ప్రజల కడుపు మండితే ఎవరికైనా నేపాల్ పరిస్థితే…?

0
164

టెండర్ల వ్యవస్థ రూపు మాపి, కాంట్రాక్టర్లను ఎంపిక చేస్తున్నారు
గనులన్నిటినీ మాఫియా ముఠాలకు అప్ప చెప్పేశారు
ఎమ్మెల్యేల స్థాయిలో అవినీతి అవధులు దాటుతున్నది
ప్రజలకు జీవించే హక్కు కూడా లేకుండా చేస్తున్నారు
కడుపు మండితే నేపాల్‌ వలె ఇక్కడా జనం తరుముకొనే రోజు వస్తుంది

(నెల్లూరు డోలేంద్ర ప్రసాద్)
నేపాల్‌ ఉదంతంతో భారతదేశం ఉలిక్కి పడింది. ఇరుగు పొరుగు దేశాలన్నీ రాజకీయ అస్థిరత్వంతో అల్లకల్లోలంగా మారడం మనకు తలనొప్పి వ్యవహారమే కదా? ఇదే సమయంలో నేపాల్‌కు మనకు పోలిక తెస్తున్నారు విశ్లేషకులు. నిజం చెప్పాలంటే, నేపాల్‌తో మనకు ఏ రూపంలోనూ పోలిక లేదు. 75ఏళ్ల కాలపరీక్షకు తట్టుకొని సుస్థిరంగా నిలబడిన ప్రజాస్వామిక వ్యవస్థ మనది. నేపాల్‌ ప్రజాస్వామ్యానికి పురిటి నొప్పులు ఇంకా తగ్గలేదు; ఒక కోణంలో చెప్పాలంటే, పురిట్లోనే సంధి కొట్టింది. అందువల్ల నేపాల్‌ పరిణామాలు మన దేశంలో పునరావృతం కావడం అసంభవం. రాజ్యాంగ వ్యవస్థలు సుదృఢంగా వుండడం అందుకు కారణం.

ప్రజల్లో గూడు కట్టుకున్న భయం

అయితే నేపాల్‌ ప్రజల ఆగ్రహం వంటిది మన జనంలో కూడా గూడు కట్టుకొని వుందన్న మాట నిజం. రాజకీయ అవినీతి మన దేశంలో వెర్రి తలలు వేస్తున్నది. కేజ్రీవాల్‌ వంటి అర్భకుడు దేశ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదగడానికి, స్వయంకృతాపరాధంతో పతనమై పోవడానికి రాజకీయ అవినీతే కారణం. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ప్రారంభించిన చిన్న ఆందోళన ఢిల్లీ గద్దె క్రింద కూసాలు కదిలించిన చరిత్ర చూశాము మనం. దీని అర్ధం, మన దేశంలో కూడా ప్రజలు స్వచ్ఛమైన రాజకీయాలను కోరుకొంటున్నారు; కానీ దురదృష్టవశాత్తు రాజకీయం అవినీతితో పుచ్చి పురుగులు పట్టి, కుళ్లు కంపు కొడుతున్నది. అటు కేంద్ర స్థాయిలో, ఇటు రాష్ట్రాల పరిధిలో రాజకీయ నాయక గణం అందినంత దోచుకోవడం కోసమే రాజకీయాలలోకి వస్తున్నారన్నది కాదనలేని వాస్తవం. ఎక్కడో యోగి ఆదిత్యనాధ్‌, మమతా బెనర్జీ వంటి ఒకరిద్దరు సచ్ఛీలురైన నేతలు ఇంకా సజీవంగా వుండబట్టి, ప్రజలకు రాజకీయ వ్యవస్థ మీద ఇంకా ఎంతో కొంత విశ్వాసం మిగిలి వుంది. కానీ ఇది ఎంతకాలం అన్నదే ప్రశ్న.

