మహాత్ముని బహుముఖాలను ఆవిష్కరించిన తొలి తెలుగు రచయిత

0
314

కోడూరి శ్రీరామ్మూర్తి
(డా. నాగసూరి వేణుగోపాల్, 94490732392)
” ఉన్న తీరిక నా సాహిత్య కార్యక్రమాలకు నియోగం కావలసి రావడం చేత, సాహిత్య విమర్శకు ఇచ్చిన ప్రాధాన్యతను గాంధేయ సాహిత్యానికి ఇవ్వలేకపోయాను. ఉద్యోగం నుండి విశ్రాంతి పొందిన తర్వాత ఈ కృషి పై శ్రద్ధ వహించాను.”‘ అని ప్రఖ్యాత రచయిత కోడూరి శ్రీరామమూర్తి ‘మరో కోణంలోంచి మహాత్ముడు (2011)’, అనే తన పుస్తకానికి ముందుమాట రాస్తూ పేర్కొన్నారు. 2025 ఆగస్టు 5న రాజమండ్రిలో 84 ఏళ్ల వయసులో కనుమూసిన శ్రీరామమూర్తి ‘మహాత్ముని అడుగుజాడలు గాంధీతత్వ సరళపరిచయం’ అనే తన పుస్తకానికి ఉపసంహారంగా రాసిన చిరువ్యాసంలో,”ఇప్పటికే గాంధీజీపై వివిధ అంశాలకు సంబంధించి పది పుస్తకాలు రాశా. ఇది కూడా వాటి సరసన నిలవగల”దని 2025 ఏప్రిల్ మాసంలో రాసుకున్నారు.

   1965 నుంచి మూడున్నర దశాబ్దాల పాటు బొబ్బిలిలోని రాజా ఆర్. ఎస్. ఆర్. కె. రంగారావు కళాశాలలో ఎకనామిక్స్ లెక్చరర్ గా సేవలందించిన కోడూరి శ్రీరామమూర్తి ఒక తెలుగు దినపత్రికలో ఆర్థిక విషయాలకు సంబంధించి క్రమం తప్పకుండా రాసేవారు. తెలుగు నవలాసాహిత్యంలో మనోవిశ్లేషణ రచన ద్వారా తెలిసిన కోడూరి శ్రీరామమూర్తి వేరొకరని మరికొందరు భావించినా ఆశ్చర్యం లేదు. ఈ రెండింటికి దాదాపు సంబంధం లేని మరో పార్శ్వం కోడూరి వారు సృజించిన తెలుగు గాంధేయవాద సాహిత్యం!

  "స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న కుటుంబం నుండి వచ్చిన వాడిని కాబట్టి నాకు చిన్నతనం నుండి గాంధీజీ పై ఒక ఆరాధనాభావం ఉంది. అదే నాకు ఈ పుస్తకాలను రాయడానికి స్ఫూర్తినిచ్చింది. అంతకుమించి చెప్పదలచింది లేదు." అని 2011 లో కోడూరి వారు 'మరో కోణంలోంచి మహాత్ముడు' పుస్తకానికి రాసిన రెండు మాటలను ముగిస్తారు.

  1932 లో రాజమండ్రిలోని ప్రసిద్ధ న్యాయవాది శ్రీ దేవత శ్రీరామమూర్తి మేడమీద ఎగురుతున్న జెండాను లాగివేయాలని ఒక పోలీసు ఉద్యోగి 500 మంది రక్షక భటులతో దండెత్తి రాగా,‌ ప్రతిఘటించడమే కాకుండా పైకోర్టుకు వెళ్లి పోరాడి, గెలిచి 'జెండా ప్లీడర్ 'గా గౌరవం, పేరు పొందిన వారు. దేవత శ్రీరామమూర్తి మహానాయకులు గాంధీజీ, రాజేంద్రప్రసాద్, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ వంటి వారికి తన ఇంటిలో ఆతిథ్యం ఇచ్చిన వారు. అంతేకాకుండా కాకుండా ప్రకాశం పంతులు,సరోజినీదేవి, బులుసు సాంబమూర్తి ..వంటి తెలుగు నాయకులకు, అలాగే సి.ఆర్. రెడ్డి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు, స్థానం నరసింహారావు, ఆదిభట్ల నారాయణదాసు, ద్వారం వెంకటస్వామి నాయుడు .. మొదలైన మహనీయులకు ఎంతో మిత్రుడు. 

