స్వామి పులకరింత భక్తుని కంట…

Date:

ఏడుకొండల స్వామి అనుగ్రహ ఫలితం
(డాక్టర్ వైజయంతి పురాణపండ)

ఏమయ్యోయ్‌! నిన్నే! పిలిస్తే పలకవేం!

ఏమయ్యోయ్‌ ఏంటి! ఎవరిని పిలిచావో ఎలా తెలుస్తుంది! అయినా ఏమయ్యోయ్‌ ఏంటి? నన్ను పేరు పెట్టి పిలవలేవా?

ఏ పేరుతో పిలవాలి నిన్ను. ఒకపేరు పెట్టి పిలిచాననుకో, రెండో పేరుతో పిలవలేదేం అని అడుగుతావుగా. అందుకే ఇబ్బంది లేకుండా ఏమయ్యోయ్‌ అనేశాను.

నేనేం మాట్లాడతానో కూడా నువ్వే చెప్పేస్తావా.

నీ అంతరంగం నాకు తెలియదా.

నాకు వేలకొలదీ పేర్లు ఉన్నాయి. నువ్వు ఏ పేరుతో పిలిచినా పలుకుతానయ్యా బాబూ, ‘ఒక పిలుపుతో పిలిచితే పలుకుతావట’ అంటూ నేను పలికితీరాలి అని నా మీద రాసిన పాట వినలేదా?

విన్నాను. ‘ఏడుకొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా’ అని కూడా నిన్ను నిందాస్తుతి చేశారుగా.

‘ఏ చోట గాంచిన నీవుందువందురే, ఏమిటో నీ మాయ తెలియకున్నామయ్యా’ అని కూడా అన్నారు కదా’ సరేగానీ ఈ వాదోపవాదాలెందుకు? ఇంతకీ నన్ను ఎందుకు పిలిచావు? నాతో ఏదైనా పనుందా నీకు?

నీతో పనిలేనివారున్నారా ఈ భూమి మీద. అందరికీ నీతో పని ఉంటూనే ఉంటుంది.

నీ పనేంటో చెప్పు,

తొందరపెట్టకయ్యా. ఇంత తొందరగా ఏమయ్యోయ్‌ అని పిలవగానే నువ్వు వచ్చేస్తావని కలగన్నానా. నెమ్మదిగా వస్తావులే, ఈలోగా నిన్ను ఏం అడగాలో ఆలోచించుకోవచ్చులే అనుకున్నాను.

తొందరగా వచ్చినా కూడా తప్పేనా. వస్తే వచ్చానంటారు, రాకపోతే రాలేదంటారు. భక్తుల భక్తిని అర్థం చేసుకోలేకపోతున్నాను.

అంత కోపగించుకోకయ్యా. నిన్ను చూసిన ఆ తన్మయత్వం నుండి, కంగారు నుండి నేను బయటకు రావాలి కదా.

కంగారు ఎందుకు. నేను మీ వాడినే కదా…

మా వాడివే, కాదనలేదు. కాని నిన్ను మనసులో స్మరించుకుని, అంతరంగంలో దర్శించుకోవడం వేరు, మా చక్షువులతో దర్శించుకోవడం వేరు.
నీవు కంటికి కనపడనంత వరకు ‘నువ్వు కనపడవేమి’ అని ప్రశ్నించే మేము, నీ సాక్షాత్కారం కలిగితే, అది తట్టుకోవడం కష్టమే.

అదేంటి. నేనేమైనా నా రూపంతో మిమ్మల్ని భయపెడతానా. సౌమ్యంగానే, మీ రూపంలోనే, కళ్లు, ముక్కు, చెవులు, కాళ్లు, చేతులు… అంతా అచ్చంగా మీలాగే దర్శనమిస్తాను కదా. అందునా భక్తులకు నేను ప్రసన్న వెంకటేశునిగానే కనువిందు చేస్తాను కదా.