విశ్వాసం కోల్పోయిన ప్రజలు

నేపాల్‌లో స్పష్టంగా ప్రతిఫలించిన లక్షణం – ఒక నేత లేదా ఒక పార్టీ మీద కాకుండా, మొత్తం రాజకీయ వ్యవస్థ మీదనే ప్రజలు విశ్వాసం కోల్పోవడం. దేశం మొత్తం మీద ఆ పరిస్థితి వుందని ఇప్పుడే చెప్పలేము కానీ, మన రాష్ట్రం వరకు చూస్తే ఇంచుమించు నేపాల్‌ పరిస్థితులే నెలకొని వున్నాయి. అటు వైసిపి, ఇటు తెలుగుదేశం – రెండింటి మధ్య అవినీతి విషయంలో అణువంత వ్యత్యాసం లేదు. జగన్‌తో, ఆయన పెంచి పోషించిన గూండా ఎమ్మెల్యేలతో వేగలేక, చిత్తుచిత్తుగా ఓడించారు ఆంధ్రులు; కానీ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం మక్కీకి మక్కీ కాపీ కొట్టినట్లుగా జగన్‌ పద్ధతులే అనుసరిస్తున్నది.

ముఖ్యమంత్రి ఎవరిని ఎంపిక చేస్తే వారే కాంట్రాక్టర్‌

ఏ ప్రభుత్వ పనికి కూడా టెండర్‌ వ్యవస్థ లేదు. ముఖ్యమంత్రి ఎవరిని ఎంపిక చేస్తే వారే కాంట్రాక్టర్‌; లక్ష కోట్ల పని అయినా అంతే; దిగువ స్థాయిలో చిన్న చిన్న పనులు ఎమ్మెల్యేలు పంచి పెడుతున్నారు. ప్రతి పనిలో కమీషన్‌ తప్పనిసరి. దానికోసం పని విలువ పెంచుతున్నారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనం డ్రైనేజ్‌ లేక డేంజర్‌గా జారిపోతున్నది. గనులన్నీ ప్రభుత్వం నడిపే వారి ఆస్తులుగా మారిపోయాయి. క్వార్ట్జ్‌, సిలికా, ఎర్రమట్టి, ఎర్రగులక, దాని పేరుతో బాక్సైట్‌, గ్రానైట్‌ వంటి గనులన్నిటినీ స్వాధీనపరచుకొని, మాఫియా ముఠాలకు అప్ప చెప్పేస్తున్నది ప్రభుత్వం. నీకింత, నాకింత అని మాఫియా ముఠాలు, ప్రభుత్వాధినేతలు పంచుకొని తింటున్నారు. సాంప్రదాయంగా జరిగే మైనింగ్‌ పరిశ్రమ అంతరించి పోయింది. ప్రభుత్వానికి జరిగే అన్ని సరఫరాలూ అంతే. సివిల్‌ సప్లయిస్‌ కానీ, పిల్లల కంప్యూటర్‌ ట్యాబ్‌లు కానీ, రేషన్‌ బియ్యం కానీ, మరొకటి మరొకటి కానీ, ప్రభుత్వ పెద్దలు చెప్పిన వారికే సరఫరా ఆర్డర్‌. వారు చెప్పిందే ధర. పోటీ తత్వం, నాణ్యత కనుమరుగై పోయాయి. ఎమ్మెల్యేల స్థాయిలో నియోజకవర్గాలు వారి రాజ్యాలుగా మారిపోయాయి. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ వేస్తే ప్లాట్లు ఇవ్వాలి; అపార్ట్‌మెంట్‌ కడితే అడుగుకు ఇంత అని ఇవ్వాలి; రైస్‌ మిల్లు నడిపితే నెల మామూలు ఇవ్వాలి; ఇళ్ల ప్లాన్‌ కావాలంటే సిఫార్సు చీటీ కొనుక్కోవాలి; కమర్షియల్‌ భవంతి లేదా హోటల్‌ కడితే భారీ మొత్తం చెల్లించాలి; ఎమ్మార్వో ఆఫీసులో కాగితం కదలాలంటే ఎమ్మెల్యే ఫోన్‌ చేయాలి; పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేయాలంటే ఎమ్మెల్యే చెప్పాలి; చివరాఖరుకు మొగుడు పెళ్లాం మధ్య తగువు వచ్చినా ఎమ్మెల్యే వద్ద పంచాయతీ పెట్టాలి. నదులలో ఇసుక వారిదే; తిప్పలలో ఎర్రమట్టి వారిదే; క్వారీలలో కంకర వారిదే; ఇల్లు కట్టుకోవడానికి బండి ఇసుక కావాలన్నా ఎమ్మెల్యే అనుచరుల అనుమతి కావాలి; ప్రజల జీవితాలలో రాజకీయవాదులు చొరబడి పోతున్నారు. చీకాకు పెడుతున్నారు. స్వేచ్ఛగా వ్యాపారం చేసుకొనే హక్కు, ప్రశాంతంగా జీవించే హక్కు, స్వతంత్రతతో మాట్లాడే హక్కు హరించి వేస్తున్నారు ఎమ్మెల్యేలు. రాజ్యాంగమే అపహాస్యం పాలౌతున్నది.

