పద్మ అవార్డుల కథాకమామిషు
(బండారు రామ్మోహనరావు, 98660 74027)
పద్మ అవార్డులను మొట్టమొదటిసారిగా భారతదేశంలో 1954 జనవరి 2 వ తేదీన ప్రవేశపెట్టారు. మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ హయాంలో కళలు, సాహిత్యం, విజ్ఞాన, క్రీడా రంగాలతో పాటు సామాజిక సేవ చేసినవారికి దేశంలోనే అత్యున్నతమైన పురస్కారంగా భారతరత్న అవార్డును ప్రవేశపెట్టారు. భారతరత్న తర్వాత పద్మ అవార్డులలో మొదట పద్మశ్రీ ఆ తర్వాత వరుసగా పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు అత్యున్నతమైన అవార్డులుగా ఉంటాయి. ఈసారి ఏకంగా 110 మందికి పద్మశ్రీ అవార్డులు 17 మందికి పద్మ భూషణ్ అవార్డులు మరొక ఐదుగురికి పద్మ విభూషణ్ అవార్డులు ఇచ్చారు. ఇక ఈ సంవత్సరం ఐదుగురికి భారత రత్న అవార్డులు ఇవ్వడంతో మొత్తం అవార్డుల సంఖ్య 137 కు చేరుకుంది. ప్రస్తుతం పివి గారితో పాటు కొత్తగా ముగ్గురికి భారతరత్న అవార్డు ప్రకటించడంతో గత 70 సంవత్సరాల నుండి ఇప్పటివరకు గత భారతరత్న అవార్డుల సంఖ్య 53 కు చేరుకుంది. భారతరత్న అవార్డులు పొందిన వారిలో ఇప్పటివరకు ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు.
జనతా ప్రభుత్వ హయాంలో బ్రేక్
1977 జూలై 13 నుండి 1980 జనవరి 26 వరకు జనతా పార్టీ హయాంలో భారతరత్న అవార్డులకు ఎంపికను నిలిపేశారు. ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే పురస్కారం చట్టబద్ధ సాంకేతిక కారణాల వల్ల ఉపసంహరించారు. 1992లో భారత స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ గా పేరందిన సుభాష్ చంద్రబోస్ కి ఇచ్చిన భారతరత్న పురస్కారాన్ని ఆయన మరణించినట్లు ఆధారాలు లేకపోవడంతో భారతరత్న పురస్కారం వెనక్కి తీసుకున్నారు.
భారతరత్న అవార్డుకు ఎవరు సిఫార్సు చేస్తారు?
ఈ అవార్డు ఎంపిక చేయడానికి ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫార్సు చేయవలసి ఉంటుంది. ఎలాంటి కుల, మత, భాష, ప్రాంత, లింగ బేధం లేకుండా దేశీయలేక విదేశీయులకు కూడా ఈ అవార్డులు ఇవ్వవచ్చు. ప్రోటోకాల్ ప్రకారం అధికారంలో ఉన్న భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్లు, మాజీ రాష్ట్రపతులు, ఉప ప్రధానమంత్రి, హైకోర్టు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులు మొదట ఆరు ర్యాంకులలో ఉంటే ఆ తర్వాత ప్రోటోకాల్ ప్రకారం భారతరత్న అవార్డు గ్రహీతలు వస్తారు.
తొలిగా అందుకున్నది వీరే…
1954లో మొదటిసారి ఈ అవార్డు భారతదేశ మొట్టమొదటి గవర్నర్ జనరల్ చక్రవర్తుల రాజగోపాలాచారితో పాటు అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, సివి రామన్ గా ప్రసిద్ధి పొందిన చంద్రశేఖర వెంకట రామనకు భారతరత్న అవార్డుని ఇచ్చారు.
జీవించి ఉండగా అందుకున్నది ఇద్దరే…
ఇప్పటివరకు భారతరత్న పొందిన వారిలో వారు జీవించి ఉన్నప్పుడే మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలు పొందారు. తాజాగా లాల్ కృష్ణ అద్వానీ ఈ ఏడాది అందుకుంటున్నారు. ఆ తర్వాత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణానంతరం ఆయనకు ఈ అవార్డు దక్కింది.
ఎందరో మహానుభావులకు భారతరత్న
ఇప్పటివరకు భారతరత్న దక్కిన ప్రముఖులలో మాజీ ప్రధానులు లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్పేయి, చౌదరి చరణ్ సింగ్, పీవీ నరసింహారావు, గారితో పాటు నెహ్రూ, తాత్కాలిక ప్రధానమంత్రిగా రెండుసార్లు పనిచేసిన గుల్జారిలాల్ నందాను కూడా భారతరత్న అవార్డు వరించింది.
భారత రాష్ట్రపతులుగా పనిచేసిన వారిలో బాబు రాజేంద్రప్రసాద్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ జాకీర్ హుస్సేన్, వివి గిరి, ఏపీజే అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీ లు ఉన్నారు.
వీరితోపాటు లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ, రాజ్యాంగ రూపశిల్పి బి.ఆర్ అంబేద్కర్, భారత తొట్ట తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా భారతరత్న అవార్డు అందుకున్నారు.
ఏది ఏమైనా ఆలస్యంగా అయినా కూడా పీవీ నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం ద్వారా ఒక మంచి నిర్ణయం తీసుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని దేశం అభినందిస్తుంది.
(వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్ట్)