తెలుగు చదువులకు ఉద్యోగాలు ఇవ్వండి!

Date:

2019 ప్రపంచ తెలుగు రచయితల సంఘం మహాసభలలో నూర్ బాషా రహంతుల్లా
4 వ ప్రపంచ తెలుగు రచయితల సంఘం మహాసభలు విజయవాడలో జరిగాయి. 11 తీర్మానాలు చేశారు. తెలుగు చదువులకు ఉద్యోగాలు ఇవ్వండి అని కూడా తీర్మానం చేరిస్తే బాగుండేది. కోటివిద్యలు కూటికోసమే కదా? సంస్కృతి సాహిత్యాల పురోగతి గురించిన చింతన బాగానే జరిగింది. కవిత్వమూ పుస్తకావిష్కరణలూ తెలుగు భాషను మాధ్యమంగా ఉంచాలన్న ప్రసంగాలూ మారుమోగిపోయాయి. పాపం మండలి బుద్ధప్రసాద్ గారి లాంటివాళ్లు ఇంకా తెలుగు వెనకాలేపడి పరుగుతీస్తున్నారు. బీజీపీ ఎమ్మెల్సీ మాధవ్ గారి లాంటి చాలామంది తెలుగు మాధ్యమంలో చదివినవారికీ, పోటీ పరీక్షలు రాసిన అభ్యర్ధులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఈ సభల్లో కోరారు. ఉద్యోగాలు రాక ప్రజల ఆదరణ తగ్గింది. మీటింగ్ ఎదుటివారికి మాత్రమేనా? వీళ్ళ పిల్లలు అందరూ ఏ స్కూలుకు వెళుతున్నారో చెప్పాలి అని కొందరు వింతగా ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఒకవేళ ఎవరన్నా తమ పిల్లలను తెలుగు మీడియం స్కూళ్ళకు పంపాలనుకుంటే సరైన స్కూలు కావాలి. తెలుగు బడుల్లో నీటి వసతి, మరుగుదొడ్లు ఉండవు. పిల్లల్ని ఎలా పంపిస్తారు? కార్పొరేట్ స్కూళ్ళు కాన్వెంట్లను చూసి తెలుగుబడులను చూస్తే ఏమనిపిస్తుంది? ఎలా ఉంటుంది? తెలుగు బడులు పాలకుల ప్రజల నిరాదరణకు గురైన కారణంగా ప్రైవేటు వాళ్ళు కాన్వెంట్లతో సొమ్ముచేసుకున్నారు. తెలుగులో చదివితే ఉద్యోగాలు ఇస్తున్నారా? ప్రోత్సాహకాలు ఏమున్నాయి? మనిషి ఆశబోతు. ఎటు లాభం ఉంటే అటే పోతాడు. ప్రజల పాలకుల ఆదరణ ఆచరణ ఉంటేనే ఏ పధకమైనా సఫలం అయ్యేది.