నీ మాటను దేనినీ కాదనను. కాని ఒక్క మాట చెప్పమంటావా. నువ్వు మాకు కనపడితే, ఆ కాంతిని తట్టుకోవడానికి మాలాంటి సామాన్యులకు శక్తి చాలదు. నిన్ను దర్శించాలంటే ఓ ఆదిశంకరుడు, ఓ రామకృష్ణ పరమహంస, ఓ వివేకానందుడు… వీళ్లు.. అర్హులు.

ఇంత వేదాంతం మాట్లాడుతున్నావేం.

ఏం లేదు. ఓ పది రోజుల క్రితం నీ ఆదేశానుసారం నిన్ను దర్శించుకోవటానికి నీ కొండకు చేరుకున్నాం. ఆ రోజు నిజంగా నీ అనుగ్రహం మా మీద నూటికి నూరుశాతం పడిందనే చెప్పాలి. ఆ రోజు గురువారం. నీ నిజరూపాన్ని దర్శించాను. అసలు ఇటువంటి దర్శనం ఉంటుందని తెలియదు. అది నా అజ్ఞానంగా భావించి, నన్ను శిక్షించకుండా ఆశీర్వదించి విడిచిపెట్టేసై. ఆ రోజు దర్శనానికి బయలుదేరుతుండగా మాతో ప్రయాణిస్తున్న ఒక భక్తుడు ‘‘ఈ రోజు నిజరూప దర్శనం, మీ అదృష్టం మీకు అవకాశం వచ్చింది. ఎంతోమంది ఎంత కష్టపడినా ఆ అవకాశం దొరకదు’’ అని చెప్పాడు. నాకు ఏమీ అర్థం కాలేదు.

ఆశ్చర్యంగా ఉందే.. అందరూ ఆ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కదా.

నేను ఒక విచిత్రమైన మనిషిని. దేవుడు సర్వాంతర్యామి అని త్రికరణశుద్ధిగా నమ్మే స్వభావిని. ఈ విషయాన్ని నమ్మాను, నమ్ముతాను, నమ్ముతూనే ఉంటాను. అందువల్ల సాధ్యమైనంత వరకు ప్రతి ప్రాణిలోనూ నిన్ను దర్శించుకుంటాను. ఆ కారణంగా ఈ సేవల గురించి పెద్దగా ఆసక్తి చూపలేదు. నువ్వు చాలా చిత్రమైనవాడివి కదా, నీ గురించి ఎక్కువగా ఆలోచించనివారికి, నిన్ను నిందించేవారికి ముందుగా దర్శనమిస్తావు, నీ పరమ భక్తులను చాలా ఆలస్యంగా కనికరిస్తావు. నేనసలు నీ ఆలయానికి వస్తానని కానీ, నిన్ను ఈ విధంగా దర్శించుకుంటానని కాని ఏ క్షణమూ అనుకోలేదు. ఇది అంతా యాదృచ్చికంగా జరిగిపోయింది. ‘నీ కొండకు నీవే రప్పించుకో’ అన్న చందాన, మమ్మల్ని నువ్వే రప్పించుకుంటావు.

సరే కానీ, నువ్వు వచ్చావు కదా. నన్ను సరిగా చూశావా లేక ఏదో ఆలోచిస్తూ నడిచేశావా.

నిజం చెప్పనా!

నిజమే చెప్పు

లోపలకు నీకు అత్యంత సమీపంగా అడుగు పెడుతుంటే, నాకు ఏం జరిగిందో తెలియదు, ఏం చూశానో అసలు గుర్తు రావట్లేదు. నువ్వు నిరాడంబరంగా, అత్యంత సామాన్యుడిలా కనిపించావు, అంతవరకే చెప్పగలను, నీ నేత్రాలను, పాదాలను కూడా చూడలేకపోయాను. ఆ మైకం, ఆ పారవశ్యం, ఆ అనుభూతి నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నాను. అందుకే అప్పుడు నిన్ను సరిగ్గా చూడలేదనే నిన్ను చూసి,నీతో మాట్లాడాలనుకుని, నిన్ను పిలిచాను. నువ్వు వచ్చేసావు.

ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు.

