ఘంటసాల పెద్దరికానికి తార్కాణాలు
వారం వారం ఘంటసాల స్మృతిపథం-7
(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి, 9440103345)
ఘంటసాల నేపథ్య గానాన్ని బతుకుతెరువగా తీసుకున్నారు తప్ప నేపథ్య గాయకుడిగా చిత్ర పరిశ్రమను శాసించాలన్న
ఆలోచన ఏకోశానా లేదు. యాభయ్ ఏళ్లు దాటుతున్నాయి. సంపాదించింది చాలు. చాలకపోయినా గుళ్లో పురాణ పఠనంతో కాలక్షేపం చేద్దాం. మనకన్నా తక్కువ డబ్బున్నవాళ్లు బతకడంలేదా?
అని సుమారు ఐదు దశాబ్దాల క్రితం ఆత్మ సంతృప్తి
వైరాగ్యంతో నిర్ణయం తీసుకుని చాలా పాటల అవకాశాలు వదులుకున్నారు. కొత్త గాయకులను ప్రోత్సహించాలని తహతహ లాడారు.
‘తానొక్కరే సినీ నేపథ్య రంగాన్ని ఏలాలిఅని ఎన్నడూ అనుకోలేదు. మీరే పాటలన్నీ పాడాలన్న దర్శక నిర్మాతలకు
అన్నీ నేనే పాడితే బాగుండదు బాబూ!అని నచ్చచెప్పిఇతర గాయకులతో పాడించిన సందర్భాలు ఎన్నెన్నో..
స్వీయ సంగీత దర్శకత్వంలో ఇతరులతో పాడించారు. తమిళ, కన్నడ చిత్రాలలో తాను పాడడం వల్ల ఆయా భాషా గాయకులకు అవకాశాలు తగ్గుతాయన్న భావనతో వాటికి పాడనని ప్రతిన బూనారని చెబుతారు. ఆయా గాయకులే ఈ సంగతి అనేకసార్లు చెప్పారు.
`అనారోగ్యం కారణంగానో, ఇతరత్రా తీరిక లేకనో ఇతర గాయకులతో పాడించిన ‘ట్రాక్’లను అలాగే ఉంచిన సందర్భాలెన్నో. ‘వాళ్లు బాగానే పాడారు కదా? మళ్లీ నేనేందుకు పాడడం?’ అని అనేవారు. ఉదాహరణకు, ‘భక్త తుకారం’ చిత్రంలో అభంగాలను ఘంటసాల వారే పాడవలసి ఉండగా ఆయన సుస్తీ పడ్డారు. మరోవంక చిత్రీకరణకు సమయం మించిపోతోంది. కథానాయకుడు, ఇతర నటీనటులు అంత తొందరగా మళ్లీ తేదీలు ఇచ్చే అవకాశం లేదు. దాంతో చిత్రనిర్మాతలు ఆదినారాయణరావు, అంజలీదేవి దంపతులు ఆయనకు పరిస్థితిని వివరించి, ‘మీరు కోలుకున్న తరువాత మీతో పాడిస్తాం. ఈలోగా చిత్రీకరణ కోసం వర్ధమాన గాయకుడు రామకృష్ణతో ట్రాక్ పాడిస్తాం’ అని చెప్పారు. రికార్డింగ్, చిత్రీకరణ పూర్తయిన తరువాత రామకృష్ణ పాట విన్న ఘంటసాల వారు ‘ఆ అబ్బాయి పాడినవే ఉంచండి.
నేను అంతకంటే గొప్పగా పాడతాననుకోను’ అన్నారని అంజలీదేవి అనేక సందర్భాలలో చెప్పారు. ‘ఇద్దరు అమ్మాయిలు, ప్రేమలు పెళ్లిళ్లు’ లాంటి చిత్రాలలోనూ ఆయన పాడవలసి ఉండగా వర్ధమాన గాయకుల ‘ట్రాక్’లనే ఉంచేశారు. తమిళ, కన్నడ చిత్రాలలో తాను పాడడం వల్ల ఆయా భాషా గాయకులకు అవకాశాలు తగ్గుతాయన్న భావనతో వాటికి పాడనని ప్రతినబూనారని చెబుతారు.
