భోజనానంతరం కునుకు ఒక కిక్

Date:

శుక్రవారం ప్రపంచ నిద్ర దినోత్సవం
(డా.ఎన్. కలీల్)

నిదురపో… నిదురపో… నిదురపో
నిదురపోరా తమ్ముడా
నిదురలోన గతమునంతా
నిముషమైనా మరచిపోరా
కరుణలేని ఈ జగాన
కలత నిదురే మేలురా
నిదురపోరా తమ్ముడా… ఆ…
కలలు పండే కాలమంతా
కనుల ముందే కదలిపోయే… ఆ…
లేత మనసుల చిగురుటాశ
పూతలోనే రాలిపోయే
నిదురపోరా తమ్ముడా… ఆ…
జాలి తలచి కన్నీరు తుడిచే
దాతలే కనరారే…
చితికిపోయిన జీవితమంతా
చింతలో చితియాయె
నీడచూపె నెలవు మనకు
నిదురయేరా తమ్ముడా
నిదురపోరా తమ్ముడా 

అబ్బా ఎంత చక్కటి పాటాను రాశారు కీర్తిశేషులు సుసర్ల దక్షిణామూర్తి గారు.. ఇంకా ఇలా ఎన్నో పాటలు ఉన్నాయి…

సరే అసలు విషయానికి వస్తే..

