పీవీ తెలుగు ఠీవి

Date:

నేడు భారతరత్న పీవీ నరసింహారావు జయంతి

(వాడవల్లి శ్రీధర్)
చరిత్రకు ఓ చెడ్డపేరుంది- అదెప్పుడూ విజేతల పక్షమేనని! అలాగని విజేతలందరూ చరిత్ర చల్లని చూపునకు పాత్రులు కాలేరు. పాములపర్తి వెంకట నరసింహారావు సైతం అటువంటి దురదృష్టవంతులే! ప్రజల కుత్తుకలను ఉత్తరించిన రాచరిక ప్రభువులు, పట్టుపట్టి పౌరహక్కులను హత్యచేసిన ప్రజాస్వామ్య ఏలికలెందరినో సగర్వంగా తన ఒడిలోకి తీసుకున్న చరిత్ర- భారతదేశాన్ని పునర్నిర్మించిన నిజమైన నాయకుడు, దార్శనికుడైన పీవీ పట్ల మాత్రం ఉద్దేశపూర్వక ఉపేక్షను ప్రదర్శించింది. ఆర్థిక రంగం నుంచి అణుశక్తి కార్యక్రమం వరకు, అంతర్గత భద్రత నుంచి విదేశాంగ విధానం వరకు అన్నింటిపైనా తనదైన ముద్రవేసిన తెలుగుబిడ్డ పీవీ- ఆధునిక భారత చరిత్రను మేలు మలుపు తిప్పిన రాజనీతిజ్ఞుడు.
అప్పుడు దేశం దివాలా అంచున.. ఇప్పుడు అతిపెద్ద ఆర్ధిక శక్తిగా.! కారణం మన తెలుగు కోహినూరు పీవీ నరసింహారావు. దేశరాజధానికి పంచెకట్టు హూందాతనాన్ని పరిచయం చేసిన అగ్రగణ్యుడు. ఎవరూ ఊహించని సంస్కరణలు చేపట్టి దారి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన అపర చాణక్యుడు. ఆయనే పీవీ.. మన ఠీవీ అని సగర్వంగా చెప్పుకునే భారతరత్న కిరీటాదారుడు దివంగత పాములపర్తి వెంకట నరసింహారావు. రాజకీయ నాయకుడిగానే కాదు.. తన కలం ద్వారా సాహితీ వెలుగులు విరజిమ్మిన బహుభాషా కోవిదుడు. వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో 1921, జూన్‌ 28న రుక్మిణమ్మ-సీతారామారావు దంపతులకు తొలి సంతానంగా అమ్మమ్మ ఇంటిలో జన్మించారు.
సంస్కరణలు తన ఇంటి నుంచే
ధనిక కుటుంబంలో పుట్టిన పీవీపై నాటి భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు ప్రభావం చూపాయి. దాని ఫలితంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పీవీ నర్సింహారావు తన ఇంటి నుంచే భూ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పీవీ నరసింహారావు పన్నెండు వందల ఎకరాల ఆసామి. తన కుటుంబ అవసరాల కోసం 200 ఎకరాల భూమి ఉంచుకొని, మిగిలిన భూమిని పేద ప్రజలకు దానం చేసిన మహోన్నత శిఖరం. తెలంగాణలో రైతు కూలీల చేతికి కాసింత భూమి దక్కిందంటే ఆయన వేసిన భూసంస్కరణలే కారణం
ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రిగా కూడా పీవీ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. సర్వేల్‌లో రెసిడెన్షియల్‌ స్కూల్‌ నెలకొలిపి గురుకుల విద్యకు తొలి అడుగులు వేశారు. కేంద్ర హెచ్‌ఆర్డీ మంత్రిగా దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాలు అంకురార్పణ చేశారు. జైళ్ల శాఖ మంత్రిగా ఓపెన్‌ జైల్‌ అనే వినూత్న పద్దతికి శ్రీకారం చుట్టి పక్కాగా అమలు చేశారు.