నీ నిజరూప దర్శనం అనగానే.. ‘‘మనిషి ఎంత సంపాదించినా, నిరాడంబరంగా ఉండాలని నిష్కామంగా జీవించాలని నువ్వు బోధించినట్లు అనిపించింది. సాక్షాత్తు భగవంతుడే ఇంత సాధారణంగా చిన్న వస్త్రం ధరించి, ఏ అలంకారం లేకుండా ఉన్నాడే, మనం కూడా ఎందుకు అలా ఉండకూడదు అనిపించింది. వాస్తవానికి నువ్వు అత్యంత సంపన్నుడివి. సంపదలలో నీకు నీవే సాటి. ప్రతిరోజూ నువ్వు వజ్ర కిరీటంతో పాటు, నవరత్న ఖచిత అలంకారాలన్నీ ధరిస్తావు. పూలతో అందంగా, కనువిందుగా సిద్ధమవుతావు. నిండుగా, కన్నులపండువుగా మాకు దర్శనమిస్తావు. మా వంటి భక్తులంతా నీ కిరీటం చూస్తూ, వెళ్లిపోతాం. కాని ఈ సాధారణ రూప దర్శనం ద్వారా మాకు వేదాంతాన్ని బోధించినట్లుగా అనిపించింది.

సరే కానీ, నీకు అర్థమైన వేదాంతం ఏంటో చెప్పు.

ఏం చెప్పమంటావు. నాకు మాటలు రావట్లేదు. అన్నమయ్య కవి కనుక నీ గురించి అన్ని వేల సంకీర్తనలు రచించేశాడు. ఇంక నీ గురించి రాయడానికి మాకు ఏమీ మిగల్చలేదు. కాని ఎవరి అనుభూతి వారిది కనుక, నాకు వచ్చిన సామాన్యమైన భాషలో నీ గురించి నాలుగు మాటలు చెబుతాను.

చెప్పు చెప్పు. నా భక్తులు ఏది చెప్పినా నాకు ఆనందమేగా.

ఏడు కొండల మీద ఏడు ద్వారాలు దాటి, ఒక చిన్న గదిలో అభయహస్తంతో నిలబడి, ఇన్ని కోట్ల మందిని నీ దగ్గరకు రప్పించుకుంటున్నావు. మమ్మల్ని అనుగ్రహించడానికి నువ్వు అంత దూరంలో, అంత ఎత్తు మీద ఎందుకు నిలబడ్డావు. నాకు ఇప్పటికే కాదు ఎప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నే ఇది.

నీకు ఎంతో కొంత జ్ఞానం ఉంది కదా. నేను సర్వాంతర్యామిని అని నీకు తెలుసు కదా. నేను ఈ ఏడుకొండల మీద కాదు, అంతటా ఉన్నాను.( కాని నాకో రూపం ఏర్పరచి, ప్రాణప్రతిష్ఠ చేసి, భక్తులకు పవిత్ర అంతరంగం రూపొందేలా నన్ను ఇక్కడ నిలబెట్టారు.) నా కొండ మీదకు రాకపోయినా, నేను అందరినీ అనుగ్రహిస్తాను.

నిజమే స్వామీ! కానీ జీవితంలో ఒక్కసారైనా నిన్ను దగ్గరగా చూడాలని భక్తులమంతా ఆరాటపడుతుంటాము.

అది నాకూ సంతోషమే. నా దగ్గరకు వచ్చి వెళితే మీకు ఆనందంగా ఉంటుందనీ, మీ కోరికలు నెరవేరుతాయనీ మీరు అనుకుంటే, నాకు అంతకు మించినది ఏముంటుంది.

అలా అనటం లేదు. మా కోర్కెలు నువ్వు నెరవేర్చాలని కోరుకోవటం లేదు. మేమంతా నిరాడంబరంగా జీవించేలా మా మనసులను నువ్వు మళ్లించాలి. కొన్ని లక్షల కోట్లకు అధిపతివి అయిన నువ్వు అత్యంత సామాన్యులందరికీ దర్శనమిస్తూ, నిలబడే ఉంటావు. మేం గంట సేపు నిలబడలేకపోతున్నాం. అయినా ఓపిక తెచ్చుకుంటాం, ఇక నీ మహిమ ఎలాగూ ఉంటుంది కదా. ఇక్కడ నాది ఒక చిన్న సందేహం స్వామీ!

