అబద్ధాలకోరు అమిత్ షా
తెలంగాణ ప్రగతిని తక్కువ చేసి చూపే యత్నం
సభ రద్దు ప్రభుత్వాధినేతలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు
(వనం జ్వాలా నరసింహారావు, 8008137012)
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని అమిత్ షా అంటున్నారు. హైదరాబాద్ సమీపంలోని తుక్కుగుడాలో ఇటీవల జరిగిన బహిరంగ సభలో తన స్వప్నం సాకారమవుతుందంటూ వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్‌ను రేపే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించాలని సవాలు చేశారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు తాము సర్వసన్నద్ధంగా ఉన్నామన్నారు కేంద్ర హొం మంత్రి అమిత్ షా. ఈ వ్యాఖ్యలలో ఆయనకు రాజ్యాంగ పరిస్థితులు, ఎన్నికల కమిషన్ చట్టాల గురించి తెలియదని స్పష్టమవుతోంది. ప్రతిపక్ష పార్టీ నాయకుడు డిమాండ్ చేసిన వెంటనే ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉండదని కూడా ఆయనకు తెలియదు. ఎన్నికలు ముందస్తుగా జరగాలన్నది ముఖ్యమంత్రి ఇష్టంపై ఆధారపడి ఉంటుందనేది సత్యం. అధికార పార్టీ పూర్తి మెజారిటీని అనుభవిస్తున్నప్పుడు అలా ముందస్తుకు ఎందుకు మొగ్గు చూపుతారు? ఒకవేళ అలా భావించినా అసెంబ్లీ రద్దయిన మరుసటి రోజే ఎన్నికల నిర్వహణ అసాధ్యం. ఎందుకంటే ఎన్నికలకు ఒక ప్రక్రియ ఉంటుంది.
రద్దయిన మర్నాడే ఎన్నికలు సాధ్యమా?
ఎన్నికల షెడ్యూలును ప్రకటించే ముందు ఎన్నికల కమిషన్ అందులో ఉన్న మంచి చెడులను బేరీజు వేసుకుంటుంది. కాబట్టి, అసెంబ్లీ రద్దయిన మర్నాడే ఎన్నికలు నిర్వహించడమనేది కల్ల. కేంద్ర హోం మంత్రి స్థాయిలో ఇలా మాట్లాడడం ఆయనకు తగదు. ఇది గారడీ మాటగా భావించాల్సి ఉంటుంది. అమిత్ షా ఎప్పుడు హైదరాబాద్ లేదా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించినా విచిత్రంగా మాట్లాడుతుంటారు. ఈ అంశంలో హద్దులు మీరి మాట్లాడతారు. ఇలా మాట్లాడి తన బేలతనాన్ని వెల్లడించుకుంటుంటారు. 2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళినప్పుడు అదెంతో ఖర్చుతో కూడుకున్న పని అంటూ విమర్శించిన అమిత్ షా ఇప్పుడు ఆయనంతట ఆయనే రేపే ఎన్నికలు నిర్వహించాలని కోరడం వింతగా ఉంది. అప్పుడప్పుడు ఆయన మాట్లాడే మాటలలో హేతుబద్ధత ఉండదు. లాజిక్ లేకుండానే మాటలు తూటలు వదులుతుంటారు. రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయాలని అడగడం దీనికి ఒక మంచి ఉదాహరణ. ముందస్తు ఎన్నికలు జరిగితే తమ పార్టీ అధికారంలోకి వస్తుందని షా కలలు కంటున్నారు. 2014, 2018లో నిర్వహించిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ దక్కించుకున్నవి కొద్దిపాటి సీట్లే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ అధికారంలోకి వస్తుందన్న వ్యాఖ్య ఎంతవరకు సమంజసమో దేవుడికే తెలియాలి.