ఇద్దరు సీఎంలు చేసిన తప్పులు ఇవి

గెలిచిన ఒకటి రెండేళ్లలోనే ఎమ్మెల్యేల జీవనశైలి మారిపోతున్నది. వందల కోట్లు పోగేసుకోవడమే కాదు, ఖరీదైన కార్లతో, విలాసవంతమైన జీవనంతో, డబ్బు వెదజల్లే పొగరుతో తమ అక్రమ సంపాదనను నగ్నంగా ప్రదర్శిస్తున్నారు రాజకీయవాదులు. అవి చూస్తున్న ప్రజలకు కడుపు మండి పోతున్నది.
చంద్రబాబు నాయుడు, నేపాల్‌ ప్రధాని వలె సామాజిక మాధ్యమాల మీద తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాడు. తప్పుడు పోస్టు అనే సాకుతో కేసులు నమోదు చేస్తున్నారు. చట్టం పరిధిలో తప్పు కాని వాటిపై కూడా పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. యూరియా దొరకలేదని ఒక రైతు ఆవేదన వ్యక్తం చేస్తే, కేసు పెట్టారంటే పరిస్థితి ఏ దిక్కులో ప్రయాణం చేస్తున్నదీ అర్ధం చేసుకోవచ్చు. గతంలో జగన్‌ చేసిన నేరం కూడా ఇదే.

ఒక పక్క అవినీతి, మరొక పక్క మితిమీరిన రాజకీయ జోక్యం, మూడో పక్క అవినీతి ఆర్జన నగ్న ప్రదర్శన. తెలంగాణాలో కాళేశ్వరం కట్టిన ఇంజనీర్ల ఇళ్లపై ఎసిబి దాడి చేస్తే వందల కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి. అదే దాడి మంత్రుల ఇళ్ల మీద, ముఖ్యమంత్రుల ఇళ్ల మీద జరిపితే వేల కోట్ల అక్రమ సంపాదన వెలికి వస్తుంది. ఈ సొత్తులో కొంత ఎన్నికలలో ఓటుకు నోటు రూపంలో పంచి పెడుతున్నారు. జగన్‌ అనుచరుల మీద పెట్టిన మద్యం కేసులో పోలీసు వాదన – మద్యం సొమ్ము ఎన్నికల ఖర్చుకు వాడారనే కదా?

ఈ దోపిడీలు, ఈ దుర్మార్గాలు ప్రజలు చూడడం లేదని, చూసినా తెలివి లేని వారు కాబట్టి అర్ధం చేసుకోలేరని పొరబడుతున్నాయి రాజకీయ పార్టీలు. జగన్‌, కెసిఆర్‌లకు బ్యాలెట్‌ పెట్టెలలో ఎదురైన దుర్గతి చూసిన తర్వాత కూడా కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు తీరు మార్చుకోవడం లేదంటే ప్రజలు గొర్రెలనే వెర్రి నమ్మకమే కారణం కావచ్చు.

అయితే నేపాల్‌లో వలె ఏదో ఒక రోజు మన దేశంలో లేదా మన రాష్ట్రంలో కూడా ప్రజల తిరుగుబాటు రాదని చెప్పలేము. అదెప్పుడు, ఏ రూపంలో అన్నదొక్కటే ప్రశ్న. రాజకీయవాదుల అవినీతి మీద ఇంతకాలం ప్రజలు ఓటుతో నిరసన తెలిపి సరిపెట్టుకొంటున్నారు ప్రజలు. ఆ సహనం ఎల్లకాలం కొనసాగుతుందా? ఓర్పు నశించిన నాడు మనం కూడా నేపాల్‌ తరహా ఆందోళన చూడక తప్పదు.
(వ్యాస రచయిత జమీన్ రైతు ఎడిటర్)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here