అబ్బో! ఇప్పటికి నన్ను స్వామీ అని పిలిచావా. చెప్పు నీ సందేహం.

నువ్వు డబ్బున్నవారినే అనుగ్రహిస్తావని, వారికి శీఘ్రంగా దర్శనమిస్తావనీ, వారిచ్చే డబ్బు కారణంగానే వారికి నీవు ఆలస్యం చేయకుండా దర్శనమిస్తావని సామాన్యులు అనుకుంటారు.

నిజమే. అందులో తప్పేమీ లేదు. వారి దగ్గర డబ్బు ఉంటుంది కానీ, సమయం ఉండదు. సామాన్యుల దగ్గర డబ్బు ఉండదు కానీ, కావలసినంత సమయం ఉంటుంది. అందుకే ఎక్కడెక్కడ నుంచో నడుచుకుంటూ వచ్చి, కాలినడకన మెట్లు ఎక్కి, నా దర్శనం కోసం గంటల తరబడి నిలబడతారు.

ఇంత సేపు నిలబడినా వారికి దక్కేది క్షణమాత్ర దర్శనమే కదా స్వామీ!

నువ్వు అలా అనుకోకు. అది చాలా పొరపాటు. వారు నడవటం మొదలుపెట్టినప్పటి నుంచి నా నామస్మరణ చేస్తూనే ఉంటారు. వారు ‘గోవిందా గోవింద’ అంటుంటే నా ఒళ్లు పులకరించిపోతూ ఉంటుంది. ఆ పులకరింత వారికి చేరుతుంది కాబట్టే, వారంతా పారవశ్యంతో శ్రమ తెలియకుండా నా దర్శనానికి వస్తారు. (ఆ పులకరింత నీ ముంగిట నిలిచినా భక్తులకు తాకుందో ఏమో నీ మూర్తిని చూడగానే… వారి కన్నులు అప్రయత్నంగా చెమరుస్తాయి. నా కళ్ళు కూడా అలాగే చెమర్చాయి స్వామి. ఆ అనుభూతి జీవితకాలం మదిలో పదిలంగా ఉంటుంది.)

మరి సంపన్నులు ఇలా రాగలరా. రాలేరు. వారు చేయవలసిన పనులు చాలా ఉంటాయి. ఆ పనిలోనే నన్ను దర్శించుకుంటూ ఉంటారు. ఆ పనులు చేయటం వల్ల ఎంతోమందికి ఉపయోగం ఉంటుంది. అందుకే వారికి శీఘ్ర దర్శనం ఇచ్చి పంపేస్తాను.

ఏమో స్వామీ! నువ్వు నన్ను మభ్యపెడుతున్నావనిపిస్తోంది.

నీకు ఇంకో విషయం తెలుసా… నా దగ్గరకు వచ్చేవారిలో సామాన్యుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. వారిది భక్తియోగం. సంపన్నులది కర్మయోగం. జ్ఞానయోగులు తపస్సమాధిలో ఉండిపోతారు. అక్కడే వారి మనసులలో నన్ను ప్రతిష్ఠించుకుంటారు.

నువ్వు ఎన్ని చెప్పినా నాకు నా మరో సందేహం కలుగుతూనే ఉంటోంది స్వామీ!

ఆలస్యం దేనికి, చెప్పు.

నీ దర్శనానికి టికెట్లు అవసరమా. పదివేలు, ఐదు వేలు, మూడు వందలు.. ఇలా రకరకాలుగా సేవల పేరుతో భక్తుల దగ్గర నుంచి డబ్బులు దోచేయటం కాదా. భగవంతుడిని దర్శించుకోవటానికి డబ్బులు చెల్లించాలా.

