(సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి)
ఈనాడులో నీకు నచ్చే కాలమ్ ఏమిటి? ఇది రామోజీరావుగారు ఏప్రిల్ 7, 1989న ఇంటర్వ్యూలో అడిగిన ఒక ప్రశ్న. అందుకు నేను ఇచ్చిన సమాధానం హరివిల్లు. ఎందుకంతగా నీకు నచ్చింది… అంటే అలా చెప్పేంత పరిజ్ఞానం నాకు లేదు. రాసిన శైలి మనసుకు హత్తుకుంటుంది..సున్నితమైన హాస్యం కితకితలు పెడుతుంది. అదే సమయంలో పరోక్షంగా విసిరే వ్యంగ్యోక్తులు సూటిగా గుండెల్లో గుచ్చుకుంటాయి… అని సమాధానం చెప్పా… హరివిల్లు శీర్షికను గుడిపూడి శ్రీహరిగారు దశాబ్దం పైనే నిర్వహించారు. రాజకీయ నేతల పాషాణ హృదయాల్లో పదునైన విమర్శల గునపాలను దించారు. ఆయన శైలి సామాన్యుడు సైతం చదివేలా ఉంటుంది. అది చదువుతున్న సమయంలో కేవలం మనకు గుర్తొచ్చేది గుడిపూడి శ్రీహరిగారితో పాటు ఆయన ఎవరిని ఉద్దేశించి విమర్శలు చేశారో వారు కూడా. ఈనాడులో చేరినా నేను హైదరాబాద్ బదిలీ అయ్యేవరకూ ఆయనను చూడలేదు. రచనలు చదువుతూ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తరవాత మా మావగారు ఉషశ్రీగారి పేరు మీద ఏర్పాటుచేసిన ఉషశ్రీ సంస్కృతి సత్కారం మొదటి సభకు ఆయన హాజరయ్యారు. ఆ విషయం కూడా నాకు తెలియదు. ఆయనతో అప్పుడు కూడా మాట్లాడలేకపోయాను. ముఖతః ఎప్పుడూ చూడకపోవడమే దీనికి కారణం.
ఆ తరవాత ఆయన్ను కలిసే అదృష్టం కలిగింది. ఆయన శ్రీమతి లక్ష్మిగారు పేరెన్నికగన్న హోమియో వైద్యురాలు. మా అబ్బాయికి తరచూ జ్వరం వస్తుండేది. ఈ విషయాన్ని పాలగుమ్మి విశ్వనాథం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రస్తావించాం. అక్కడే ఉన్న లలిత సంగీత గాయని హైమవతిగారు వెంటనే లక్ష్మిగారి దగ్గరికి వెళ్ళండి అంటూ సూచించారు. అడ్రస్ పట్టుకుని వెళ్ళాం. ఆ ఇంటి ముంగిట శ్రీమతి లక్ష్మి గారి పేరుతో పాటు గుడిపూడి శ్రీహరి గారి పేరు కూడా ఉండడం, వెంటనే పరిచయం చేసుకోవడం అయిపోయాయి. ఆయన్ను కలిసిన ఆనందం నాకు అంతా ఇంతా కాదు. ఆ తదుపరి లక్ష్మిగారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఆయన్ను కలిసేవాడిని. ఆయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా అని తెలుసుకున్నాను. ఆయన రచనా వ్యాసంగంలో సవ్యసాచి. అటు ఆంగ్లం.. ఇటు తెలుగు భాషలలో ఒకేసారి రాయగల దిట్ట. కళల మీద ఆయనకున్న పట్టు అపారం. సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఆయన రాసే వ్యాసాలు పాత్రికేయులు దాచుకుని, ఆచరించదగ్గ మణిరత్నాలు. మేము నిర్వహించిన వెంకటేశ్వర కల్యాణం యక్షగాన ప్రదర్శనపై కూడా ఆయన హిందూలో చక్కటి సమీక్ష రాశారు. ఇలా ఆయన రచనలను గురించి ఎంతచెప్పినా చాలదు. అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆయన పాత్రికేయంలో ఓ వటవృక్షం. పాత్రికేయుడన్న వాడు ఒక్క విభాగానికే పరిమితం కాకూడదు అన్న సందేశాన్ని ఆయన ఏనాడో అందించారు.
వ్యక్తిగతంగా ఆయన చాలా స్నేహశీలి. నిగర్వి. చూడగానే అప్రయత్నంగా చేతులెత్తి నమస్కరిస్తాం. ఆ మహా పాత్రికేయుడికి ఇది నేను అందించే నివాళి.