అరసి పాలిచ్చి పెంచిన అమ్మయైన విషము పెట్టిన కుడుచునే ప్రియసుతుండు అన్నట్లు రేపు ప్రభుత్వ ఆంగ్లమీడియమ్ స్కూళ్ళలో కూడా ప్రాధమిక సదుపాయాలు లేకపోతే ప్రైవేటు కాన్వెంట్లదే రాజ్యం! తెలుగు లోనే. చదువు ఉండాలి ఇంగ్లీషు వద్దు అనే వాళ్లూ ఉన్నారు. చాలా తక్కువగా ఉన్నప్పటికీ అల్పసంఖ్యాకుల భాషను కాపాడటం ప్రభుత్వధర్మం. నా తల్లి అనాకారి అయినా పేదరాలైనా నాకు ఇష్టమే. నిజాన్ని నిజమనే చెబుదాం. ఇంగ్లీషు మీడియం స్కూలైనా మరుగు దొడ్డి లేకపోతే చేర్చం. న్యాయం అడగటం కూడా పోరాటమే. అహింసాయుత పోరాటాలకు ఎవరి అడ్డూలేదు. తెలుగును ఒక సబ్జెక్టుగా తప్పనిసరిగా చదవాలని ఉత్తర్వులు ఇచ్చారు అని అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు అంటున్నారు. తెలుగు సభల్లోనేమో అందరి కోరికా. తెలుగును కాపాడుకోవాలి, అన్ని సబ్జెక్టులనూ యధాతధంగా తెలుగులో కొనసాగించాలి అని. సభల్లో ఎక్కువమంది కోరిక ఏమిటంటే తమిళ మాధ్యమ విద్యార్ధులకు ఇస్తున్నట్లే తెలుగు మాధ్యమ విధ్యార్హులకూ ఉద్యోగాలు ఇప్పించి తెలుగులో పాలన జరపాలని, ఆంగ్ల మాధ్యమాన్ని రద్దు చేయనక్కరలేదు. తెలుగు మాధ్యమాన్ని కూడా ఉంచండి. తెలుగులో తీర్పులు, పాలన ఉంటాయని కదా తెలుగు రాష్ట్రాన్ని తెచ్చుకుంది? తెలుగులో చదివినవారికి ఉద్యోగాలు కల్పించాలి. ఎన్టీ రామారావు గారి పాలన వరకూ సర్వీసు కమీషన్ పరీక్షల్లో తెలుగు మాధ్యమ అభ్యర్ధులకు ఇచ్చిన 5 శాతం ప్రోత్సాహక మార్కులను పునరుద్ధరించాలి. తమిళనాడులో లాగా తెలుగు మాధ్యమంలో చదివిన వారికి ఉద్యోగాలిస్తూ ప్రభుత్వం అండగా నిలవాలి. తెలుగు పత్రికాధిపతులు, తెలుగు భాషాసంఘాల వాళ్ళు మౌనంగా ఉండకూడదు. తెలుగు మాధ్యమ విద్య కోసం హైకోర్టుకు వెళ్ళిన భాషాభిమానులకు న్యాయవాదులకు కృతజ్ఞతలు. భాషాభిమానం ఒక్కటే మనల్ని కాపాడదు. బాష ద్వారా బువ్వ దొరికేలా చెయ్యాలి. తెలుగు మాధ్యమం ద్వారా కూడా ఉద్యోగాలు దొరుకుతుంటే జనం ఎవరూ చెప్పకుండానే ఎగబడతారు. తెలుగు ద్వారా ఉద్యోగాలెప్పుడో అని మొదటి ప్రపంచ తెలుగు సభల్నాడే శ్రీశ్రీ తన అసంతృప్తిని వెళ్ళగక్కాడు. ఇంగ్లీషు లిపినే తెలుగుకు వాడుకుందామన్నాడు. ఆయన మాట ఎవరూ వినలేదు. తెలుగు పాఠ్యపుస్తకాలలో తేలికైన తెలుగు పదాలకు బదులు కఠిన సంస్కృత పదాలు కుమ్మరించి, ఆంగ్ల పదాలను కూడా అడ్డుకొని పిల్లలు తెలుగు చదువంటే పారిపోయేలా చేశారు. వేలాది ఇంగ్లీషు పదాలను జనమే సొంతంచేసుకున్నారు. ఇప్పుడు ఇంగ్లీషే సులభం అని కొందరు న్యాయమూర్తులు కూడా అంటున్నారు. ప్రజల నాడి కనిపెట్టిన పాలకులు తధాస్తు అంటున్నారు. ఇక ప్రజల భాష తెలుగు పాలనా భాష అవుతుందా? అలాంటి ఆశలు మనము ఉన్నాయా? అడగకపోతే అమ్మాయినా పెట్టదు అని సామెత. అవసర సమయంలో అన్నార్తి అడగకపోతే ఎలా?
