జాతీయ రైతు ఐక్య వేదిక ఏర్పాటు

Date:

రైతు సంఘాల నేత‌ల స‌మావేశం తీర్మానం
తెలంగాణ విధానాల అమ‌లే ధ్యేయం
ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సుదీర్ఘ చ‌ర్చ‌
కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌కు ఖండ‌న‌
హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 27:
దేశానికే ఆదర్శంగా తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయం రంగ అభివృద్ధి, రైతు సంక్షేమ విధానాలు దేశవ్యాప్తంగా అమలయ్యేలా చూసేందుకు జాతీయ రైతు ఐక్యవేదిక ఏర్పాటు కావాలని శనివారం నాడు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన కొనసాగిన జాతీయ రైతు సంఘాల నాయకుల సమావేశం ముక్త కంఠంతో తీర్మానించింది.
దేశ వ్యవసాయరంగానికి తెలంగాణ మోడల్ అత్యవసరమని సమావేశంలో పాల్గొన్న వక్తలు స్పష్టం చేశారు. దేశ వ్యవసాయ రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై శనివారం నాడు సుదీర్ఘమైన చర్చ జరిగింది. పంటలు పండించడంతోపాటు, గిట్టుబాటు ధరలను కల్పించే విషయంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను సమావేశం తీవ్రంగా ఖండించింది. దేశ రైతాంగాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై సమావేశంలో అర్ధవంతమైన చర్చ జరిగింది.


రైతాంగం సంఘ‌టితం కావాలి
దేశ రైతాంగ సమస్యలను ప్రపంచం దృష్టికి తీసుకువచ్చిన ఇటీవలి కిసాన్ ఆందోళనలో పాల్గొన్న పలువురు సీనియర్ రైతు సంఘాల నేతలు తమ అభిప్రాయాలను సమావేశంలో వెల్లడించారు. దేశంలో అసంఘటితంగా ఉన్న రైతాంగం మొత్తం సంఘటితం కావాల్సిన సందర్భం వచ్చిందని, అందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చొరవ తీసుకోవాలని కోరారు.
దేశంలో ఎక్కడైనా రాజకీయ నాయకులు రైతుల విషయంలో కేవలం 5, 10 నిమిషాల సమయం మాత్రమే కేటాయిస్తారు. కానీ, రోజుల పాటు సమయం కేటాయించి, వారి సమస్యల పరిష్కారం దిశగా చర్చలు చేసింది తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రమే అని సమావేశంలో పాల్గొన్న రైతు నేతలు అన్నారు. ఇటువంటి విస్తృతస్థాయి రైతు సమావేశం దేశంలోనే మొదటిసారి అని వారన్నారు.తెలంగాణలో వ్యవసాయంతోపాటు సాగునీరు, తాగునీరు, 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతు బీమా, రైతు వేదికలు, రైతులకు పంట కల్లాల నిర్మాణం, కరోనా కష్టకాలంలో సైతం పంటల కొనుగోళ్లు, వ్యవసాయ అనుబంధ రంగాలు, పాడి పంట, మిషన్ భగీరథ, ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, విద్య, వైద్య రంగాలలో వీటికి సంబంధించి తదితర వివరాలను, అన్ని అభివృద్ధి పథకాల వివరాలను సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను రైతు సంఘాల నేతలు అడిగి తెలుసుకున్నారు.