అనుకోకుండానే వరించిన పదవులు
పీవీ నరసింహారావు దాదాపు ఏడాదిన్నర కాలం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యమంత్రి పదవి కూడా ఊహించకుండానే పీవీ చేతికందింది. 1969లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఆ ఉద్యమంలో పోలీస్‌ కాల్పుల్లో 369 మంది ఉద్యమకారులు చనిపోయారు. దీంతో పార్టీ హైమాండ్‌ బ్రహ్మానందరెడ్డిని తప్పించి విద్యా శాఖ మంత్రిగా ఉన్న పీవీని సీఎం పీఠంపై కూర్చోబెట్టింది.
దక్షిణ భారతానికి అదో పండగ రోజు
1991 పార్లమెంటు ఎన్నికల్లో పీవీ నరసింహారావు పోటీ నుంచి తప్పుకున్నారు. పీవీ ఇక రాజకీయ సన్యాసమనే అంతా భావించారు. అయితే నాటి ప్రధాని, కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్‌ గాంధీ మరణానంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పీవీ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆయనను ప్రధానమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. అలా తన ప్రయత్నం లేకుండానే ప్రధానమంత్రి అయ్యారు పీవీ. సాధారణంగా అందరూ ఎన్నికల తర్వాత ప్రధాని అయితే.. పీవీ నరసింహారావు విషయంలో మాత్రం అది రివర్స్‌ అయింది. ముందుగా పీవీ ప్రధాని అయిన తర్వాత ఆయన నంద్యాల లోక్‌సభకు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పీవీ గెలుపు ఓ రికార్డ్‌గా మిగిలిపోయింది. ప్రత్యర్థులకు డిపాజిట్లు గల్లంతవడమే కాదు..పీవీకి 90 శాతం ఓటింగ్ నమోదు కావడం అప్పట్లో దేశ రాజకీయాల్లోనే సంచలనంగా మారింది. పీవీ ఎన్నికను ఏకగ్రీవం చేయాలనే కాంగ్రెస్‌ ప్రయత్నం ఫలించకపోవడంతో ఎన్నికలకు పోవాల్సి వచ్చింది. పీవీ ఎన్నిక చుట్టూ, తెలుగు జాతి వైభవం, కాంగ్రెస్ పార్టీ ప్రాభవం వంటి మాటలు దేశ రాజకీయాల్లో చక్కర్లు కొట్టాయి. స్వతంత్ర భారత చరిత్రలోనే 1991 జూన్‌ 21 రోజుది ఓ మహత్తరమైన స్థానం. తెలుగు ప్రజలకు, ఇంకా చెప్పాలంటే దక్షిణ భారతానికే అదో పర్వదినం. ఆనాటి ఆంధ్రప్రదేశ్‌ నివాసి, తెలుగువాడు, భారతదేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టడం అంటేనే ఓ సంచలనం. పీవీ నరసింహారావు ప్రధాని అయ్యాడనే వార్తను దక్షిణభారత ప్రజలు ఎవరూ నమ్మలేకపోయారు. అంతకు ముందు 45 ఏళ్ల రాజకీయాలను పరిశీలిస్తూ వచ్చిన ప్రజలు తెలుగువాడేమిటీ ప్రధానమంత్రి కావడమేంటనీ విస్తుపోయారు. భారత ప్రధానమంత్రి పదవి ఉత్తరభారతీయులకు మాత్రమే. అందులోనూ నెహ్రూ కుటుంబానికి మాత్రమే దాని మీద వారసత్వపు హక్కు ఉందని దేశ ప్రజల గుండెల్లో శాశ్వతంగా ముద్రపడిపోవడమే ఈ ఆశ్చర్యానికి కారణం ఢిల్లీ పీఠంమీద దక్షిణాదివాడా? అందులోనూ తెలుగువాడా? అంటూ హేళన చేశారు. రాష్ట్రపతి భవన్‌లో దేశ ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడు ప్రజలంతా టీవీలు, రేడియోలకు అతుక్కుపోయారు. అదో చారిత్రక ఘట్టం.
గొప్ప రాజనీతిజ్ఞుడిగా ప్రశంసలు
పీవీ నరసింహారావు ఏ పదవి చేపట్టినా తన సమర్ధతతో ఆ పదవికి వన్నె తెచ్చారు. 1962లో నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో పీవీ నరసింహారావు తొలిసారిగా మంత్రి అయ్యారు. పీవీకి సీఎం సంజీవరెడ్డి జైళ్ల శాఖను అప్పగించారు. జైళ్ల సంస్కరణల్లో భాగంగా తొలిసారిగా ఓపెన్ జైళ్ల విధానాన్ని తీసుకొచ్చి యావత్‌ దేశాన్ని తన వైపు చూసేలా చేశారు. ఒక్కసారిగా పీవీ పేరు జాతీయ స్థాయిలో వినిపించింది. ఆ తర్వాత రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వైద్యశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్‌ చేయడాన్ని నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చారు. అనంతరం విద్యా శాఖ మంత్రిగా పనిచేసిన పీవీ వినూత్న విధానాలు ప్రవేశపెట్టారు.
మాతృభాషాభివృద్ధికి కృషి
పీవీకి 17 భాషల్లో ప్రావీణ్యం ఉన్నప్పటికీ తన మాతృభాష అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. తెలుగు అకాడమీని ప్రారంభించడం, తెలుగు మీడియం ద్వారా ఉన్నత విద్య వంటి కార్యక్రమాలు విద్యాశాఖ మంత్రిగా పీవీ నరసింహారావు అమలు చేసినవే. 1988లో కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలో జాతీయ స్థాయి విద్యా రంగంలో అనేక సంస్కరణలకు పునాదులు వేశారు. నవోదయ విద్యాలయాలు ఏర్పాటు ఆయన హయాంలో జరిగిందే. పీవీ నరసింహారావు కేంద్రంలో హోంశాఖ, రక్షణ శాఖ, విదేశాంగ శాఖ మంత్రిగానూ పని చేసి, మన్ననలు అందుకున్నారు. ఏ పదవి చేపట్టినా అందులో అధునికతను సంతరించుకునేలా చేశారు. గొప్ప రాజనీతిజ్ఞుడిగా ప్రపంచస్థాయి నేతలు కొనియాడేలా చేసుకున్నారు.
చదువులమ్మ కిమ్మోవి
పీవీలో గొప్ప సాహిత్యకారుడు పీవీ నరసింహారావు 17 భాషల్లో పండితుడు. గోండుల భాష నుంచి స్పానిష్ వరకూ అనర్గళంగా మాట్లాడగలిగే దిట్ట. క్యూబా యోధుడు ఫిడేల్ క్యాస్ట్రోతో స్పానిష్‌లో మాట్లాడి ఆశ్చర్యపరిచారట. పీవీలో గొప్ప రచయిత సైతం దాగి ఉన్నారు. కథలు, వ్యాసాలు, అనువాద రచనలు అనేకం చేశారు. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంతో రాసిన ‘గొల్ల రామవ్వ’ రచన ఎంతో మంది సాహిత్యకారులను ఆకట్టుకుంది. ‘ఇన్ సైడర్’ పేరుతో పీవీ తన ఆత్మకథను ఆవిష్కరించారు. విశ్వనాథ సత్యనారాయణ ‘వేయి పడగలు’ నవలను ‘సహస్రఫణ్’ పేరుతో పీవీ హిందీలోకి తర్జుమా చేశారు. ప్రధానిగా తీరిక లేకుండా ఉన్నా క్రమంత తప్పకుండా అవధాన కార్యక్రమాలకు హాజరవుతూ ఉండేవారు. అవధాన కార్యక్రమాల ద్వారా ఎంతో ప్రశాంతత లభిస్తుందని మిత్రుల వద్ద చెప్పేవారు. పీవీకి 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడే సత్తా ఉన్నా ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడేవారు. అందుకే అయన మిత్రులు 17 భాషలు తెలిసిన మౌనముని అంటూ ఆటపట్టించేవారు.
ఆర్థిక జవసత్వాలు నింపిన తెలుగు బిడ్డ
.సాధారణంగా రూపాయి విలువ పతనమైతే ఆర్థిక వ్యవస్థ కుంగిపోతోందని ఆందోళన చెందుతాం.. కానీ, మన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి గతంలో ఓసారి ప్రభుత్వమే కరెన్సీ విలువను భారీగా తగ్గించింది. నాడు ఇచ్చిన ఆ షాక్ ట్రీట్మెంట్తో ఆర్థిక వ్యవస్థ కోలుకుంది. అంపశయ్యపై నుంచి దిగి.. ఇప్పుడు రేసుగుర్రంలా పరుగులు పెడుతోంది. భారత్కు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిన ఆ ఆర్థిక వైద్యుడి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. 9వ ప్రధానిగా దేశానికి ఆర్థిక జవసత్వాలు నింపిన తెలుగు బిడ్డ.
పీవీకి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. పీవీ మరణానంతరం 2024లో ఎన్డీఏ ప్రభుత్వం భారత రత్నను ప్రకటించింది. ఎంతటి సంక్షోభాల్ని అయినా ఎదుర్కొనే స్థితప్రజ్ఞతా స్ఫూర్తి రగిలించాలి! ‘దేశం నీకేమిచ్చిందని కాదు, దేశానికి నువ్వేం చేశావన్నదే ప్రధాన మంటూ ఆరు దశాబ్దాల నాడు జాన్ ఎఫ్ కెనెడీ చేసిన మేలిమి వ్యాఖ్యే ప్రామాణికమైతే- పీవీ, భరతమాత రుణం తీర్చుకొన్న ధన్యజీవి.
(వ్యాస రచయిత ప్రముఖ విశ్లేషకుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Why BJP faces resistance in some states?

(Dr Pentapati Pullarao) In the 2024 elections, the BJP made...

ఒకే విడతలో రూ. 2 లక్షల రుణ మాఫీ: రేవంత్

తుమ్మల, పొంగులేటి ఇచ్చేది మాత్రమేఅధికారిక సమాచారంకాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన సీఎంహైదరాబాద్, జూన్...

అమరావతి ఆంధ్రుల ఆశల ఆకృతి

(వాడవల్లి శ్రీధర్)అ) అమరావతి (ఆ) ఆంధ్రప్రదేశ్ రెండూ అక్షర క్రమంలో రాజధాని...

రెండు ఫైల్స్ పై పవన్ తొలి సంతకాలు

ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరణవిజయవాడ, జూన్ 19 : రాష్ట్ర ఉప...