కీలక సమయాల్లో ఆలస్యమైతే…

Date:

అత్యున్నత అధికారి సైతం డెస్కులో పని చేస్తారు
నేను-ఈనాడు: 23
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)

అది 1993 జూన్‌ మూడో వారం… ధవళేశ్వరం వద్ద గోదావరి నదిలోకి బస్సు దూసుకెళ్ళిపోయిన ఘటనలో 36మంది జలసమాధి… ఆఫీసుకు వెళ్ళేసరికే డెస్కు చాలా సందడిగా పనిచేసుకుంటోంది… ఆ సమయానికి అంత బిజీగా ఏమీ ఉండదు… అందరూ ఫోన్లలో బిజీగా ఉన్నారు… నన్ను చూసి ఇన్చార్జి ఎప్పుడూ చేసే పలకరింపు నవ్వు కూడా లేదు. ఏదో ఉందనుకున్నాను. ఒక పది మంది జాబితా నా ముందు పెట్టాడాయన.. వీరంతా మీ డివిజన్‌ పరిధిలోని వారు.

(అప్పట్లో తూర్పు గోదావరి జిల్లాను కోనసీమ, రాజమండ్రి, పెద్దాపురం, కాకినాడ అనే డివిజన్ల కింద విభజించుకుని పని సౌలభ్యం కోసం ఆయా కేంద్రాలలోని కంట్రిబ్యూటర్లను కేటాయించుకున్నాం. దీనివల్ల బాధ్యత ఉంటుంది. ఒక్కొక్కరికీ పది నుంచి పన్నెండు మంది కంట్రిబ్యూటర్లు ఉండేవారు. వారికి ప్రతిరోజు అసైన్‌మెంట్లివ్వడం.. రప్పించుకోవడం.. వచ్చిన వాటిలో మేలిమిని కలర్‌పేజీలూ లేదా.. మొదటి పేజీకి తిరగరాసి ఇవ్వడం చేసేవారం. వీరికి ప్రతిరోజు రాత్రి ఇంటికి వెళ్ళబోయే ముందు మరుసటి రోజు ఏంచేయాలో సూచిస్తూ లేఖలు రాసి, పేపర్‌ పార్సిల్‌లో పెట్టేవారం. వారికి పేపరుతో పాటు అక్కడి ఏజెంట్‌ అందించేవారు. వారు దానిని చదువుకుని ఏమైనా సందేహాలుంటే ఫోను చేసి తీర్చుకునే వారు) చనిపోయిన పదిమందీ పేర్లు, ఊర్లూ రాసున్నాయి.. ఏమిటని అడిగాను… విషయం చెప్పారు కాస్త కటువుగా.

ఈలోగా మేనేజర్‌ జివి రావు గారు.. వచ్చారు.. సుబ్రహ్మణ్యం గారు ఇలాంటి సందర్భాలలో కొద్దిగా ముందు రావాలి కదండీ… అన్నారు.. సమాచారం నాకు తెలీదంటే వినరని నాకు తెలుసు.. మౌనంగా ఉండిపోయాను.

(నాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదో డెస్క్ ఇంచార్జి చెప్పలేదు… మిగిలిన డెస్క్ మిత్రులు నోరు మెదపలేదు. ఇది ఈనాడు వర్కింగ్ స్టైల్. ఎవరికీ వారు తెలుసుకుని సమయానుకూలంగా స్పందించాలి. సర్వ శక్తులను ఒడ్డి పనిచేయాలి అంతే… దీని గురించి నేను ఎక్కువగా వివరించనవసరం లేదు. ఎవరినీ తప్పు పట్టలేము కూడా.. అవసరమైతే సంస్థలో అత్యున్నత స్థాయిలో ఉన్నవారు కూడా డెస్కులో కూర్చుని పనిచేసిన సందర్భాలు ఉన్నాయి.. అవి ముందు ముందు వస్తాయి)

మృతులందరి వివరాలను, ఏ కోణంలో వార్త రావాలో కంట్రిబ్యూటర్లందరికీ వివరించాను ఫోనులో… రెండు గంటలలో ప్రాథమిక సమాచారం సిద్ధమైంది. ఇక తరువాయి సమాచారం అందేలోపు.. ఉన్న వివరాలతో వార్తలను తయారు చేసుకున్నాం. ఇక్కడ కూడా బృంద ప్రణాళిక…. లేదా కార్యాచరణ.. చక్కగా వర్క్‌ చేసింది. ఫలితం… ఈనాడులో అత్యద్భుతంగా కవరేజి ఉందనే కామెంట్‌.
అది శుభవార్తయినా.. చావు వార్తయినా.. ఇంకేదైనా… మిగిలిన పత్రికలతో బేరీజు వేసుకుని చంకలు గుద్దుకోవడం పరిపాటైపోయింది. బాగా ఇస్తే.. ప్రశంస.. లేకపోతే.. విమర్శ… రామోజీరావుగారి నుంచి మాకేమి అందేవో వేరే చెప్పనవసరం లేదనుకుంటా.


