11 మంది పెంకితనం – విరుగుడు మందు ఉందా?

0
184

ఏపీలో పాతుకుపోయిన రాజకీయానికి నిదర్శనం
(నవీన్ పెద్దాడ)

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రస్తుతం ఒక రాజకీయ యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. 2024 ఎన్నికల తర్వాత అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన ఘాటు వ్యాఖ్యలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) శాసనసభ సమావేశాల బహిష్కరణ ఈ వివాదాన్ని మరింత రాజేశాయి. ఇది కేవలం సాంకేతిక అంశాల వివాదం కాదు. రాష్ట్రంలో పాతుకుపోయిన రాజకీయ వైరానికి ఇది తాజా నిదర్శనం.

హోదా చుట్టూ వివాదం

ప్రస్తుత ప్రతిష్టంభనకు ప్రధాన కారణం ప్రతిపక్ష నాయకుడి హోదా వివాదం. 2024 ఎన్నికలలో తమకు దాదాపు 40% ఓట్లు వచ్చాయని, సభలో అతిపెద్ద ప్రతిపక్షం తమదేనని వైసీపీ వాదిస్తోంది. ప్రజాస్వామ్య స్ఫూర్తితో తమ నాయకుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.
ఈ వాదనను స్పీకర్ అయ్యన్నపాత్రుడు తిరస్కరించారు. శాసనసభ నిబంధనల ప్రకారం, మొత్తం సభ్యుల సంఖ్యలో కనీసం 10% బలం, అంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. వైసీపీకి కేవలం 11 మంది సభ్యులే ఉన్నందున, హోదా ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు. ఇది తన విచక్షణాధికారం కాదని, స్థిరపడిన నిబంధనలను పాటిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

స్పీకర్ హెచ్చరికలు, రాజకీయ ఎత్తుగడలు

వైసీపీ బహిష్కరణపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్రంగా స్పందించారు. సభకు వచ్చి కేవలం హాజరు పట్టికలో సంతకం చేసి వెళ్ళిపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇది ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయడమేనని విమర్శించారు. ఆయన కేవలం విమర్శలతో ఆగలేదు. కొన్ని కఠిన హెచ్చరికలు జారీ చేశారు.

ప్రజాప్రతినిధులు ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్నారని, సభా కార్యకలాపాలలో పాల్గొనకుండా జీతాలు తీసుకోవడం సరికాదని ఆయన అన్నారు. “పని చేయకుంటే జీతం లేదు” అనే సూత్రాన్ని ఎమ్మెల్యేలకు కూడా వర్తింపజేసే అంశాన్ని పరిశీలిస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా, సభ అనుమతి లేకుండా వరుసగా 60 పనిదినాలు గైర్హాజరైతే సభ్యుల సీటును ఖాళీగా ప్రకటించే అధికారం సభకు ఉందని రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4)ను పరోక్షంగా గుర్తుచేశారు. స్పీకర్ వ్యాఖ్యలు, ప్రతిపాదిత చర్యలు ప్రతిపక్షంపై ఒత్తిడి పెంచే వ్యూహాత్మక ఎత్తుగడలుగా కనిపిస్తున్నాయి.

పునరావృతమవుతున్న బహిష్కరణల చరిత్ర

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సభా బహిష్కరణలు కొత్త కాదు. ఇది అధికార, ప్రతిపక్షాల మధ్య ఒక ప్రతీకార ఆయుధంగా మారింది. 2021లో, అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, సభలో తన భార్యను అవమానించారని ఆరోపిస్తూ సభను బహిష్కరించారు. తిరిగి ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని శపథం చేసి, 2024 ఎన్నికల వరకు సభకు దూరంగా ఉన్నారు.

అంతకుముందు, 2017లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి, తమ పార్టీ ఎమ్మెల్యేలను అధికార టీడీపీ ప్రలోభపెడుతోందని ఆరోపిస్తూ శాసనసభను బహిష్కరించారు. ఈ చరిత్ర ఒక విష వలయాన్ని సూచిస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షాన్ని గౌరవించడం లేదని, దానికి నిరసనగా సభను బహిష్కరించడం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక పాత ప్రతిపక్షం అదే వ్యూహాన్ని అనుసరించడం పరిపాటిగా మారింది.

ఈ నేపథ్యంలో గురువారం ప్రారంభమైన శాసన సభ సమావేశం ఏకపక్షంగానే సాగింది. రానున్న రోజుల్లో చర్చ జరగనుంది. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 18 అంశాలను, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 9 అంశాలను చర్చకు ప్రతిపాదించాయి. వీటిలో జలవనరులు,శాంతిభద్రతలు, ఆరోగ్యం, పరిశ్రమలు వంటి కీలక అంశాలు వున్నాయి.
సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ జీఎస్టీ శ్లాబుల తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు తగ్గి ప్రజలకు ఊరట కలుగుతుందని తెలిపారు.

ఈ నిరంతర ప్రతిష్టంభనలు శాసనసభ గౌరవాన్ని, దాని సంస్థాగత సమగ్రతను దెబ్బతీస్తాయి. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన వేదిక, రాజకీయ పార్టీల పోరాట క్షేత్రంగా మారినప్పుడు ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల విశ్వాసం సన్నగిల్లుతుంది. ఈ రాజకీయ పోరులో అంతిమంగా నష్టపోయేది రాష్ట్ర ప్రజలే.

(వ్యాస రచయిత సీనియర్ పాత్రికేయులు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here