ఒక పత్రిక పని విధానం ఎలా ఉంటుందంటే…

Date:

ఆ రోజుల్లో కంపోజింగ్‌ తీరు…
పేజీ మేకప్‌ ఆసక్తిదాయకం
ఈనాడు – నేను: 35
(సుబ్రహ్మణ్యం వి.ఎస్‌. కూచిమంచి)


వాస్తవానికి తరువాయి భాగంలో బాలయోగి గారి మరణానికి సంబంధించిన వివరాలను రాయాలి అనుకున్నాను. ఆయన మార్చి మూడో తేదీన కన్నుమూశారు. అందుకని ఆ రోజున అందించగలను. ఈ లోగా, ఈనాడులో డెస్కుల పనితీరు, కంట్రిబ్యూటర్‌ వ్యవస్థ గురించి వివరిస్తాను.

విజయవాడలో నేను ఉద్యోగంలో చేరే సమయానికి స్టాఫ్‌ రిపోర్టర్ల వార్తలు టెలిప్రింటర్స్‌ ద్వారా అందేవి. మండల విలేకరుల వార్తలు బస్సు పార్సిళ్ల ద్వారా అందేవి. వీటిని మండల విలేకరులు బస్సు డ్రైవర్లకు అందిస్తే, వారు వాటిని బస్సు స్టాండులో ఉన్న ఈనాడు బాక్సులో వేసేవారు. ఆఫీసు నుంచి బాయ్‌ రెండు గంటలకు ఒకసారి వెళ్లి వాటిని తీసుకొచ్చేవారు. వాటిని డెస్కులో విడదీసుకుని, తిరగరాసి కంపోజింగ్‌ సెక్షనుకు ఇస్తే, వారు వాటిని పెద్ద పెద్ద గాలీలలో కంపోజ్‌ చేసి ఇచ్చేవారు. వాటిని ఒక రోలరులో తిప్పి ముద్రించి ఇచ్చేవారు. వాటిని ప్రూఫ్‌ రీడర్స్‌ చదివి తప్పులు సరిచేసేవారు. వాటిని దిద్దిన తరవాత పేజీ డిజైన్‌ చేసేవారు. మళ్ళీ ప్రూఫ్‌ తీసి మరోసారి చూసిన తరవాత, ఫోటో తీసి, అవసరమైన చోట బాక్సులు గీసేవారు. దీనిని ఫిలింగా మార్చి, ప్లేట్‌ చేసేవారు. ఈ ప్లేట్లను, ప్రింటింగ్‌ మెషీనుపై సెట్‌ చేసి, ప్రింట్‌ చేసేవారు. ఇది నేను ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలో ప్రక్రియ.

తరువాత దశలో, కంప్యూటర్లు రంగ ప్రవేశం చేశాయి. అయినప్పటికీ మేము చేతి రాతతోనే వార్తలు రాసేవాళ్ళం. కంపోజింగ్‌ సెక్షన్‌ మాత్రమే ఏ.సి. ఇది కాకుండా ఫేసిమిలి ఉండేది. దీని సాయంతో పేజీలను యధాతథంగా ఈనాడు యూనిట్స్‌ అన్నింటికీ పంపే వీలుండేది. హైదరాబాద్‌ నుంచి ఫస్ట్‌ పేజీ వచ్చేది. ఆ పేజీలో ఏ యూనిట్‌ కి సంబంధించిన ప్రధాన వార్తను ఆ యూనిట్‌ వారు మార్పు చేసి ప్రింట్‌ చేసేవారు. ప్రత్యేక పేజీలు ఏమైనా ఉంటే, మార్పులు లేకుండా ప్రింటింగుకు పంపేవారు. ఈ బాధ్యతను ప్రాసెసింగ్‌ విభాగం చూసేది. నేను విజయవాడలో పనిచేసినప్పుడు జి.వి. రావు గారు దానికి ఇంచార్జి. ఆయన అన్ని పేజీలను దగ్గరుండి, జాగ్రత్తగా చూసేవారు. అవసరమైతే, స్కేల్‌ తీసుకుని ఆయనే గీతలు కొట్టడం. ఫిల్మును కత్తిరించడం కూడా చేసేవారు.