వైజయంతి వేసిన ప్రశ్న ఏమిటంటే…
ఇంత ఘోరమైన ప్రమాదాల వార్తలను మామూలుగా చదివేస్తూ.. రాసేస్తూ ఉన్న నన్ను చూసి నా భార్య వైజయంతి అడిగింది… ఇలాంటి వార్తలు చదివేటప్పుడూ లేదా.. ఫొటోలు చూసేటప్పుడూ నీకు భయమేయదా అని… అలా అడగడానికో కారణముంది. నాకున్న ఓ రుగ్మత. డాక్టరు దగ్గరికి వెళ్ళినప్పుడు.. ఇంజక్షన్‌ చేస్తుంటే ఎవరైనా… అబ్బా అన్నా… నా గుండె మెలితిప్పినట్లవుతుంది. కాలి వేళ్ళ దగ్గర్నుంచి… తిమ్మిర్లు మొదలవుతాయి.. తల భాగానికి అది మెల్లగా పాకుతుంది.. రెండు మూడు సెకన్ల పాటు స్పృహ కోల్పోతాను. తదుపరి విపరీతమైన నిస్సత్తువ ఆవహిస్తుంది. అది నాలుగైదు రోజులపాటు పీడిస్తుంది.
ఏదైనా దుర్ఘటన వార్త విన్నా.. చూసినా…చుక్క రక్తం కంటబడినా అదే పరిస్థితి.. అందుకే అలాంటి దృశ్యాలు రోడ్డు మీద కనిపిస్తే వేరే మార్గంలో వెళ్లిపోయేవాడిని. ఏదైనా ప్రమాదం సంభవించిన విషయం తెలిస్తే వేరేమార్గంలో వెళ్ళిపోయేవాడిని. కళ్ళు తిరిగి రోడ్డు మీద పడతానేమోననే భయం.. అలా వెళ్ళినా… అక్కడి దృశ్యం నా మస్తిష్కంలో తిరుగుతుండేది… రక్తపు చారికలు.. దెబ్బలు తగిలిన వాళ్ళు బాధతో వేసే కేకలు నాకు చెవుల్లో వినిపిస్తుండేవి. అదంతా భ్రాంతి అని తెలుసు… ఆ ఆలోచనా తరంగాల నుంచి బయటపడడానికి రకరకాలుగా ప్రయత్నించేవాడిని. అందులో అత్యుత్తమమైనది దైవధ్యానం… కొద్దిసేపటిలో మామూలయ్యేవాడిని.
దీన్ని దృష్టిలో ఉంచుకునే అలా ప్రశ్నించింది… నా భార్య…
అప్పుడు అనిపించింది… నిజమే… విధినిర్వహణలో ఉన్నప్పుడు అలా ఎందుకు కాదు. ఈ రకంగా ప్రయత్నించి నేను ఈ రుగ్మతనుంచి బయట పడవచ్చును కదా అనిపించేది. కానీ దుర్ఘటనల ఫొటోలను చూడడానికి సాహసించే వాడిని కాదు.. మెల్లిగా అలవాటైంది.. పనిలో ఉండగా… పెద్ద ఇబ్బంది పడేవాడిని కాను. బహుశా… అది జీవితానికి అవసరమైన అంశం కాబట్టి అలా పట్టించుకోలేదేమో..


నా ఈ రుగ్మతకు కారణం ఏమిటంటే..
ఇలా అవ్వడానికీ కారణముంది.. నేను ఇంటర్మీడియేట్‌ చదివే రోజుల్లో ఈ రుగ్మత మొదలైంది. అప్పుడు మేము రాజమండ్రి దానవాయిపేట పార్కు వెనుక గేటు ఎదురుగా ఉన్న సందులో హోతా వారి ఇంటి ఎదురుగా ఉన్న ఎత్తు అరుగుల ఇంట్లో ఉండేవాళ్ళం. పక్కవాటా వారి అబ్బాయి కూడా సీనియర్‌ ఇంటర్‌ చదువుతుండేవాడు. నా పేరే.. బాగా కలిసిపోయాం.. ఒకే కాలేజీ కూడా అవ్వడంతో మరింత స్నేహం కుదిరింది.. మార్చి నెలలో పరీక్షలు.. ఫిబ్రవరిలో శివరాత్రి వచ్చింది. ఒక పదిమంది కలిసి పట్టిసం (పట్టిసీమ) వెళ్ళాలనుకున్నారు.

