చెల్లని చెక్కుల కథనంపై తెలంగాణ వివరణ
గడువు తీరిపోవడమే కారణమని వెల్లడి
రైతు అమరుల కుటుంబాలకు అండగా నిలుస్తాం
హైదరాబాద్, డిసెంబర్ 1: తెలంగాణ ప్రభుత్వం పంజాబ్‌లోని రైతు కుటుంబాలకు ఇచ్చిన చెక్కులు నగదు కావడంలేదంటూ కొన్ని మీడియా సంస్థలలో వచ్చిన వార్తలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఖండించారు. వాస్తవాలను తెలుసుకోవాలని ఆయా సంస్థలకు ఆయన హితవు పలికారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల దేశ రైతాంగ పోరాటంలో అసువులు బాసిన పంజాబ్, హర్యానాకు చెందిన 709 రైతు కుటుంబాలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 22 మే 2022 న 1010 చెక్కులను అందచేశారు. ఈ చెక్కులు నగదు కావడం లేదని కొన్ని మీడియా సంస్థలు వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నాయని సోమేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే విషయం మీద తెలంగాణ ప్రభుత్వం తక్షణం స్పందించి విచారణ చేసిందన్నారు. మొత్తం 1010 చెక్కుల్లో 814 చెక్కులకు నగదు చెల్లించారన్నారు. బ్యాంకు నిబంధనల మేరకు, నిర్దేశిత 3 నెలల సమయం లోపల ఆ చెక్కులను బ్యాంకుల్లో డిపాజిట్ చేయకపోవడం వల్ల మిగిలిన కొన్ని చెక్కులకు నగదు చెల్లింపులు జరగలేదని వివరించారు. చెక్కులను నిర్దేశిత సమయంలో డిపాజిట్ చేయకపోవడం వల్ల జరిగిన సాంకేతిక పొరపాటే తప్ప మరోటి కాదనీ చీఫ్ సెక్రటరీ స్పష్టంచేశారు. ఈ అంశాన్ని సరిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించిందనీ, గడువుదాటిన తర్వాత డిపాజిట్ చేశారని చెప్తున్న మిగిలిన చెక్కులకు మరికొంత సమయం ఇచ్చి, నగదు చెల్లించేందుకు అనుమతివ్వాలనీ, (రీవాలిడేట్ చేయాలని) ప్రభుత్వం ఆయా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. ఇంకా ఈ విషయానికి సంబంధించి మరింత సహాయం కోసం ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ (రెవెన్యూ డిపార్ట్ మెంట్) రాంసింగ్ ను 9581992577 నెంబరులో సంప్రదించవచ్చని తెలిపారు.
అమరులైన రైతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని మరోసారి రాష్ట్రప్రభుత్వం స్పష్టం చేస్తోందనీ, ఆర్థిక సహాయం అందే దాకా తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని చీఫ్ సెక్రటరీ సుస్పష్టంగా ప్రకటించారు.
వాస్తవాలు తెలుసుకుని వార్తలు రాయాలి: సోమేష్ కుమార్
Date: