నాసిరకం మందులతో భారత్ సతమతం

Date:

(డాక్టర్ ఎం. ఖలీల్, హైదరాబాద్)
జనారోగ్యమే జాతి మహాభాగ్యం. ఆ ఆశయం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని దేశ ప్రజలందరికి వైద్య సేవలు అందుబాట్లోకి తెస్తామని పాలకులు గత ఏడున్నర దశాబ్దాలకు పైగా చెబుతున్నా, లక్షలాదికోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా ఆశించిన ఫలితాలు చేకూరడం లేదు. దేశానికి పట్టుకొమ్మలైన గ్రామసీమల్లో ఆరోగ్య వ్యవస్థ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా వర్షాకాలం ఆరంభమైన తర్వాత కొత్తనీరు, పాతనీరు కలయికతో వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతో లక్షలాది మంది రకరకాల వ్యాధులబారిన పడుతున్నారు. ఇన్నేళ్ల తరువాత కూడా దేశంలో దాదాపు నలభైఏడు కోట్ల మందికి పైగా అత్యవసర మందులు అందుబాట్లో లేవని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా దేశంలో దిగువ మధ్యతరగతి ప్రజలు పెట్టే ఖర్చులు దాదాపు డెబ్భై శాతానికి పైగా మందుల కొనుగోళ్లకే ఖర్చవుతున్నాయి. మందుల్లో నాసికరం, నకిలీవి కూడా జనారోగ్యాన్ని పతనపు అంచుకు తీసుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు ఇరవైఐదువేలకు పైగా మందులు నమోదై వుంటే అంతకు రెట్టింపుస్థాయిలో మందులు విచ్చలవిడిగా సరఫరా అవుతున్నాయి. దేశంలో నకిలీ, నాసిరకం మందుల వ్యాపారం యేటా ఇరవైవేల కోట్ల రూపాయలకు పైగా ఉండొచ్చని అంచనా. దేశంలోని నకిలీ మందులు యేటా ఇరవైశాతం పైగా ఉంటుందని ‘అసోచామ్’ ఏనాడో వెల్లడించింది.
ప్రజారోగ్యాన్ని గుల్ల చేస్తున్న ఈ నకిలీ మందులు మార్కెట్లోకి ఒక వ్యూహం ప్రకారం ప్రవేశపెడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అంతగా తనిఖీలు లేక పోవడంతో ఇష్టానుసారంగా నకిలీ మందుల వ్యాపారం జరుగుతున్నది. మార్కెట్ ఐటమ్స్ అంటే బాహాటంగానే అమ్ముకుంటున్నారు. ముప్పై నుంచి యాభైశాతం వరకు కూడా డిస్కౌంట్లు ఇస్తూ పెద్ద పెద్ద బోర్డులు పెట్టి అమాయకులను దగాచేస్తున్న సంఘటనలు దేశవ్యాప్తంగా తరుచుగా జరుగుతున్నాయి. పాలకులు తీసుకుంటున్న చర్యలేవీ వీటిని నిరోధించలేకపోతున్నాయి. ఈ నకిలీ వ్యాపారం ఇప్పటికిప్పుడు మొదలుకాకపోయినా ఏనాటినుంచో వున్నా రాను రాను పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే అంశం. మందుల్లో ప్రామాణికత దెబ్బతినడం వల్ల జరుగు తున్న అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. గతంలో ఒకసారి ముంబైలోని ఒక హాస్పిటల్లో ‘మానిటాల్’ అనే మెదడు వ్యాపుకు వాడే మందులో కల్తీ జరగడంతో ఏకంగా పధ్నాలుగు మంది మరణించారు. అప్పుడు పెద్దఎత్తున నిరసనలు, ఆందోళనలు పెల్లుబికాయి. పరిస్థితిని గ్రహించిన ఆనాటి పాలకులు జస్టిస్ లెంటిన్ కమిషన్ను నియమించింది. మంత్రిత్వ స్థాయి నుండి మొదలు దిగువస్థాయివరకు ఆరోగ్యఔషధ విభా గాల్లోని లొసుగులను, వైఫల్యాలను, అవినీతిని ఎత్తి చూపుతూ లెంటిన్ తన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ నివేదికలోని ప్రతిపాదనలను, సిఫారసులను ప్రభుత్వం పట్టించుకోలేదనే చెప్పవచ్చు.
ఈ నకిలీ మందుల వల్ల కలిగేదుష్ప్రభావాలు అటుంచి జబ్బు తగ్గకపోతే వైద్యుడి వైఫల్యమా? ఉపయోగించిన మందులు కారణమా? అర్థంకాక మళ్లీ మళ్లీ పరీక్షలమీద పరీక్షలు చేయిస్తూ ఇతర మందులతో రోగులపై ప్రయోగాలు చేస్తున్నారు. దీంతో రోగి ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా కూడా కుప్పకూలిపోతున్నారు. అసలు వైద్య ఆరోగ్య విషయంలో ఒక నిర్దిష్టమైన విధానం, ప్రణాళిక లేకపోవడం వల్లనే ఈపరిస్థితులు దాపురిస్తున్నాయి. పాలక పెద్దలకు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రజారోగ్య విషయంలో సవతితల్లి ప్రేమ చూపెడుతున్నదనే విమర్శలు ఏనాటి నుంచో వున్నాయి. మాటలు ఎంత గొప్పగా చెబుతున్నా నిధులు కేటాయింపుల విషయంలో మాత్రం న్యాయం చేయలేక పోతున్నది.