మంచి మాట అడిగావు. చాలామంది ఈ విషయంలో చాలా కోపంగా ఉంటారు. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. వారి దగ్గర అధికంగా ఉన్న సంపదలను ఏం చేసుకుంటారు. ఆ ధనాన్ని నా హుండీలో వేసేస్తారు. కొందరు నాకు నగలు చేయిస్తారు. కొందరు విరాళాలుగా ఇస్తారు. మరికొందరు ప్రవేశ రుసుముగా ఇస్తారు. ఎవరికి తోచిన విధంగా వారు నాకు ముడుపులుగా చెల్లించుకుంటారు.

అవును ఆ మాట నిజమే. కాని ఉచితంగా దర్శనమిస్తే నీ సొమ్మేమైనా పోయిందా అని కొందరి వాదన.

నేను ఎవ్వరినీ తప్పు పట్టను. అలా వారితో మాట్లాడించేదీ నేనే. ఇలా వీరిని రప్పించుకునేదీ నేనే. సమతుల్యత అంటారు తెలుసు కదా. అది పాటిస్తాను.

సమత్యుల్యతా… ఏ అర్థంలో అంటున్నావు స్వామీ.

అవును వారి దగ్గర ఉన్న సొమ్మును వారు నాకు జమ చేయడం వల్ల, ఆ సొమ్ముతో నేను సామాన్యులకు అన్నప్రసాదం ఇస్తున్నాను. అన్ని ఉచిత సౌకర్యాలు కల్పిస్తున్నాను. నా తరఫున విద్యార్థులకు విద్యా సౌకర్యం, అందరికీ ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తున్నాను కదా. ఇన్ని పనులు చేయాలంటే డబ్బులు కావాలా వద్దా చెప్పు. అలాగే ఎంతోమంది దాతలు మంచి పనులు చేయాలనుకుంటారు, కాని వారికి ఎలా చేయాలో తెలియదు. అలాంటివారంతా ఆ ధనాన్ని నా హుండీలో వేస్తున్నారు. నేను సద్వినియోగం చేస్తున్నాను కదా. ఇంతకంటె ఏం కావాలి.

అన్నీ ఒప్పుకున్నాను మహాప్రభో! ఒప్పుకున్నాను. నాకు ఇంకా చాలా సందేహాలున్నాయి. కాస్తంత ఓర్పుగా, ఓరిమితో సమాధానాలిచ్చి, నా మనసును ప్రశాంతపరచు స్వామీ.

అడుగు అడుగు. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అనే నానుడి ఉండనే ఉందిగా. కానియ్యి కానియ్యి…

నేను నీ కొండ మీదకు వచ్చిన రోజు రాత్రి ఖాళీ సమయం దొరకడంతో… కొండంతా హాయిగా తిరుగుతున్నాను. అప్పుడు కొన్నివేల మంది భక్తులు పెద్ద పెద్ద విశాలమైన బహిరంగ ప్రదేశాలలో హాయిగా నిద్రపోతూ కనిపించారు. వారు ఒక్క పైసా కూడా కట్టక్కరలేదు. ఎక్కడ ఖాళీ ఉంటే, అక్కడ చిన్న దుప్పటి పరచుకుని, చల్లగా ఉండటం చేత, రగ్గులు ముసుగు వేసుకున్నారు. ఎవ్వరికీ ఎవరితోనూ సంబంధం లేదు. కాని ఒకరి ప్రక్కన ఒకరు సుఖంగా ఎటువంటి సంశయం లేకుండా నిద్రిస్తున్నారు. అంటే సామాన్యులు కాబట్టి, వారిని నేల మీద పడుకోబెడుతున్నావు.. అని కొందరు గుర్రుగా అంటున్నారు.

ఎవరు ఏమనుకున్నా సరే.. నాకు వారంటే అపారమైన ప్రేమ. వారిలో చాలామంది కొన్ని వందల మైళ్ల దూరం నుంచి కాలినడకన వస్తారు. మళ్లీ నా కొండను కూడా కాలినడకనే ఎక్కుతారు. నన్ను దర్శించుకోవటానికి గంటలకొద్దీ సమయం నిరీక్షిస్తారు. అంతా అయ్యాక, నా లడ్డూ ప్రసాదం, నా అన్న ప్రసాదం కడుపునిండా తిని, హాయిగా కంటి నిండా నిద్రపోతారు. వీరికి మించిన మహారాజులు ఎవరుంటారో చెప్పు నువ్వు.