అలాగే, ప్రకృతి వనరులు, సాగుయోగ్యమైన భూములు తదితర అన్ని సౌకర్యాలున్నా, వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయడంలో 75 ఏండ్ల స్వతంత్ర భారత దేశ నాయకత్వం, పాలక వ్యవస్థ వైఫల్యం కావడం పట్ల సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది.
రైతు సంక్షేమంపై నేత‌ల‌తో కేసీఆర్ చ‌ర్చ‌
ఉత్తర, దక్షిణ భారతంలో సహా, ఈశాన్య రాష్ట్రాల వ్యవసాయం, రైతు సంక్షేమంపై సీఎం కేసీఆర్ రైతులతో చర్చించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక, అసంబద్ద విధానాల వల్ల జరుగుతున్న నష్టాలపై వారు సీఎం కేసీఆర్ కు వివరించారు. ఆయా రాష్ట్రాల భౌగోళిక నైసర్గిక స్వరూపాలను, వాతావరణ పరిస్థితులను అనుసరించి పండే పంటలు, ప్రజల అవసరాలను తీర్చే పంటలు, రైతులకు మరింత లాభాలు తెచ్చిపెట్టే దిశగా, వ్యవసాయాన్ని లాభసాటి వ్యవహారంగా తీర్చిదిద్దే అంశంపై వారు సీఎం కేసీఆర్ సహకారాన్ని అభ్యర్థించారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా, మాకూ సహకారం దొరికితే తెలంగాణ రైతుల మాదిరి సంపన్నులమవుతామని వారంతా ధీమా వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ… ‘‘చైతన్యంతో స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్న ఏ దేశమైనా, ఏ సమాజమైనా ఆ పోరాట చైతన్య స్ఫూర్తిని కొనసాగిస్తూ తమ స్వయంపాలనలో ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతుంది. భవిష్యత్ తరాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తమ దేశాల చట్టాలను, పాలనా వ్యవస్థలను రూపొందించుకుంటుంది. తమ ప్రజలకు ఎలాంటి పాలన అందించాలో సర్వానుమతి తీసుకొని పాలనను ప్రారంభిస్తారు.
మొదటిదశలోనే పరిపాలన సంపూర్ణంగా ఉండకపోవచ్చు. రానురాను బాలారిష్టాలను దాటుకుంటూ పాలన అనుభవాలను, కార్యాచరణను క్రోడీకరించుకోవడం ద్వారా రెండు మూడు దశాబ్దాల్లో పాలనను 80 శాతం వరకు విజయవంతంగా గాడిలో పడుతుంది. తద్వారా ఆ దేశ ప్రజల జీవితాలు గుణాత్మకంగా అభివృద్ధి సాధిస్తాయి. మిగిలిన కొద్దిశాతం పాలన కూడా మరికొద్దికాలంలో చక్కబడి, పరిపూర్ణత సాధించుకుంటుంది. ప్రపంచంలో సైన్సు, సాంకేతిక అభివృద్ధి పెరుగుతున్నకొద్దీ ఆయా సమాజాల్లో నూతన ఆవిష్కరణలు చోటు చేసుకుంటాయి. అట్లా సాంకేతికత పెరుగుతున్నాకొద్దీ.. పాలనలో పరిపూర్ణత వస్తుంది. మానవ జీవితం ఉన్నంతకాలం ఈ పరిణామ క్రమం నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉంటుంది.’’ అని అన్నారు.
75ఏళ్ళ‌యినా గాడిలో ప‌డని పాల‌న వ్య‌వ‌స్థ‌
‘‘మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచిన తర్వాత కూడా కేంద్రంలోని పాలనావ్యవస్థ ఇంకా గాడిలో పడకుండా, ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేరకుండా పోవడానికి గల కారణాలను మనం అన్వేషించాలి. స్వాతంత్య్ర‌ పోరాటం ముగిసిన దశాబ్దాల తర్వాత కూడా దేశంలో అనేక వర్గాలు తమ ఆకాంక్షలను, హక్కులను నెరవేర్చుకునేందుకు ఇంకా పోరాటాలకు సిద్ధపడుతుండటం ఎందుకో మనందరం ఆలోచించాల్సి ఉంది. ముఖ్యంగా దేశంలోని రైతు సమస్యలకు ఇంకా ఎందుకు పరిష్కారం దొరకడం లేదో, ఈ దేశ పాలకులు ఎందుకు వైఫల్యం చెందుతున్నారో మనందరం చర్చించుకోవాల్సిన సందర్భం ఇది.’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.