దేశంలో ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వ వ్యయం స్థూల దేశీయోత్పత్తిలో(జిడిపి) కేవలం 1.3శాతమే. గ్రామాల్లో 14.1శాతం, పట్టణాల్లో 19.1శాతం ప్రజలకు మాత్రమే ఏదో ఒక ఆరోగ్య బీమా సదుపాయం వుందని జాతీయ సర్వే కార్యాలయం ఇటీవల ప్రకటించింది. ఇప్పటికీ ఆ సర్వే చెప్పిన లెక్కల ప్రకారం ప్రజలు తమ వైద్య ఖర్చులను దాదాపు అరవై మూడు శాతాన్ని సొంతంగానే భరిస్తున్నారు. అదే జపాన్లో 12.75 శాతం, న్యూజి లాండ్లో 12.91 శాతం, ఆస్ట్రేలియాలో 17.72 శాతం, అమెరికాలో అయితే కేవలం 10.1 శాతమేనని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. లండన్ కు చెందిన బ్లూమ్బర్గ్ రూపొందించిన ప్రపంచ ఆరోగ్య సూచి 2019 ప్రకారం కొన్ని ఆగ్నేయాసియా దేశాలు భారత్ కంటే ఎంతో మెరుగ్గా ఉన్నాయి. 169 దేశాలలో భారత్ 120వ స్థానంలో ఉండగా శ్రీలంక 66, బంగ్లాదేశ్ 91, నేపాల్ 110 స్థానాల్లో ఉన్నాయి.
ప్రపంచ వ్యాధుల భారం (గ్లోబుల్ డిసీజ్ బర్డన్) అధ్యయన నివేదికలో వెల్లడించిన విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అంతెందుకు, మొన్న కరోనా విజృంభించిన తరుణంలో భారత్లో ఆరోగ్యవ్యవస్థ ఎంత అస్తవ్యస్థంగా, బలహీనం గా ఉందో బయటపడింది. మందులు, డాక్టర్లు అటుంచి కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదనే విషయం వెలుగుచూ సింది. రోగులకు వెంటిలేటర్లు, ఉన్న వెంటిలేటర్లకుయాభై, అరవై రెట్లు అధికంగా కావాలని వైద్యవర్గాలే అంచనా వేశాయి. చివరకు ప్రాణవాయువు అందించలేకపోవడంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న అభాగ్యులు ఎందరో ఉన్నారు. ఇక గ్రామాల్లో వచ్చీరాని వైద్యంతో డాక్టర్లుగా చెలామణి అవుతూ తోచిన మందులు ఇచ్చేవారుకూడా తక్కువ సంఖ్యలో లేరు. కనీసం మందులపేర్లు కూడా రాయలేని వారు కూడా ఈ డాక్టర్ల జాబితాలో చేరిపోతున్నారు. చిన్న చిన్న ఆపరేషన్లు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. అర్హతలేని వైద్యులు చేసే ఇలాంటి చికిత్సల్లో కొన్ని సందర్భాల్లో రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇక వ్యాధి నిర్ధారణ పరీక్షా కేంద్రాల వ్యవహారం ఇక మిథ్యగా తయారైంది. ఎలాంటి అనుమతులు పొందకుండా పరీక్షా కేంద్రాలు దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో నడుస్తున్నాయి. వీటిని క్రమబద్ధీకరణ చేసేందుకు నిర్దిష్ట మైనచట్టం రూపకల్పనకు చేస్తున్న ప్రయత్నాలు దశాబ్దాల తరబడి పెండింగ్ పెట్టారు. వ్యాధిని సకాలంలో గుర్తించకపోతే జబ్బు ముదిరి ప్రాణాలను బలితీసుకుంటున్నాయనే విషయం అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారత్లో అకాల మరణాలకు చాలావరకు సాంక్రమితేతర వ్యాధులే కారణమవుతున్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ నివేదికలో వెల్లడించింది. ఈ విషయం దక్షిణాసియాలోనే ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం సీజన్ మారిన తర్వాత వచ్చిన వ్యాధులు, డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, స్వైన్ఫ్లూ తదితర విషజ్వరాలు ప్రజారోగ్యంపై దాడిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల వీటిబారినపడి ఆస్పత్రిపాలైనవారు ఎందరో ఉన్నారు. పాలకులు గత అనుభవాలతోనైనా పాఠాలు నేర్చుకొని ప్రజారోగ్యం ఎదుర్కోబోతున్న సవాళ్లకు అనుగుణంగా సమాయత్తం కావాలి.
(వ్యాస రచయిత ఫార్మా రంగ పరిశోధకుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Prof.Purushottam Reddy: Renowned Academician

Environmentalist and Developmental Activist  (Prof Shankar Chatterjee)     ...

We are here to help our country: Trump

This is a moment never seen before We are here...

Uddhav Thackeray: Congress riding Shiv sena tiger?

(Dr Pentapati Pullarao) In November 2019, Uddhav Thackeray broke of...

US Elections vs Indian Polls

Plethora of similarities in campaigning style (Anita Saluja) As the US...