నీ చేష్టలన్నీ నువ్వు సమర్థించుకుంటున్నావేమో అనిపిస్తోంది.

నువ్వు ఎలా అనుకున్నా సరే, నా అంతరంగం నాకు తెలుస్తుందే కాని, నీకు తెలియదు కదా.

సరేలే.. నీతో అనవసరంగా వాదించను.
అయితే నాకు మరో సందేహం… ఇలా పడుకున్న భక్తులను చూసి, అన్నమయ్య చేత, ‘నిండార రాజు నిద్రించు నిద్రయునొకటె, అండనే బంటు నిద్ర అదియునొకటే..’ అని పలికించావా? వారిని చూడగానే ఆ సంకీర్తన గుర్తుకు వచ్చింది నాకు.

అలా చిరునవ్వులు చిందిస్తావేమిటి స్వామీ. నా సందేహానికి సమాధానం చిరునవ్వేనా.

ఆ విషయం ఇంక విడిచిపెట్టేసై. నీతో ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్యన నాకు పదే పదే కడుపు నిండిపోతోంది. త్రేన్పులు వస్తూనే ఉన్నాయి.

అదేమిటి స్వామీ. మీరు మెతుకు ముట్టరు. నీ పేరు చెప్పుకుని, నీకు నైవేద్యం పెట్టి, కడుపు నింపుకునేది మేము కదా.

అవును అందుకే నా కడుపు నిండిపోతుంటుంది. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు భోజనాలు చేస్తుంటే, నా కడుపు నిండిపోకుండా ఉంటుందా చెప్పు. మీరు ఆనందంగా ఉంటేనే కదా నాకు ఆనందం. మీరు అన్నం లభించక బాధపడుతుంటే, నేను ఎంత బాధపడతానో కదా.

నీ లీలలు అర్థం కావు స్వామీ. ఆకలినే నువ్వే పెడతావు. కడుపూ నువ్వే నింపుతావు. మాతో తిట్టించుకుంటావు, ప్రశంసలు చేయించుకుంటావు, నిందాస్తుతులు కూడా మాతో పలికిస్తావు. ఏమిటో నీ మాయ. మాకు ఈ జన్మకు అర్థం కాదులే.

అర్థమైతే ఇంక మోక్షమేగా.

నిజమే స్వామీ. ఎప్పుడు తిరుమలకు వెళ్లినా, ఒక్కోసారి ఒక్కో అనుభూతి. చిన్నతనంలో నీ కొండకు వెళ్లిన వారు ‘పద్మావతి, తిరుమల, వెంకటేశ’ అని ఆకాశనీలి రంగులో తయారైన గాజుల మీద, బంగారు రంగులో తెలుగు అక్షరాలతో రాసిన గాజులు తెచ్చి ఇస్తే ఎంత నచ్చేదో. అప్పటికి మాకు గాజుల మీదే మోజు,. నీ దగ్గరకు ఎవరు వచ్చినా ఆ గాజులు తప్పక తెచ్చేవారు. ఇప్పుడు ఎందుకో ఆపేశారు. బాల్యంలో ఆ గాజుల అనుభూతి.
కొంచెం తరుణ వయస్కులమయ్యాక…