చక్కటి ఆరోగ్యానికి నిద్ర దివ్యమైన ఔషధం. అలసి సొలసిన శరీరం, మనసు సేదదీరి సాంత్వన పొందేది నిదురలోనే. ఆమాటకొస్తే రోజూ ముల్లోకాలను కాపాడుతూ క్షణం తీరిక లేకుండా ఉండే ఆ దేవుడికి కూడా నిద్ర అవసరమే. అది గ్రహించాడు కాబట్టే భక్తాగ్రేసరుడైన అన్నమయ్య జో అచ్యుతా నంద జోజో ముకుందా, రావె పరమానంద రామ గోవిందా అంటూ జోలపా టతో తన ఆరాధ్యదైవాన్ని రోజూ నిద్రపుచ్చేవాడు. నిద్ర సుఖమెరుగదు. మేడ మిద్దెలో ఉన్నా, చెట్టునీడ పడుకున్నా నిదురలోకి జారుకున్నాక ఇక ఈ లోకం సంగతి పట్టదు. మన స్థితిగతులు మనకు గుర్తుకురావు. చీటికిమాటికి స్ఫురణకొచ్చి మనసును కలత పెట్టే కష్టాలు, కన్నీళ్లు నిద్రలో ఉన్నప్పుడు మన దరిదాపులకు కూడా రావు. కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది అని మనసుకవి పడుకునే తీరునుబట్టి నిద్ర పలురకాలు. గాఢనిద్ర ఒంటికి మంచిదనేవారే ఒళ్లు తెలియకుండా పడుకుంటే
‘ఏవిటా మొద్దునిద్ర’ అని మందలించడమూ కద్దు. పడుకున్నది మొదలు తడవ తడవకూ నిద్ర లేచేవారిని ‘కోడి కునుకు’ అంటూ ముద్దుగా కసురుకోవడమూ తెలిసిందే. కోడి పట్టుమని పది నిమిషాలు కూడా కళ్లుమూసుకుని పడుకోదు. ఎప్పుడేం జరుగుతుందోననే భయంతో తడవతడవకూ కళ్లు తెరిచి చూడటం దాని సహజ లక్షణం. డాల్ఫిన్లు, సీల్ వంటి సముద్ర క్షీరదాలు ఒక కన్ను తెరిచి నిద్రపోతాయి. ఈ రకపు నిద్రను ఆంగ్లంలో ‘యుని హెమిస్ఫెరిక్ స్లీప్’ అంటారు. ఎవరిపైనైనా నిఘా వేయ డాన్ని ‘ఓ కన్ను వేసి ఉంచడం’ అని అంటూ ఉంటాం. ఇలాంటి ఒంటికన్ను నిద్రాజీవులను చూసే ఈ నానుడి పుట్టి ఉండవచ్చు. ఇక పాములకి, మరికొన్ని జంతువులకీ కనురెప్పలు ఉండవు. అవి కళ్లు తెరిచే నిద్రపోతాయి. జంతువుల ప్రస్తావన వచ్చింది కాబట్టి కోలా అనే జీవి గురించి చెప్పుకోకపోతే బాగోదు. చిన్నసైజు ఎలుగుబంటిలాగ ఉండే ఈ కోలా మొద్దునిద్రకు మారుపేరు. రోజులో 22 గంటలు పడుకునే ఉంటుంది. అయితే ఎలా నిద్ర పోయినా నిద్ర నిద్రే. అలసిపోయిన మెదడుకు, ఇతర శరీర భాగాలకు విశ్రాంతినిచ్చేందుకు
నిద్ర తప్పనిసరి. మధ్యాహ్న భోజనం తరువాత ఓ పది నిమిషాలు
కునుకు తీస్తే ఆ కిక్కే వేరు. ఇలా కునుకు తీయడం ఎన్నో విధాల మంచిదని గతంలో ఎందరో నిపుణులు నొక్కి చెప్పారు కూడా.
నిద్రకు గల ప్రాముఖ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ఏటా మార్చిలో వచ్చే మూడవ శుక్రవారాన్ని ‘ప్రపంచ నిద్ర దినోత్సవం’గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆరోగ్యకరమైన నిద్ర వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేయడమే ధ్యేయంగా వరల్డ్ సొసైటీ 2008 నుంచి నిద్ర దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రెస్ మెడ్ అనే సంస్థ నిద్రపై జరిపిన తాజా సర్వేలో వెల్లడైన వివరాలు కలవరం కలిగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 36వేలమందిపై జరిపిన ఈ సర్వేలో 27 శాతం మంది మాత్రమే రోజూ రాత్రివేళ ఆరునుంచి ఎనిమిది గంటలు నిద్రపోతున్నారట. గత ఏడాది ఇదే సంస్థ చేసిన సర్వేలో 80శాతం మంది తగినంతసేపు నిద్రపోతున్నట్లు వెల్లడి కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 27 శాతానికి దిగ జారడం ప్రజలలో తీవ్రతరమవుతున్న నిద్రలేమికి నిదర్శనం. మితిమీరిన సెల్ ఫోన్ వాడకమే ఇందుకు కారణం కావడం గమనార్హం.
నిద్రకు, సెల్ ఫోనుకు లంగరు కుదరదు. కుర్రకారు పుస్తకం చేతిలోకి తీసుకోగానే నిద్రాదేవత ఎక్కడున్నా సరే ఠపీమని వచ్చి ఒడిలో వాలిపోతుంది. కానీ, సెల్ ఫోన్ ఆన్ చేస్తే మాత్రం.. అదే నిద్ర రమ్మన్నా రాదు. సెల్ ఫోన్ లోంచి వెలువడే కాంతి కిరణాలు కంటికి హానికరమని డాక్టర్లు నెత్తీ నోరూ మొత్తుకుంటున్నా, 
సెల్లుంటే పండగ… 
స్లీప్ ఎందుకు దండగ…
అనుకునే యువతీ యువకుల సంఖ్య ఎక్కువయిపోయింది. మనిషి గుప్పిట్లో ఉండవలసిన చరవాణి.. ఇప్పుడు మనిషినే గుప్పిట్లో పెట్టుకోవడం విచిత్రమైన పరిణామం. టెక్నాలజీని ఒడిసిపట్టుకుంటున్న యువతరం.. ఆ టెక్నాలజీని వాడవలసిన తీరులో వాడకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణం. సెల్ హల్ చల్ కు ఇకనైనా కళ్లెం పడితేనే కంటికీ, ఒంటికీ మంచిది!.

ఏమంటారు మరీ..
(వ్యాస రచయిత ఫార్మా రంగ నిపుణుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆరోజు డి.ఎన్. ప్రసాద్ ఏం చేశారంటే…?

ఎవరూ లేకున్నా ప్రత్యేక సంచికదీని వెనుక డి.ఎన్. ప్రసాద్ కృషిబాలయోగి మరణించి...

A Premier Rural Development Institute of India

National Institute of Rural Development and Panchayati Raj (NIRD&PR)...

Science for the common man

(Dr. N. Khaleel) Four years ago, Corona shook the world....

Watch CHAVA in a Theatre

(Dr Kamalakar Karamcheti) The Hero is captured by the villain...