స్పెయిన్ పై మ్యాచ్లో భారత్ విజయం
(వాడవల్లి శ్రీధర్)
పారిస్ 2024 ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో నాలుగో పతకం చేరింది. పురుషుల హాకీలో కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత్ స్పెయిన్‌పై 2-1 తేడాతో విజయం సాధించింది. దీంతో ఒలింపిక్స్‌లో వరుసగా రెండో కాంస్య పతకాన్ని భారత్ కైవసం చేసుకుంది. టోక్యో 2020 ఒలింపిక్స్‌లోనూ భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలి క్వార్టర్‌లో ఇరు జట్లూ హోరాహోరీగా తలపడ్డాయి. గోల్ కోసం పదే పదే ప్రయత్నించినా.. ఫలితం దక్కలేదు. దీంతో తొలి క్వార్టర్‌లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ఆ తర్వాత రెండో క్వార్టర్ ప్రారంభమైన మూడు నిమిషాలకే స్పెయిన్ ఖాతా తెరిచింది. అదే క్వార్టర్‌లో చివరి నిమిషంలో గోల్ చేసిన భారత్ స్కోరు 1-1తో సమం చేసింది. మళ్లీ మూడో క్వార్టర్ ప్రారంభమైన కాసేపటికే మరో గోల్ కొట్టిన భారత్.. 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత మరో గోల్ నమోదు కాకపోవడంతో భారత్ 2-1తో మ్యాచ్‌ను, కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
హాకీలో 13వ పతకం..
ఇప్పటివరకు భారత్ హాకీలో 13 పతకాలు సాధించింది. ఇందులో స్వాతంత్రానికి ముందు 3 పతకాలు గెలవగా.. ఆ తర్వాత 10 పతకాలను గెలుచుకుంది. గత టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్న భారత జట్టు పారిస్ ఒలింపిక్స్‌లోనూ కాంస్య పతకం సాధించింది. 1928లో బంగారు పతకం గెలుచుకున్న ఇండియా.. ఆ తర్వాత 1932, 1936 ఒలింపిక్స్‌లో వరుసగా మూడు బంగారు పతకాలు సాధించింది. స్వాతంత్య్రం తర్వాత 1948 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు ఆ తర్వాత 1952, 1956 విశ్వ క్రీడల్లో బంగారు పతకం సాధించింది. స్వాతంత్య్రం తర్వాత వరుసగా మూడు స్వర్ణపతకాలను సాధించింది. మళ్లీ 1960లో రజత పతకం సాధించగా.. 1964లో బంగారు పతకం సాధించింది. 1968, 1972 ఒలింపిక్స్‌లో భారత హకీజట్టు కాంస్య పతకం సాధించింది. 1980 విశ్వక్రీడల్లో మరోసారి స్వర్ణ పతకం సాధించింది. 1980 నుంచి 2020 వరకు భారత హాకీ జట్టు పతకాన్ని సాధించలేదు. చివరిగా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలవగా.. తాజాగా పారిస్ ఒలింపిక్స్‌లోనూ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.