పి. వి. ఆర్‌. కె. ప్రసాద్‌ గారి సమయంలో వారి ద్వారా మా నాన్న (ఉషశ్రీ) ను నువ్వు నీ కొండకు రప్పించావు. నాన్న రచించిన రామాయణ, భారత, భాగవతాలు అందరికీ అతి తక్కువ ధరలో అందించావు. ఆ రోజు నిన్ను దర్శించుకోవటానికి కుటుంబమంతా వచ్చాం. ఆ రోజు నీ ఎదుట నిలబడి కావలసినంత సమయం నిన్ను దర్శించుకున్నాం. ఆ అనుభూతి వేరు. రామాయణంలో పిటకల వేట లాగ మధ్యలో ఈ విషయం ఎందుకు ప్రస్తావించానా అని నన్ను ప్రశ్నించకు.
ఇప్పుడు సూర్యుడు పడమటింటికి చేరుకుంటున్న ఈ వయస్సులో కలుగుతున్న అనుభూతి వేరు. ఈ అనుభూతిని నీతో పంచుకోవడానికి మంచి అక్షరాలు కూడా నా అంతరంగం నుంచి బయటకు రావట్లేదు. ఇదే కదా అసలైన అనుభూతి అని మాత్రం అనిపిస్తోంది.
నిన్ను చూసిన నా కళ్ళు ఆనంద అశ్రుపూరిత నయనాలు అయ్యాయి. నిన్ను పదేపదే దర్శించుకునే వరం ప్రసాదించమని నేను కోరను. ఎ‌లాగూ నీ కొండకు నువ్వే రప్పించుకుంటావుగా.

నన్ను బాగా అర్థం చేసుకున్నావు నువ్వు.

నిన్ను అర్థం చేసుకునేంత జ్ఞానం నాకు లేదు స్వామీ. నాకు అక్కడ జరుగుతున్న ధార్మిక కార్యక్రమాలు, లౌకిక కార్యక్రమాలు చూస్తుంటే… ఇంత పెద్ద వ్యవస్థ ఎలా నడుస్తోందా అనిపించింది.
అంతలోనే…
నువ్వుండగా ఎంత పెద్ద వ్యవస్థయినా సులువుగా నడిచిపోతుందిలే అనిపించింది.

ఏంటోయ్‌ నన్ను ఇంతగా పొగిడేస్తున్నావు.

పొగడ్త కాదు స్వామీ. ఇన్ని వేల మందికి అన్నం వండి వడ్డించడం.. అది కూడా ఏ ఒక్కరూ అన్నం కోసం నిరీక్షించకుండా ఉండేలా రూపొందిన విధానం ఆశ్చర్యపరుస్తుంది. అన్నీ ఉచితంగా అందచేస్తున్నావు.

హూ….

నవ్వకు స్వామీ.
చివరగా ఒక్క చిన్న కోరిక.
అనాయాసేన మరణం అన్న చందాన, మా అందరికీ ఏ బాధా లేకుండా మోక్షాన్ని ప్రసాదించు స్వామీ. మేం అందుకు యోగ్యులమనిపిస్తేనే.. ప్రసాదించు. ఇది మా విన్నపం. నిన్ను చేరుకోవాలనుకునే దృఢ సంకల్పాన్ని మాకు అనుగ్రహించు.
నీ బిడ్డలం కనుక, ఇందులో తెలియక ఏదైనా తప్పుగా పలికినా, శిక్షించకుండా, మన్నించి, ఆదరించి, ఆశీర్వదించు.
నమోన్నమః


శ్రీ వేంకటేశ్వరుని తిరుమలలో దర్శించిన తాదాత్మ్యతలో కలిగిన అనుభూతికి అక్షర రూపం)

1 COMMENT

  1. 🙏🙏🙏 స్వామి వారి నిజ రూప దర్శనం కలుగజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Watch CHAVA in a Theatre

(Dr Kamalakar Karamcheti) The Hero is captured by the villain...

మా మద్దతు టీమ్ జేఎన్‌జేకే

తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌హేష్‌కుమార్‌గౌడ్‌ఈసారి టీమ్ జేఎన్‌జే అభ్య‌ర్థుల‌ను గెలిపించండిఅడ్డంకుల‌న్నీ తొల‌గించి,...

AGOMONI: A Rising Socio-Cultural Force in Suncity

(Dr Shankar Chatterjee) Agomoni Cultural Association established itself as a significant...

First Alumni Meet at a Engineering College in Telangana

Kshatriya College of Engineering (KCEA), Nizamabad District (Dr Shankar...