    దేవత శ్రీరామమూర్తి గారి శ్రీమతి లక్ష్మీదేవి చిన్నతనంలోనే తెలుగులో వ్యాసరచనకు బంగారు పతకం పొందిన పండితురాలు. ఈ దంపతుల కుమార్తె కోడూరి లీలావతి ప్రసిద్ధ తెలుగు రచయిత్రి. కోడూరి పుల్లేశ్వరరావు, లీలావతి దంపతులకు 1941 సెప్టెంబర్ 29న మన గాంధేయవాద రచయిత శ్రీరామమూర్తి జన్మించారు. సుప్రసిద్ధ రచయిత్రి కోడూరి లీలావతి కస్తూర్బా గాంధీ జీవితం ఆధారంగా 'కుంకుమరేఖ', సరోజినీ నాయుడు జీవిత కథను 'ఇంద్రధనస్సు' పేరున చేసిన రచనలకు సాహిత్య అకాడమీ అవార్డులు రావడం విశేషం. రాజమహేంద్రవరం చరిత్ర గురించి 'జయ విపంచి' రాసిన కోడూరి లీలావతి రాసిన మరో గ్రంథం 'గృహ విజ్ఞానం' కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ నుంచి గౌరవం పొందింది. రవీంద్రనాథ్ ఠాగూర్ శతజయంతి సందర్భంగా కుమారుడు శ్రీరామమూర్తితో కలిసి చేసిన 'రవికవి' రచనకు బహుమతి కూడా లభించింది. వీణావాదనలో సైతం నైపుణ్యమున్న కోడూరి లీలావతి సంపాదకత్వం వహించిన 'ఉదయరేఖ' వారపత్రికకు కుమారుడు శ్రీరామమూర్తి సహకరించేవారు. 

  మాతామహులు దేవత శ్రీ రామమూర్తిని చూడక పోయినా వారి నుంచి స్వాతంత్ర్య స్ఫూర్తి; తల్లి సాహిత్యశిక్షణ, రచనాసహచర్యంతో మనవడు కోడూరి శ్రీరామమూర్తి మరింత ముందుకు సాగారు. 

  ఈ కుటుంబ నేపథ్యంతో, పాతికేళ్ల వయసులో బొబ్బిలిలో ఎకనామిక్స్ లెక్చరర్ గా చేరి 35 ఏళ్లు పనిచేసిన కాలంలో కోడూరి శ్రీరామమూర్తి ఆర్థిక విషయాల వ్యాసకర్త, నవలారచయిత, కథారచయిత, సాహిత్యవిశ్లేషకుడి పరిణమించారు. గాంధీజీ శతజయంతి సం.1969లో ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో 'గాంధీజీ కథావళి' పేరున ఒక రెండేళ్ల పాటు ఆసక్తికరమైన ఉదంతాలను క్లుప్తంగా

రాశారు. ఫలితంగా మంచి గుర్తింపుతో పాటు తర్వాత ఈ వ్యాసాలతో 1971పుస్తకంగా వచ్చింది.

  గాంధీజీ గురించి వారి మూడు పదుల వయసులో మొదటి పుస్తకం రాగా, రెండవ పుస్తకం వచ్చేటప్పటికి ఆయన వయసు ఏడుపదులకు దగ్గరైంది. కోడూరి శ్రీరామమూర్తి రచనలలో గాంధీజీ గురించి 11దాకా ఉన్నట్టు తెలుస్తుంది. వాటిలో 2009లో 'ఆలోచన' ప్రచురణ కాగా; 2011సం.లో 'మనకు తెలియని మహాత్ముడు', 'మహాత్ముని దక్షిణాఫ్రికా ప్రస్థానం', 'మరో కోణంలోంచి మహాత్ముడు' వెలువడ్డాయి. 2016లో 'మహాత్ముడు- పర్యావరణం' మరో ముఖ్యమైనది 'మహాత్ముడు-ప్రపంచీకరణ' అనే పుస్తకం రాసే ప్రతిపాదన ఉన్నట్టు ఓ పుస్తకం చివరి ఇచ్చిన జాబితాలో కనబడుతుంది, అయితే అది వచ్చినట్టు సమాచారం తెలియరాలేదు. 