తెలుగు అధికార భాష కావాలంటే, తెలుగు దేవభాషే, తెలుగులో పాలన అనే నా మూడు పుస్తకాలలో నేను కోరింది ప్రజల భాష పాలనా భాషగా మారాలనే. రాజ్యాంగం 345 ఆర్టికిల్ ప్రకారం ఎవరి భాషను వాళ్ళు కాపాడుకోవాలి, అధికార భాషగా అభివృద్ధి చేసుకోవాలని, చెన్నై మదురై, బెంగుళూరు హైకోర్టులు చెప్పాయి. ఆ రాష్ట్రాలలో తమిళ, కన్నడ భాషలు పాలనాభాషలుగా ఉండాలని కోరాయి. తమిళనాడులో తమిళ అభ్యర్దులకు 20 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని జీవో ఇచ్చారు. ఆప్పట్లో తెలుగు మీడియం అభ్యర్ధులకు 10 శాతం ఉద్యోగాలు కోటా ఇస్తామని మన మంత్రులు కూడా ప్రకటించారు. తెలుగు మాధ్యమంలో చదివిన అభ్యర్డులకు ఉద్యోగాలలో 20% రిజర్వేషన్ ఇవ్వాలని విజయవాడ తెలుగు మహాసభల్లో ఒక తీర్మానం చేసినట్లయితే బాగుండేది. కనీసం గ్రామ సచివాలయాల్లో ఉద్యోగ నియామకాలకు కూడా తెలుగు మాధ్యమం లో చదివిన అభ్యర్డులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తే బాగుండేది. ఎందుకంటే గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులందరూ గ్రామ ప్రజలతో మమేకమై వారితో ముఖాముఖి తెలుగులో మాట్లాడుతూ వారిమధ్యే నివసిస్తూ వారికి సేవలందించే ఉద్యోగులు. ప్రజలు వారి భాషలో చెప్పే సమస్యలు, పరిష్కారాలు,సూచనలు వినాలి, రాయగలగాలి. ఈ నైపుణ్యాలన్నీ ప్రజల భాష తెలుగు మాధ్యమంలో చదివిన వారికే ఎక్కువగా ఉంటాయి. ఆఫీసుల్లో తెలుగు బ్రతుకుతుంది. తెలుగు విూడియంలో చదివితే ఉద్యోగాలొస్తాయన్న ఆశతో కొంత మందైనా తెలుగులో చదువుతారు. అధికారులు కార్యాలయాల్లో జరిగే పనులన్నిటి ద్వారా తెలుగును అమలుచేస్తారు. తెలుగు పదకోశాలు అమలవుతాయి. పరిపాలనకు పనికొచ్చే శాస్త్రీయ పాలనా తెలుగు తయారవుతుంది. అధికార భాషగా తెలుగు అమలు కావాలంటే తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థుల్ని ప్రోత్సహించి అధికారులుగా చేయక తప్పదు. ఇంకొందరు పాలనా నిపుణులు లేవనెత్తిన డిమాండ్లు ఏమిటంటే : తెలుగు అనువాదాలు బాగుపడాలి, ఆంగ్ల కీబోర్డు ద్వారా తెలుగు లిపి పొందే దానిలో వస్తున్న సమస్యలను ఇంకా తొలగించాలి అని. ఉద్యోగాలు దొరకక పొతే మన ప్రజలు పిల్లల్ని తెలుగులో చదివించరు. తెలుగు భాషలో మాత్రమే చదివిన వారికి వెనుక బడిన కులాలవారికి ఇస్తున్నట్లుగా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి.తెలుగురాష్ట్రాలలో తెలుగు భాష రక్షణ, తెలుగులో పాలన కోసం తెలుగు మాధ్యమంలో చదివినవారికి ప్రోత్సాహకాలు, ఉద్యోగాలు కల్పిస్తూ ప్రభుత్వాలు అండగా నిలవాలి.
(వ్యాస రచయిత ఏపీ విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Challenges before Congress

(Dr Pentapati Pullarao) The Congress party is enjoying the...

అక్షర చరిత్ర, వరంగల్ ఎమర్జన్సీ: అగ్నిఅక్షర చరిత్ర

‘‘ఇంకెక్కడిదీ ‘చైతన్య’, శ్రీధర్?’’(మాడభూషి శ్రీధర్)అది చందా కాంతయ్య మెమోరియల్ (సికెఎం) కళాశాల,...

పీవీ తెలుగు ఠీవి

నేడు భారతరత్న పీవీ నరసింహారావు జయంతి (వాడవల్లి శ్రీధర్)చరిత్రకు ఓ చెడ్డపేరుంది- అదెప్పుడూ...

Why BJP faces resistance in some states?

(Dr Pentapati Pullarao) In the 2024 elections, the BJP made...