రాజకీయాలకు అతీతంగా చర్యలు
(సుబ్రహ్మణ్యం వి.ఎస్.కూచిమంచి)
మనం చిన్నప్పుడు చదువుకున్న సైన్స్ పాఠాల్లో హైడ్రా అనే సూక్ష్మ జీవి గురించి విన్నాం. హైడ్రా నడకే విభిన్నంగా ఉంటుంది. అమీబా మాదిరిగా విస్తరించడం కాకుండా పిల్లి మొగ్గలు వేస్తూ, చకచకా నడుస్తూ తన గమ్యాన్ని చేరుకుంటుంది. లక్ష్యాన్ని ఛేదిస్తుంది. నేటి హైడ్రా కూడా అంటే. నేటి హైడ్రా అంటే….? జలవనరులను ఆక్రమించి, భారీ కట్టడాలను నిర్మించిన వారి భరతం పడుతోంది. అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ మొదలు మునిసిపల్ చైర్మన్ వరకూ ఎవరినీ విడిచిపెట్టడం లేదు. ఎప్పుడు తమ మీదకు జె.సి.బీ.లు దూసుకు వస్తాయోనని ఆక్రమణదారులు హడలి పోతున్నారు. వారి గుండెల్లో హైడ్రా జె.సి.బి.లు నిద్రిస్తున్నాయి అనడంలో సందేహం లేదు.
కేంద్ర మాజీ మంత్రి ఎం.ఎం. పళ్ళంరాజుకు సంబంధించిన నిర్మాణాలను సైతం హైడ్రా కూల్చివేసింది. ఈ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానవర్గ స్థాయిలో చర్చించినట్లు ఈ ఆదివారం కొత్తపలుకులో ఆంధ్ర జ్యోతి ఎం.డి. రాధాకృష్ణ కూడా రాశారు. ప్రస్తుత ముంపునకు కారణం హైదరాబాద్ పరిధిలో ఉన్న చెరువుల ఆక్రమణే. ఎఫ్.టి.ఎల్. పరిధిలో నిర్మించిన కట్టడాలను హైడ్రా కమీషనర్ రంగనాథ్ లక్ష్యంగా చేసుకున్నారు. దీనికి సంబంధించి ఆయనకు స్పష్టమైన ఆదేశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. రాజకీయ పార్టీలకు అతీతంగా కట్టడాల కూల్చివేత సాగుతోంది. తాజాగా అమీన్ పూర్ మునిసిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డికి సంబంధించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. పటాన్ చెరు ఎమ్మెల్యే జి. మహిపాల్ రెడ్డికి సన్నిహితుడైన పాండురంగారెడ్డి ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయినప్పటికీ హైడ్రా వెనకడుగు వేయలేదు.
హైద్రాబాదులో ఎన్ని చెరువులు ఉన్నాయి? ఏ స్థితిలో ఉన్నాయి? వంటి వివరాలను సమగ్రంగా సేకరించి, రంగంలోకి దిగింది హైడ్రా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంలో స్పష్టమైన వైఖరినీ, కృతనిశ్చయాన్నీ ప్రదర్శిస్తున్నారు. దీనికి తోడు హైడ్రా కమీషనర్ ఏ.వి. రంగనాథ్ విధి నిర్వహణ శైలి దురాక్రమణదారులకు నిద్ర పట్టనివ్వడం లేదు. చినుకు పడితే చిత్తడి నుంచి మునిగిపోయే స్థాయికి చేరిన ప్రాంతాలను విముక్తం చేయడం లక్ష్యంగా హైడ్రా సాగుతోంది.
హైడ్రా కొరడా
Date: