ఆసియా కప్ లీగ్ మ్యాచులో 3 వికెట్ల తేడాతో విజయం
(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)
చిరకాల ప్రత్యర్థి, దాయాది అయిన పాకిస్తాన్ తో జరిగిన ఆసియా కప్ లీగ్ మ్యాచులో భారత జట్టు తన ఆధిక్యాన్ని కనబరిచింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో 128 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఇంకా 4 ఓవర్లు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో గెలిచింది. సూర్యకుమార్ 45 పరుగులతోనూ దూబే 10 పరుగులు చేసి నాటవుట్ గా నిలిచారు. అభిషేక్ శర్మ మొదటి బాల్ ను బౌండరీకి తరలించి శుభారంభాన్నిచ్చాడు. రెండో బంతిని సిక్సర్ కొట్టాడు. మొదటి ఓవరులో భారత్ పన్నెండు పరుగులు సాధించింది. సయీమ్ వేసిన రెండో ఓవరులో శుభమాన్ గిల్ (10 ) రెండు ఫోరులు కొట్టి 22 పరుగుల వద్ద అవుటయ్యాడు. మూడో ఓవరులో అభిషేక్ శర్మ తొలిబంతిని బౌండరీకి తరలించాడు.

మూడో బంతిని సిక్సర్ కొట్టాడు. నాలుగో ఓవరులో తొలి రెండు బంతుల్ని బౌండరీకి తరలించాడు. నాలుగో బంతిని సిక్సర్ కొట్టబోయి ఫహీమ్ చేతికి చిక్కాడు. నాలుగో ఓవరు ముగిసే సరికి స్కోరు రెండు వికెట్ల నష్టానికి 42 . కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు తిలక్ వర్మ జత కలిశాడు. తొలి బంతిని డిఫెన్స్ ఆడాడు. ఐదో ఓవర్లో స్కోరు 48 కి చేరింది. ఆరో ఓవర్ తొలి బంతిని తిలక్ ఫోర్ కొట్టాడు. రెండో బంతికి రెండు పరుగులు తీశాడు. మూడో బంతిని మళ్ళీ ఫోర్ కొట్టాడు. ఆరో ఓవర్లో మొత్తం 13 పరుగులు చేసి జట్టు స్కోరును 61 కి చేర్చాడు.

ఏడో ఓవర్లో భారత్ మూడు పరుగులు మాత్రమే చేర్చగలిగింది. ఎనిమిదో ఓవర్ మొదటి బంతిని తిలక్ ఫోర్ కొట్టాడు. తొమ్మిదో ఓవర్ ముగిసేసరికి స్కోరు 74 కు చేరింది. పదో ఓవర్ మొదటి బంతిని తిలక్ సిక్స్ కొట్టాడు. పది ఓవర్లు ముగిసే సమయానికి తిలక్ 31, సూర్యకుమార్ 23 పరుగులు చేసి స్కోరును 88 పరుగులకు చేర్చారు. పన్నెండో ఓవర్లో తిలక్ ఇచ్చిన క్యాచ్ ని నవాజ్ డ్రాప్ చేసాడు. ఆ ఓవర్ ముగిసేసరికి భారత స్కోరు 97 . పదమూడో ఓవర్లో తిలక్ సయీమ్ బౌలింగులో అవుటయ్యాడు. ఈ దశలో శివమ్ దూబే కెప్టెన్ సూర్యకుమార్ కు జత కలిశాడు. పదమూడో ఓవర్ పూర్తయ్యే సరికి భారత్ వంద పరుగులు పూర్తిచేసుకుంది.

షహీన్ చలవతో వంద దాటి పాక్ స్కోరు
వయోభేదం లేకుండా అందరూ ఎదురు చూసే మ్యాచ్ ఏదైనా ఉందీ అంటే అది కచ్చితంగా ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్. ఆదివారం ఆ రోజు రానే వచ్చింది. ఆసియా కప్ లో భాగంగా దుబాయ్ లో జరిగిన ఈ మ్యాచ్ అసలు జరుగుతుందా అనే అనుమానాలూ లేకపోలేదు. పెహల్గామ్ దాడి నేపథ్యంలో దాయాది దేశంతో ఇండియా ఆడకూడదని డిమాండ్లు వెల్లువెత్తాయి. ఆటంకాలన్నీ దాటుకుని జరిగిన ఈ మ్యాచ్ ఆరంభంలోనే పాక్ బాట్స్మన్ తడబడ్డారు. మొదటి రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయారు. తరవాత వచ్చిన బాట్స్మెన్ కుదురుకుని నిలబడ్డారు. అలా అనుకుంటుండగానే మళ్ళీ వికెట్ల పతనం ప్రారంభమైంది. 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది పాక్ జట్టు. బుమ్రా రెండు, హార్దిక్ ఒకటి వికెట్, అక్షర్ పటేల్ రెండు, కులదీప్ యాదవ్ మూడు వికెట్లు, వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ పడగొట్టారు. ఓపెనర్ ఫర్హాన్ నలభై పరుగులకు అవుటయ్యాడు. జమాన్ 17 , ఫహీమ్ 11 , షహీన్ 33 (నాలుగు సిక్సర్లు), ముఖీమ్ పది పరుగులు చేశారు. పాకిస్తాన్ జట్టు వంద పరుగులు దాటడంతో షాహీన్ ఆఫ్రిది కీలక పాత్ర వహించాడు. పవర్ ప్లేలో రెండు వికెట్లు కోల్పోయి నలభై రెండు పరుగులు చేసింది.