  మహాత్ముడి జీవితానికి సంబంధించి ఆర్థిక దృక్పథం, పర్యావరణ పార్శ్వం, బ్రహ్మచర్య సిద్ధాంతం.. వంటి విభిన్నమైన, ప్రచారంలో లేని కోణాలను ఎంతో కొంత స్పృశించి రచనలు చేశారు. మరీ ముఖ్యంగా పర్యావరణాన్ని వస్తువుగా చేసుకొని రేచల్ కార్సన్ రాసిన 'సైలెంట్ స్ప్రింగ్' పుస్తకాన్ని; ఇ.ఎం. షూ మేకర్ రాసిన 'స్మాల్ ఇస్ బ్యూటిఫుల్' రచనను తెలుగు పాఠకులకు విశదంగా పరిచయం చేసిన వారు కేవలం కోడూరి శ్రీరామమూర్తి అని నేను భావిస్తున్నాను. అలాగే మహాత్ముని 'హిందూ స్వరాజ్' రచన అనేది పర్యావరణ సమస్యపై పరోక్ష హెచ్చరిక అని వివరించడం ఇంకా పర్యావరణ ఆర్థిక దృక్పథం లోని పర్యావరణ నైతికత, గాంధీయతత్వం అంటూ తెలుగువారికి సరళమైన భాషలో విశ్లేషించడం ఆయన ద్వారానే సాధ్యమైంది. తెలుగు వారికి గాంధీజీని సమగ్రంగా పరిచయం చేయాలని తపించిన తొలిరచయితగా కోడూరి శ్రీరామమూర్తి గుర్తుండిపోతారు.

     గాడిచర్ల హరిసర్వోత్తమరావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, కాశీనాథుని నాగేశ్వరరావు, దామరాజు పుండరీకాక్షుడు, బసవరాజు అప్పారావు, ఉన్నవ లక్ష్మీనారాయణ, అడవి బాపిరాజు, వేలూరి శివరామశాస్త్రి, తుమ్మల సీతారామ్మూర్తి, గుర్రం జాషువా, కరుణశ్రీ, కొడాలి ఆంజనేయులు, మహీధర రామమోహనరావు వంటి మహా రచయితలు దక్షిణాఫ్రికాలో విజయం సాధిస్తున్న గాంధీజీ పోరాటాల కాలం నుంచి తెలుగువారికి వివిధ ప్రక్రియల ద్వారా పెద్ద ఎత్తున పరిచయం చేశారు. వీటిలో పత్రికా రచనలే కాకుండా నాటకాలు, నవలలు, కథలు అంతకుమించి పాటలు, పద్యాలు, హరికథలు, బుర్రకథలున్నాయి. మాలపల్లి నవల, కొడాలి ఆంజనేయులు అనువాదం చేసిన గాంధీయవాద ఆర్థిక శాస్త్రం వంటి లోతైన రచనలు కాకుండా ఇతర రచనలలోఎక్కువ భాగం ఉద్వేగంతో కీర్తిని ఉగ్గడింప చేసే రీతిలో సాగడం గమనార్హం. 