‘‘చట్టసభల్లో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన వాళ్లు నిర్లక్ష్యం వహిస్తుండటం, ప్రజలకోసం పనిచేసే వాళ్లను దేశ పాలకులే ఇబ్బందులకు గురిచేయడం అనే పొంతనలేని ప్రక్రియ ఒకటి ఈ దేశంలో కొనసాగుతుండటం మనందరి దురదృష్టకరం.’’ అని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటువంటి పరిస్థితుల నుంచి దేశాన్ని బయటపడేసేందుకు, ప్రజల సంక్షేమం కోరుకునే శక్తులు సంఘర్షించాల్సి ఉంటుందని సీఎం అన్నారు. ఈ సంఘర్షణ ప్రారంభదశలో మనతో కలిసివచ్చే శక్తులు కొంత అనుమానాలు, అయితదా కాదా? అనే అపోహలకు గురవుతుంటారని సీఎం వివరించారు. ఈ అడ్డంకులన్నింటినీ దాటుకొంటూ ఐక్యత సాధించి లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుందన్నారు.
‘‘భారతదేశంలో ప్రకృతి వనరులు, వ్యవసాయ యోగ్యమైన భూమి దేవుడిచ్చిన వరం. అమెరికా, చైనా వంటి మిగతా ఏ దేశాలతో పోల్చి చూసినా నీటి వనరులు, వ్యవసాయ యోగ్యమైన భూమి, మానవ వనరులు భారతదేశంలోనే పుష్కలంగా ఉన్నాయి. దేశంలో మొత్తం 40 వేల కోట్ల ఎకరాల సాగు యోగ్యమైన భూమి ఉన్నది. ఈ భూముల సాగుకు కావల్సింది కేవలం 40 వేల టీఎంసీల నీళ్లు మాత్రమే. తాగునీటికి 10 వేల టీఎంసీలైతే సరిపోతాయి. మరి, 70 వేల టీఎంసీల నీటి వనరులు మన దేశంలో అందుబాటులో ఉన్నా కూడా, ఎందుకు సాగునీటికి, తాగునీటికి దేశ ప్రజలు ఇంకా కూడా ఎదురు చూడాల్సి వస్తున్నది. అదే సందర్భంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం మన దేశానికి ఉన్నది. అయినా, 2 లక్షల మెగావాట్ల విద్యుత్ ను కూడా వినియోగించుకోలేకపోతున్నాం. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తూ, సాగునీటిని అందిస్తున్నపుడు ఇదేపనిని కేంద్రం దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయదు? రైతులు కూర్చొని మాట్లాడుకోవడానికి తెలంగాణలో ఉన్నట్లు దేశంలో ఎక్కడైనా కిసాన్ మంచ్ లు ఉన్నాయా? సాగునీరున్నది. కరంటు ఉన్నది. కష్టపడే రైతులున్నారు. అయినా ఈ దేశంలో వ్యవసాయ సంక్షోభం ఎందుకున్నది. రైతుల ఆత్మహత్యలు ఎందుకు కొనసాగుతున్నాయి? కేంద్ర పాలకులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విషయాలను మనం విశ్లేషించుకొని, చర్చించాల్సిన సందర్భం ఇది. మన దేశ వనరులను సరిగా వినియోగించుకుంటూ దేశ సౌభాగ్యాన్ని గుణాత్మకంగా అభివృద్ధి పరిచే రైతు వ్యవసాయ సంక్షేమ దిశగా సాగే సుపరిపాలన కోసం మనం అడుగులు వేయాల్సి ఉన్నది. దేశంలోని రైతాంగం అంతా వ్యవసాయ రంగాన్ని గుణాత్మకంగా ప్రగతిపథాన నడిపించేందుకు ఐక్య సంఘటన కట్టవలసి ఉంది. అందుకు దేశవ్యాప్తంగా రైతాంగ పోరాటాలు చేస్తున్న మీరంతా ముందు వరసరలో ఉండాల్సిన అవసరం ఉన్నది.’’ అని సీఎం కేసీఆర్ రైతు సంఘాల నేతలకు పిలుపునిచ్చారు.


తెలంగాణ మోడ‌ల్ విధానాలు అవ‌లంబించాలి
• దేశంలో తెలంగాణ మోడల్ వ్యవసాయ విధానాలు అవలంబించాలని సమావేశంలో పాల్గొన్న రైతు సంఘాల నేతలందరూ కోరారు.
• ఒక ముఖ్యమంత్రి రైతు నాయకుల కోసం ఇంత సమయమివ్వడం దేశంలో ఇదే తొలిసారి అని రైతు సంఘాల నేతలు అన్నారు.
• రైతు వ్యవసాయ సమస్యలపై చర్చ జరిగింది. దానికి పరిష్కార మార్గాల మీద రైతు సంఘాల నేతలు సీఎం కేసీఆర్ తో విస్తృతంగా చర్చించారు.
• దేశంలోని ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి రైతును ఐక్యం చేసే విధంగా ఐక్య రైతు సంఘటన ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నదని సమావేశంలో పాల్గొన్న రైతు సంఘాల నేతలు ముక్త కంఠంతో కోరారు.
• జై జవాన్ – జై కిసాన్ నినాదాన్ని నిజం చేయాలని, రక్షణ, వ్యవసాయ రంగాల్లో ప్రభుత్వ మద్దతు లేకుంటే ఆ దేశం, ఆ రాష్ట్రం వెనుకంజ వేస్తుందని రైతు నేతలు తెలిపారు. అందుకు సీఎం కేసీఆర్ లాంటి నాయకత్వం అవసరమని వారు అభిప్రాయపడ్డారు.
• రైతు సంక్షేమం దిశగా దేశంలో సరైన వ్యవసాయ విధానాలను రూపొందించి అమలు చేసినపుడే దేశం, ప్రజలు సరిగా బాగుపడతారని సమావేశం అభిప్రాయపడింది.
• దేశంలోని నలుమూల నుంచీ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా రైతులు రావడం గొప్ప విషయమన్నారు.
• నాటి తరం రైతు సంఘాల నేతలు చరణ్ సింగ్, దేవీలాల్, జయప్రకాశ్ నారాయణ్, శరద్ పవార్ తదితరులతో కలిసి పనిచేసిన 80 ఏండ్ల వయస్సు పైబడిన పలువురు రైతు నేతలు సమావేశంలో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు.
• శనివారం నాటి సమావేశంలో పలు రాష్ట్రాలకు చెందిన రైతు నేతలు వారి వారి రాష్ట్రాల్లో అమలు చేస్తున్న, కొనసాగుతున్న వ్యవసాయం, రైతుల పరిస్థితుల గురించి తమ అభిప్రాయాలను వెల్లడించారు.
• శనివారం ప్రగతి భవన్ కు వచ్చిన దేశంలోని 26 రాష్ట్రాల రైతు సంఘాల నాయకులతో కలిసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భోజనం చేశారు.
• దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారంటూ వివిధ రాష్ట్రాల రైతులు సీఎం కేసీఆర్ ను ప్రశంసించి, వారికి శాలువాలు కప్పి, పూలదండలు వేస్తూ, చిత్రపటాలు బహుకరించి సన్మానించారు.
• పంజాబ్ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రేమతో కరవాలం అందజేయగా, ఈశాన్య రాష్ట్రాల రైతు సంఘాల నాయకులు పైనాపిల్స్ బహుకరించారు.