ఆయన వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు తప్ప అందని వాటికోసం అర్రులు చాచలేదు. దక్కనందుకు నిరాశపడలేదు. ‘మిస్సమ్మ’ అందుకు ఉదాహరణ (ఘంటసాల పాడితే బాగుండేదని నిర్మాతలు ఆ తర్వాత అనుకున్నారట). ఇతర సంగీత దర్శకులు చేపట్టవలసిన సినిమాలకు తాను సంగీత దర్శకత్వం వహించిన సందర్భాలూ ఉన్నందున ఆ కోణంలోనూ ఆలోచించి ఉంటారనుకోవచ్చు. సాలూరి రాజేశ్వరరావు గారు చేయవలసిన ‘మాయాబజార్’ చిత్రం మధ్యలో ఘంటసాల వారి చేతికి వచ్చింది. సాలూరి వారు నాలుగు పాటలకు కట్టిన బాణీలను యథాతథంగా ఉంచేశారు.
కొత్తదనం కోసం ఎన్టీ రామారావు ద్విపాత్రాభినయం చిత్రం ‘భలేతమ్ముడు’కు సుప్రసిద్ధ హిందీ గాయకుడు మహ్మద్ రఫీతో పాడించడాన్ని హృదయపూర్వకంగా స్వాగతించారు. సినిమా వినోద సాధనమైనప్పటికి వ్యాపారంతో ముడిపడి ఉన్నదని, నిర్మాతలు ఆ కోణంలో ఆలోచించడం సహజమన్నది ఆయన అభిప్రాయం. మొత్తం మీద దర్శక నిర్మాతల (పేరున్న నటుల) ఇష్టానిష్టాలపైనే ఇలాంటి అవకాశాలు ఆధారపడి ఉంటాయ న్నది నాటికీ, నేటికీ నిలిచే సత్యం.
నేపథ్యగానంతోనే సంగీతమూ….
ఘంటసాల నేపథ్య గాయకుడిగా నిలదొక్కుకుంటున్న సమయంలోనే భరణి పిక్చర్స్ అధినేతలు భానుమతీ రామకృష్ణ తమ ‘రత్నమాల, లైలామజ్ను’ చిత్రాలలో సంగీత శాఖలో (సీఆర్ సుబ్బరామన్ సంగీత దర్శకుడు) సహాయకుడిగా అవకాశం ఇచ్చారు, పాటలూ పాడించారు. అంతకు ముందు రెండు చిత్రాలకు (స్వర్గసీమ, రత్నమాల) పాడినా ‘లైలా మజ్ను’ లోనే ‘జి.వేంకటేశ్వరరావు’ అని మొదటిసారిగా పేరు కనిపించింది. అందుకాయన వారికి కృతజ్ఞతలు చెప్పేవారు.
తప్పిపోయిన ‘విప్రనారాయణ’
భరణి సంస్థే అక్కినేని నాగేశ్వరరావుతో తీసిన ‘విప్రనారాయణ’చిత్రంలో ఘంటసాల గాత్రం వినిపించలేదు. ‘మా విప్రనారాయణకు ఘంటసాల పాడితే బాగుండేది’ అని భానుమతి తరువాత ఇంటర్వ్యూలలో అన్నారు. కానీ ‘పాడక పోవడాని’కి, పాడించక పోవడానికి కారణాలు మాత్రం కచ్చితంగా వెల్లడి కాలేదు. ఆ సినిమా పాటలపై అక్కినేని ‘ఆయన పాడక పోవడం వల్ల సినిమాకు కలిగిన నష్టం కంటే నాకు వ్యక్తిగతంగా పెద్ద లోటు’ అని వ్యాఖ్యానించారు. జయభేరి, మహాకవి కాళిదాసు, భక్తజయదేవ, తెనాలి రామకృష్ణ లాంటి తనకు కీర్తిప్రతిష్ఠలు తెచ్చిన చిత్రాలలో ఘంటసాల గాత్రం పాత్ర ఎంతో ఉందని చెప్పేవారు. ‘లైలామజ్ను’చిత్రాన్ని విడుదలకు ముందు సినీప్రముఖుల కోసం ప్రదర్శించినప్పుడు చిత్రం చూసిన నటీమణి జి.వరలక్ష్మి ‘ఎంత బాగా పాడావు ఘంటసాలా’అని ప్రత్యేకంగా అభినందించారట. అయినా ‘విప్ర నారాయణ’కు పాడే అవకాశం దక్కలేదు. (వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్ట్)