మార్చి 31 న న్యూ ఢిల్లీలో అందజేత
హైదరాబాద్, ఏప్రిల్ 03 : జలమండలిని వరల్డ్ వాటర్ అవార్డు వరించింది. వాటర్ డైజెస్ట్ అనే ప్రముఖ అంతర్జాతీయ సంస్థ 2024-2025 సంవత్సరానికి వరల్డ్ వాటర్ అవార్డ్స్ లో హైదరాబాద్ జలమండలికి గవర్నమెంట్ కేటగిరీలో ఉత్తమ ఎస్టీపీ అవార్డు లభించింది. యునెస్కో భాగస్వామ్యంతో నిర్వహించిన 19వ వాటర్ డైజెస్ట్ వరల్డ్ వాటర్ అవార్డ్స్ (2024-2025) సంవత్సరానికి ఎస్టీపీ/ మురుగు నీటి శుద్ధి అవార్డు లభించింది.
ఈ అవార్డును జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ ప్రధాన కార్యాలయంలోని మేనేజింగ్ డైరెక్టర్ ఛాంబర్ లో ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ లకు బుధవారం అందజేశారు. ఈ అవార్డు రావడంపై ఎండీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. నగరంలో అందరికీ తాగు నీరు అందించడంతో పాటు.. ఉత్పన్నమయ్యే మురుగును శుద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

నాగోల్ 320 ఎమ్మెల్దిల ఎస్టీపీ పర్యావరణ అనుకూలత, సమర్థవంతమైన మురుగు నీటి శుద్ధి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో విశేష ప్రాముఖ్యతను చూపినందుకు హెచ్.ఎం.డబ్ల్యు.ఎస్.ఎస్.బి. ఈ అవార్డుకు ఎంపికైంది. మురుగు శుద్ధి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడం, సమాజానికి పరిశుభ్రమైన.. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. అలాగే అధునాతన నీటి నిర్వహణ, సర్క్యులార్ ఎకానమీ విధానాలు, మురుగు నీటి పునర్వినియోగం వంటి అంశాలలో చేసిన కృషికి ఈ గుర్తింపు లభించింది.

నాగోల్ ఎస్టీపీ మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో పెద్ద ప్లాంట్ గా ప్రసిద్ధి చెందింది. చాదర్ ఘాట్ నుంచి ప్రారంభమయే మురుగు నీరు.. నగరంలోని వివిధ ప్రాంతాల్లోని ఎన్నో నాలాలను కలుపుకుంటూ నాగోల్ వద్దకు చేరుకుంటుంది. ఇక్కడ నిర్మించిన ప్లాంట్ ద్వారా నిత్యం 320 మిలియన్ గ్యాలన్ల మురుగు నీటిని శుద్ధి చేసి మూసీలోకి వదులుతున్నారు.

ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం మార్చ్ 31న డిల్లీలో జరిగింది. జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్, డైరెక్టర్ ప్రాజెక్ట్స్-I సుదర్శన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో జలమండలి ఎస్టీపీ సీజీఎంలు పద్మజ, సుజాత, జీఎం కుమార్, డీజీఎం నిరుపమ మేనేజర్లు పాల్గొన్నారు.