ప్రకటనల కోసం పేజీలలో ఖాళీలు విడిచిపెట్టేవారు. ఆ స్థానంలో వార్తలను నింపి, సరిచేసి ఇస్తే, ఆ పేజీని ప్రాసెస్‌ చేసి ప్లేట్‌ గా ప్రింటింగ్‌ కి సిద్ధం చేసేవారు. మెయిన్‌ పేజీ వేరుగాను, మినీ అంటే ఈనాడు తూర్పు గోదావరి పేజీ వేరుగాను సిద్ధమయ్యేవి. ఏ డెస్కుకు ఆ డెస్కుకు ప్రత్యేకంగా ఉప సంపాదకులు ఉండేవారు. డెస్క్‌కు ఒక ఇన్‌చార్జి. రిపోర్టర్లకు ఒక ఇన్‌చార్జి. పేజినేషన్, ప్రకటనల విభాగం, ప్రాసెసింగ్, కెమెరా సెక్షన్, అకౌంట్స్‌ సెక్షన్, ప్రింటింగ్‌ సెక్షన్‌… ఇలా ప్రతిసెక్షనుకి ఇన్‌చార్జ్‌లు.. వీరందరిపైనా మేనేజర్‌. ఈ మొత్తం ఉన్న భవనాన్ని రక్షించడానికి సెక్యూరిటీ విభాగం. ఇదంతా ఒక ఎత్తయితే… ట్రాన్స్‌పోర్ట్‌ మరొక ఎత్తు. ప్రింటింగ్‌ చేసిన దగ్గర్నుంచి.. పేపర్లను కట్టలు కట్టి, ఎప్పటికప్పుడు టాక్సీలలో ఎక్కించేవారు. మరుక్షణం అవి గమ్యానికి చేరేందుకు పరుగులు తీసేవి. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడ ఆలస్యమైనా అది మొత్తం లక్ష్యాన్ని దెబ్బతీసేది. ఉషోదయానికి ముందే పత్రిక పాఠకుడి గుమ్మంలో ఉండేది కాదు. ఆలస్యం సాధారణంగా డెస్కు దగ్గరే అయ్యేది. చివరి నిముషంలో ఏదో ఘోర ప్రమాదమో, కీలకమైన సంఘటనో, మరొకటో జరగడం కారణంగా ఎడిషన్‌ ఇవ్వడం పది నిముషాలు ఆలస్యమైతే… అది అన్ని విభాగాలూ దాటి వెళ్లేసరికి గంటకు పైగానే అయ్యేది. ఇలాంటి లెక్కలు చెప్పడంలో జి.వి.రావుగారు దిట్ట.

ఆలస్యమైన సందర్భాలలో ఆయన డెస్కుల దగ్గరకు వచ్చి మరీ ఈ విషయం చెప్పేవారు. తరవాత మేనేజర్‌ గారు క్లాస్‌ పీకేవారు. తొలినాళ్లలో ఈ విషయాలు ట్రైనీలకు అర్థం అయ్యేవి కావు. పట్టేవి కూడా కావు. ఎందుకంటే దీనికి బాధ్యత డెస్క్‌ ఇన్చార్జీది కాబట్టి. బాధ్యత పైబడితే తప్ప వీటి గురించి ఆలోచించాల్సిన పని.. మాబోటి వారికి ఉండేది కాదు. ఇచ్చిన వార్త తప్పులు లేకుండా రాయడం, డెస్క్‌ ఇన్‌చార్జికి ఇవ్వడం వరకే మా బాధ్యత. మధ్యలో మమ్మల్ని పేజ్‌ మేకప్‌ సెక్షన్‌ దగ్గరకు వచ్చి, ఏమి చేస్తున్నదీ పరిశీలించమనేవారు.