  అంతకు మించి ఆరేడు దశాబ్దాలుగా గాంధేయవాద దృష్టిని, ఆ సాహిత్య కోణాన్ని ఉద్దేశపూర్వకంగానే విస్మరించే ప్రయత్నం కూడా తెలుగుసాహిత్యంలో జరిగింది. ఈ కాలంలో కోడూరి శ్రీరామమూర్తి కూడా గాంధీజీ సంబంధించిన ఏ రచనా చేయకపోవడం గమనార్హం. నాలుగు దశాబ్దాల క్రితం నుంచి ప్రపంచ వ్యాప్తంగా గాంధీజీ మీద ఆసక్తి ఏర్పడి పరిశోధనలు పెరిగాయి. దీని ప్రభావం భారతదేశంలో రెండు దశాబ్దాల క్రితమే మొదలైంది. కనుకనే పలు పుస్తకాలు రావడంతో పాటు వివిధ విశ్వవిద్యాలయాల్లో గాంధీజీ అధ్యయన శాఖలు కూడా మొదలయ్యాయి. తెలుగులో కూడా గత రెండు దశాబ్దాలలోనే సుమారైన సంఖ్యలో గాంధీజీ గురించి పుస్తకాలు వెలువడటం గమనించాలి.

    'అందాల తెలుగు కథ' పేరున కోడూరి శ్రీరామమూర్తి నాలుగు దశాబ్దాల క్రితం ఆంధ్రజ్యోతి వారపత్రికలో తెలుగు కథలశైలి, ఆయా రచయితల పోకడ గురించి, ఒక పేజీ వ్యాసంగా రాసేవారు. తిరుపతి రచయిత పులికంటి కృష్ణారెడ్డి తన గురించి ఈ శీర్షికలో వచ్చిన వ్యాసాన్ని ఫ్రేమ్ కట్టి పటంగా ఇంట్లో తగిలించుకోవడాన్ని నేను ఆ కాలంలోనే చూశాను. అలా కోడూరి వారు రచయితగా నాకు 1980 ప్రాంతం నుంచి తెలుసు. 2004 అక్టోబర్ 2వ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గాంధీజీ అధ్యయన శాఖ మొదలైనప్పుడు నేను విశాఖపట్నం ఆకాశవాణిలో పనిచేయటం కారణంగా వారు సంప్రదించినప్పుడు కోడూరి వారి వివరాలను ఆ శాఖకు అందజేశాను. 

  ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వారితో 2005-06 సం.లో ప్రత్యేక ప్రసంగం చేయించినప్పుడు విన్నవారిలో నేనూ ఉన్నాను. ఆ శాఖ కోరిక మేరకే దక్షిణాఫ్రికాలో గాంధీజీ పోరాట జీవితం గురించి శ్రీరామమూర్తి రచన చేశారు. ఈ నేపథ్యమే కోడూరివారిని గాంధీజీ గురించిన రచనలు పునః ప్రారంభం కావడానికి కారణమై ఉండవచ్చు. 2009-2025 మధ్యకాలంలోనే గాంధీజీ గురించిన కోడూరి శ్రీరామమూర్తి 10 పుస్తకాలు వెలువడ్డాయి. ఈ సమయానికి వాదాలహవా తగ్గి, ప్రపంచీకరణ పెరిగి, సోషల్ మీడియాతో పాటు వచ్చిన విశృంఖల ధోరణులు వెల్లువెత్తాయి. కనుకనే సంస్థలు, పత్రికలు, సందర్భాలు కారణంగా గాఉంధీజీ గురించి శ్రీరామమూర్తి రాసిన పలు రచనలే తర్వాతి దశలో పుస్తకాలుగా మారాయి. 

  నిజానికి కోడూరి వారు చేసిన గాంధీజీ రచనలగురించి ఒక విశ్వవిద్యాలయం పూర్తిస్థాయి పరిశోధన చేయించవచ్చు. కానీ ఎవరికి ఆ అవగాహన గాని, ఆసక్తి గాని లేదని భావించాలి.  ఈ కోణంలో కోడూరి శ్రీరామమూర్తి పరిశ్రమను వర్తమాన సాహిత్య ప్రపంచం కానీ, గాంధీజీ అభిమానులు గానీ సరిగా గుర్తించి, గౌరవించకపోయినా వారు మాత్రం నిజమైన ప్రేమ, మక్కువతో గాంధీజీలోని విభిన్న కోణాలను తెలుగు వాళ్లకి పరిచయడానికి చేసిన కృషి చిరస్మరణీయం. (గాంధేయం గాండీవం నుంచి)

(వ్యాస రచయిత ఆల్ ఇండియా రేడియో రిటైర్డ్ డైరెక్టర్)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here