5, 14, 32, 47, 59, 73, 121, 128, 144, 150
14, 19, 19, 31, 38, 47, 59
ఈ నంబర్లు ఏమిటనుకుంటున్నారా? పెర్త్ లో బోర్డర్ గవాస్కర్ టోర్నమెంట్లో భాగంగా శుక్రవారం ప్రారంభమైన ఆస్ట్రేలియా – ఇండియా మొదటి టెస్ట్ మ్యాచ్ లో వికెట్లు పడిన తీరు. మొదటి వరుసలోవి భారత వికెట్లు పతనమైన తీరు… రెండోది ఆస్ట్రేలియా వికెట్లు పడిన స్కోర్లు. ఎంత పేస్ పిచ్ అయినా పెర్త్ గ్రౌండ్లో ఆతిథ్య జట్టు కూడా కంగు తినడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ మ్యాచ్లో భారత్ 150 పరుగులకు ఆలవుట్ అయ్యింది. తక్కువ స్కోరుకు ప్రత్యర్థిని కట్టడి చేశామని ఆనందం ఆసీస్ క్రికెటర్లకు ఎంతోసేపు నిలవలేదు.
భారత బ్యాటింగ్ కంటే అధ్వానంగా సాగి, ఇరవై నాలుగు ఓవర్లలోనే, ఏడు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసి, పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. జస్ప్రీత్ బుమ్రా పేస్ బౌలింగ్ ముందు ఆస్ట్రేలియన్ బాట్స్మెన్ పిచ్ మీద భారత నాట్యం చేశారు. బంతి ఎలా వెడుతోందో కూడా తెలియని స్థితిలో వికెట్లు సమర్పించుకున్నారు. ఈ టెస్టులో కెరీర్ ప్రారంభించిన హర్షిత్ రానా చక్కగా బౌలింగ్ చేసి తన మూడో ఓవర్ మొదటి బంతికి ట్రెవిస్ హెడ్ ను క్లీన్ బౌల్డ్ చేసి ఆకట్టుకున్నాడు. బుమ్రా నాలుగు వికెట్లు, మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీసి, ఆసీస్ కి చుక్కలు చూపించారు. అంతకు ముందు టాస్ గెలిచిన భారత్ 150 పరుగులకు ఆలవుటయ్యింది. తొలి టెస్టు ఆడుతున్న నితీష్ కుమార్ రెడ్డి 41 పరుగులు చేయడంతో భారత్ ఈ మాత్రం స్కోర్ చేయగలిగింది. తదుపరి భారత బౌలర్లు విజృంభించి టెస్ట్ పై పట్టు బిగించేలా చేశారు. ఆట మొదటి రోజు మాదిరిగానే సాగితే, ఈ టెస్ట్ రెండో రోజునే ముగియడం ఖాయంగా కనిపిస్తోంది. మహా అయితే, మూడో రోజు అంటే ఆదివారం లంచ్ లోపు ముగుస్తుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇది బౌలర్ల పిచ్.