అక్కడ ఉండే మేకప్‌ ఆర్టిస్టులు మమ్మల్ని ఆట పట్టించేవారు. ‘ఆ కత్తెర ఇలా ఇవ్వు… ఇక్కడ వార్త రాలేదు.. వెళ్లి డెస్కుని అడుగు’ అంటూ తిప్పేవారు. నిజానికి ఆ అవసరం మాకు లేదు. ఎందుకంటే… రాసిన వార్త కంపోజింగ్‌ సెక్షన్‌ నుంచి నేరుగా బ్రోమైడ్‌ రూపంలో వాళ్ళ దగ్గరకే వచ్చేది. ఏ వార్త ఎక్కడ పేస్ట్‌ చెయ్యాలో డెస్క్‌ ఇన్‌చార్జి చెప్పేవారు. అది తెలియక, మేము ఆ సెక్షన్‌కి వెడితే మమ్మల్ని చూసి నవ్వేవారు. అది తెలియక మేము చిన్నబుచ్చుకునేవారం. ఇది కూడా ఒక రకమైన ర్యాగింగ్‌ లాంటిదేనని క్రమేణా తెలిసింది. నాకు గుర్తున్నంతవరకు, శివనాగేశ్వరరావు, మధు, కె.ఎస్‌. పేజీ మేకప్‌ ఆర్టిస్టులు. బ్రోమైడ్‌ పద్ధతి రాకముందు వీరంతా లెడ్‌ లలో ఉపయోగించి, గాలీలలో కంపోసింగ్‌ చేసిన వారే. ఇలా కంపోజింగ్‌ చేయడం ఎంతో కష్టం. లెడ్‌ లలో అక్షరాలు తిరగేసి ఉండేవి. ఒక్కొక్క అక్షరాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ, పేర్చి వాక్యాలను కంపోజ్‌ చేసేవారు. ఒక్కోసారి వార్త కంపోజింగ్‌ పూరై్త్తన తరవాత, ఎవరి చెయ్యో తగిలి గాలీ కింద పడిపోయేది. మళ్ళీ కంపోజింగ్‌ చెయ్యాల్సి వచ్చేది. ఒకసారి నేను చూస్తుండగానే, ప్రూఫ్‌ తియ్యడానికి వెడుతున్న గాలీ కిందపడిపోయింది. ఒక్క వార్తే కిందపడితే, ఎంతో కష్టం. అలాంటిది పేజీ మొత్తం పోతే… అలాంటి సందర్భాలలో ఇద్దరు ముగ్గురు ఒకేచోట చేరి వార్తలు పంచుకుని, వేగంగా కంపోజ్‌ చేసేవారు. ఆ సమయంలో డెస్కు ఎంత టెన్షన్‌ పడేదో మాటల్లో చెప్పలేము. ఆ సమయంలో ప్రాసెస్‌ ఇన్‌చార్జి అరుపులు. సమయం మించిపోతోందంటూ.. మెషిన్‌ సెక్షన్‌ ఇన్‌చార్జి పైకి వచ్చి పీకల మీద కూర్చునేవారు.

ఇలాంటి సందర్భంలోనే… 1990 అసెంబ్లీ ఎన్నికలలో నేను ఒక తప్పు చేశాను. ప్లేట్‌కి ఫిలిం వెళ్లే ముందు అది బయట పడింది. అప్పుడేం చేశాను? వచ్చే ఎపిసోడ్‌ లో…

లాయరు నుంచి లోక్ సభ స్పీకరుగా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఈనాడులో నేను చూసిన మేనేజర్లు

అత్త్యుత్తమ మేనేజర్ ఎవరంటే…ఈనాడు - నేను: 42(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి) ఈనాడులో నేను...

ఆందోళనలో ఉన్నా సంస్థ గురించే ఆలోచించాలట

మన పక్కనే గుర్తించలేని బల్లేలుంటాయిఈనాడు - నేను: 41(కూచిమంచి వి.ఎస్. సుబ్రహ్మణ్యం) ఈనాడులో...

India must carefully implement Delimitation

(Dr Pullarao Pentapati) A raging controversy has started on proposed...

Ukraine’s Zelensky stops Trump

(Dr Pentapati Pullarao) Since February 28, 2025, the roll has...