేత్తలకు శుభాభినందనలు తెలిపారు.
ఐదేళ్ల క్రితం చంద్రయాన్ – 2 రోవర్ చంద్రునిపై క్రాష్ ల్యాండ్ అయిన విషయం, ఆ సమయంలో అప్పటి ఇస్రో చైర్మన్ కె. శివన్ కన్నీరు పెట్టిన సంగతి… ఆయనను మోడీ దగ్గరకు తీసుకుని ఓదార్చిన ఘటనను అందరం చూశాం. దీనికి ముందు 2008 లో చంద్రయాన్ వన్ విజయవంతమై, చంద్రునిపై నీటి జాడలను కనిపెట్టింది. ఈ ప్రయోగం అటల్ బిహారి వాజపేయి ప్రధానిగా ఉండగా జరిగింది.
చంద్రయాన్ 1 , 2 ప్రయోగాలు కూడా బి.జె.పి. ప్రభుత్వ నేతృత్వంలోనే సాగాయి. ప్రస్తుతం ఇస్రో చైర్మన్ గా సోమనాథ్ వ్యవహరిస్తున్నారు. మూడు లక్షల 84 వేళ కి.మీ. దూరాన్ని 42 రోజులలో ప్రయాణించి, చంద్రుణ్ణి విక్రమ్ లాండర్ చేరుకుంది.