2018లో కేసీఆర్ ముందస్తు నిర్ణయం సహేతుకం
కేసీఆర్ గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం ముమ్మాటికీ సహేతుకం. రాజ్యాంగబద్ధం, చట్టబద్ధం, న్యాయం… ఆ సందర్భంలో కేసీఆర్ నిర్ణయాన్ని షా తప్పు పట్టారు. అసెంబ్లీని రద్దుచేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించిన మొట్టమొదటి సీఎం కేసీఆర్ మాత్రమేననీ, ఈ ఎన్నికల వల్ల ఎంతో ప్రజాధనం ఖర్చువుతుందనీ విమర్శించారు. ఈ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం అసందర్భం కాబోదు.. ఎందుకంటే రెండు రకాలుగా మాట్లాడుతున్నది అమిత్ షానే కదా? ఆయన మాటలు వింటే దేశంలో ఎప్పుడూ ముందస్తు ఎన్నికలు జరగనట్లే ఉంది. నడుస్తున్న చరిత్రను అమిత్ షాలాంటి స్థాయి వ్యక్తి విస్మరించి ఎలా మాట్లాడగలరు… దేశంలో రాజకీయ పరిణామాలు ఆయనకు తెలియవు అంటే నమ్మాలా? అసాధ్యమైన కార్యాన్ని తక్షణం చేయాలని షా డిమాండ్ చేయడం దురదృష్టకరం. రాష్ట్రం ఎన్నికలకు ఎప్పుడు వెళ్ళాలో నిర్ణయించాల్సింది అమిత్ షా కాదు. ప్రత్యేకించి అధికారంలో ఉన్న పార్టీ పూర్తి మెజారిటీని అనుభవిస్తున్నప్పుడు ఇలా డిమాండ్ చేయడం అస్సలు సరికాదు. తమకు తెలంగాణలో అధికారంలోకి రావాలనే కలను ప్రజలకు వెల్లడించడానికే ఆయన అలా వంకరగా ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
పార్లమెంటును రద్దు చేయాలని ప్రధానిని కోరగలరా!
ఆయనకు అంత ఉబలాటంగా ఉంటే వెంటనే ప్రధానిని కలిసి, బీజేపీ పూర్తి మెజారిటీని అనుభవిస్తున్న లోక్ సభను రద్దు చేసి, ఎన్నికలు నిర్వహించాలని కోరాలి. గడువు పూర్తయిన తరవాత లేదా గడువుకు ముందే అసెంబ్లీ లేదా పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలు జరపాలని రాష్ట్ర గవర్నర్ లేదా రాష్ట్రపతిని కోరడం కొత్త అంశమేమి కాదు. ఐదేళ్ళ పాటు పార్లమెంటు, అసెంబ్లీలు కొనసాగడానికి అనుమతిస్తున్న రాజ్యాంగం ఆర్టికిల్ 85, 174 ద్వారా రాష్ట్రపతి లేదా గవర్నర్‌లకు ప్రభుత్వాధినేతల సిఫార్సులపై వాటిని ముందస్తుగా రద్దుచేసే అధికారాన్నీ కట్టబెట్టింది. అమిత్ షా కేసీఆర్‌ను ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని ఎలా బలవంతం చేయగలరు? అమిత్ షా డిమాండ్ వెనుక మూల కారణం ఏమిటి… దానికి న్యాయబద్ధత ఏమిటి? ఇంకా తెలంగాణ అసెంబ్లీ కాలపరిమితి ఏడాదిన్నర పైనే ఉండగా ఇలా కోరడం ఏమిటి? దేశంలోని ప్రతిపక్షాలన్నీ పార్లమెంటును ముందే రద్దుచేసి, ఎన్నికలు నిర్వహించాలని కోరితే అమిత్ షాకు మింగుడుపడుతుందా? పూర్తి మెజారిటీని పొంది ఉన్న ముఖ్యమంత్రి లేదా ప్రధాన మంత్రికి మాత్రమే సభను రద్దుచేయాలని కోరే హక్కు ఉంటుంది. ఒకరు కోరితే రద్దు చేయాలనుకోవడం సరికాదు. అలా కోరడానికి కారణం ఏదైనా కావచ్చు రాజకీయ, పరిపాలన, లేదా మరేదైనా కావచ్చు. అమిత్ షా లాంటి స్థాయి వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యలు ఇవి కావు. సభ రద్దు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు.