రాత్రి మా ఇంటి తలుపు తట్టి నన్ను కూడా రమ్మన్నారు. మా నాన్నగారు వద్దన్నారు.. పరీక్షలకు సమయం చాలదని చెప్పారు. మా నాన్న గారంటే నాకు విపరీతమైన భయం. ఆయన ఎదురుగా తలెత్తి మాట్లాడను. సరేనని వాళ్ళు వెళ్ళి పోయారు.
మరుసటి రోజు శివరాత్రి… సెలవు కావడంతో నేను ఇంట్లో కూర్చుని చదువుకుంటున్నాను. పట్టిసం వెళ్ళిన వాళ్ళలో ఇద్దరు తిరిగొచ్చారు… మెల్లిగా మా తలుపు తట్టారు.. ఒక్కసారి బయటకు రా.. అని పిలిచారు.. అప్పుడే వచ్చేశారా… అన్నా.. ష్‌… అన్నట్లు సైగ చేశారు… పక్కవాటాలో ఉన్న వారికి కనిపించకుండా రెండో వైపు నుంచి బయటకు వెళ్ళాను. అప్పుడు వాళ్ళు చెప్పిన విషయం విని స్థాణువునై పోయాను.. కళ్ళు తిరిగిపోయాయి. నువ్వే చెప్పాలి ఈ విషయం.. వాళ్ళింట్లో… అన్నారు… నేనా… నేనెంత… నా వయసెంత… అనుకుంటూ ఆలోచిస్తున్నా….
ఇంతకీ వాళ్ళేం చెప్పారు…నేనేం చేశాను.. జరిగిందేమిటి.. నన్ను నిర్ఘాంతపోయేలా చేసిందేమిటి… తెలుసుకోవాలనుకుంటే రేపటిదాకా ఆగాల్సిందే…

వాస్తవాల నిర్థారణ ఈనాడుకు పట్టుగొమ్మ

1 COMMENT

  1. ఈనాడు అనే సంస్థ బానిసల్ని తయారు చేసే ఓ కర్మాగారం మాత్రమే.రామోజీరావు గారు పక్కా వ్యాపార వేత్త. ఆయన కావాలనుకున్న విధంగా సంస్థను నిర్వహించుకోవడం లో ఆయనను ఎవరూ తప్పు పట్టలేరు.ఎందుకంటే అది ఆయన పెట్టుబడి..దాని ద్వారా అధికార అపరిమిత అధికారం సంపద పొందాలన్నది ఆయన లక్ష్యం.అందుకనుగుణంగానే ఆయన పత్రికను చివరి వరకు నడిపారు.ఇప్పుడు ఆయన వారసులు కూడా అలాగే నడుపుతున్నారు. వారి వైపు అంతా సవ్యంగానే ఉంది..ఉంటుంది..కానీ ఈనాడు లో పనిచేయడం అన్నది జీవితంలో ఒక దురదృష్ట సమయం. అక్కడ పని చేసిన వారిలో ఒకటి రెండు శాతం తప్ప మిగిలిన వారంతా ఎందుకూ కొరగాకుండా పోయారు.కొంతమంది కమ్మ వాళ్లకు మాత్రమే మంచి జీవితం లభించింది. మిగిలిన వారంతా శేష జీవితాన్ని దుర్భరంగా గడుపుతున్న వారే. ఈనాడు ఉద్యోగులకు జీవితాన్ని ఆస్వాదించడం నేర్పదు. సంతోషంగా ఉండనివ్వదు. నిత్యం ఒకరి పై మరొకరి గూఢచర్యం..నరనరానా భయం నిస్సత్తువ లను పెంచుతుంది.సొంత ఆలోచనలను ఉండనివ్వదు.ఈనాడు లో మీ అనుభవాలు భవిష్యత్ జీవిత్తానికి ఎవరికీ ఏ విధంగానూ ఉపయోగపడవు..ఆఖరికి మీకు కూడా సర్..ఇది నా అభిప్రాయం సర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆరోజు డి.ఎన్. ప్రసాద్ ఏం చేశారంటే…?

ఎవరూ లేకున్నా ప్రత్యేక సంచికదీని వెనుక డి.ఎన్. ప్రసాద్ కృషిబాలయోగి మరణించి...

A Premier Rural Development Institute of India

National Institute of Rural Development and Panchayati Raj (NIRD&PR)...

Science for the common man

(Dr. N. Khaleel) Four years ago, Corona shook the world....

Watch CHAVA in a Theatre

(Dr Kamalakar Karamcheti) The Hero is captured by the villain...