స‌మావేశం సాగిందిలా…
తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలతోపాటు పలు రంగాల్లో ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు శుక్రవారం నాడు హైదరాబాద్ చేరుకున్న 26 రాష్ట్రాల రైతు సంఘాల నాయకుల అధ్యయన కార్యక్రమం శనివారం రెండోరోజు కొనసాగింది.
ఇందులోభాగంగా శనివారం ఉదయం ప్రగతి భవన్ కు చేరుకున్న రైతు సంఘాల నేతలకు అల్పాహారం ఏర్పాట్లుచేశారు.అనంతరం వారు వ్యవసాయం, సాగునీరు తదితర రంగాల్లో తెలంగాణ ప్రగతి పై రూపొందించిన డాక్యుమెంటరీని తిలకించారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిని చూస్తున్న వారంతా చప్పట్లతో హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. తమ క్షేత్రస్థాయి పరిశీలనకు, డాక్యుమెంటరీలోని దృశ్యాలు, వివరణలు అద్దంపడుతున్నాయని రైతు సంఘాల నాయకులు తెలిపారు. తమ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి రైతు సంక్షేమ పథకాలు ఉంటే తాము కూడా ఎంతో అభివృద్ధి చెందేవారమని వారు అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ తెలంగాణకే కాదు, మా రాష్ట్రాల్లోని రైతుల గురించి కూడా ఆలోచన చేస్తే బాగుంటుందని వారు ఆకాంక్షించారు. ఆ తర్వాత వారంతా కలిసి ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారితో సమావేశమయ్యారు.
• తెలంగాణ సహా ఢిల్లీ, ఒడిషా, గుజరాత్,కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్ గఢ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, అస్సాం, మిజోరం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, పాండిచ్చేరి, దాదానగర్ హవేలి తదితర రాష్ట్రాలకు చెందిన, వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్న పలువురు సీనియర్ రైతు సంఘాల నేతలు సహా దాదాపు 100 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు.
• సీఎం కేసీఆర్ తోపాటు ఇంకా ఈ సమావేశంలో రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఆశన్నగారి జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
• శనివారం నాటి సమావేశం ఆదివారం నాడు కూడా కొనసాగనుంది. ఈ సందర్భంగా మరిన్ని వ్యవసాయ సమస్యలు, పరిష్కారమార్గాలపైన సీఎం కేసీఆర్ గారితో రైతు సంఘాల నేతలు విస్తృతంగా చర్చించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Who will be triumphing in MAHA elections?

Is it Mahayuti or Maha Vikas Aghadi? Among all parties...

Trump and India: Great expectations

(Dr Pentapati Pullarao) Donald Trump’s election has created great expectations...

Prof.Purushottam Reddy: Renowned Academician

Environmentalist and Developmental Activist  (Prof Shankar Chatterjee)     ...

We are here to help our country: Trump

This is a moment never seen before We are here...