ఇక్కడ ఒక ప్రశ్న ఉదయించవచ్చు. మొదటిసారి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయాలని ఎందుకు సిఫార్సు చేశారనే అనుమానం అందరికీ రావచ్చు. రాజ్యాంగ సభలను రద్దు చేసే అంశంలో రాజ్యాంగం పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ఈ స్వేచ్ఛను కేసీఆర్ ఉపయోగించుకున్నారు. అప్పటి రాజకీయ పరిస్థితులకు చెక్ పెట్టడానికీ, ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడానికీ ఆయన ముందస్తు ఎన్నికల నిర్ణయం తీసుకున్నారు.
200 శాతం హామీలను అమలు చేసిన తెలంగాణ
2018 ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ కేసీఆర్ నెరవేర్చలేదంటూ హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. వారసత్వ రాజకీయాలను కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. 57 సంవత్సరాల జీవితంలో ఇంత అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదని కూడా అమిత్ షా అన్నారు. అరగంట సేపు సాగిన షా ప్రసంగంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు. గతంలో మాదిరిగానే ఆ విమర్శలు ఫక్తు అబద్ధాలు.
ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదంటూ చెప్పి, ఆయన ప్రజలను తప్పు దోవ పట్టించడానికి ప్రయత్నించారు. వాస్తవానికి కాంగ్రెస్ లేదా బీజేపీ ప్రభుత్వాలు ఎప్పుడూ ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చేలేదనేది పచ్చి నిజం. 2014 టిఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో లేని పథకాలను, ఇవ్వని హామీలను కూడా టిఆర్ఎస్ అమలు చేసింది. వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం 200శాతం ఎన్కనికల హామీలను నెరవేర్చినట్లయ్యింది. ఈ విషయాలను అమిత్ షా గారు పరిగణనలోకి తీసుకుంటే మంచిది. తాను చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ స్థాయి నాయకుడు అయిన అమిత్ షా భేషజాన్ని విడిచి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. పచ్చి అబద్దాలు చెప్పడం, తెలంగాణ ప్రభుత్వాన్నీ, ప్రజలను అవమానించడమే కాగలదు. అమిత్ షా వ్యాఖ్యలను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. అమిత్ షా ను అబద్ధాల బాద్షాగా అభివర్ణించారు. అమిత్ షా వ్యాఖ్యలు నిరాధారమైనవని ఒక ప్రెస్‌మీట్లో కేటీఆర్ స్పష్టంచేశారు. ఆయన మాటలు వాస్తవానికి దూరంగా ఉన్నాయనీ, వక్రీకరణలనీ పేర్కొన్నారు. తెలంగాణ ను కిందచపరచడానికి అమిత్ షా చేసిన దుష్ప్రచారంగా కేటీఆర్ వివరించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి షా ఈ రకంగా వ్యవహరిస్తున్నారన్నారు.
రాష్ట్ర పథకాలకు ప్రశంసల వెల్లువ
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కొత్త, సృజనాత్మక కార్యక్రమాలకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల, కేంద్ర మంత్రులతో పాటు ప్రధాన మంత్రి, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుని నుంచి ప్రశంసలు అందుకున్న విషయాన్ని అమిత్ షా గుర్తుచేసుకుంటే సమంజసంగా ఉంటుంది. తెలంగాణ చేపట్టిన కార్యక్రమాలకు విదేశాల నుంచి కూడా ప్రశంసలు లభించిన విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం కేవలం రాష్ట్రాలతోనే కాదు కేంద్రంతోనూ అన్నిరంగాల్లో పోటీ పడుతున్న విషయాన్ని అమిత్ షా గుర్తుంచుకోవాలి. ప్రపంచంలోని ఇతర దేశాలతో కూడా తెలంగాణ రాష్ట్రం పోటీపడుతోంది. ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారనే విషయం అందరికీ తెలిసిందే. యుఎన్‌డిపి, నీతి ఆయోగ్ సంస్థలు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రాజెక్టులను ప్రశంసించాలి. అయినప్పటికీ కేంద్రం ఈ ప్రాజెక్టులకు ఒక్క నయాపైస మంజూరు చేయలేదు. రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాజెక్టుకూ జాతీయ హోదా కల్పించలేదు. (వ్యాస రచయిత తెలంగాణ సీఎంకు సిపిఆర్‌వో)