పాపం పాలకులదే
(డా.ఎన్. కలీల్)
ఒకనాడు ఎంతో పవిత్రంగా భావించి ఆరాధించి, పూజించిన ‘సరస్వతి’ రానురాను అంగడి సరుకుగా మారిపోతున్నది. నేడు విద్య ఒక వ్యాపారంగా రూపుదాల్చింది. విద్యనేకాదు విద్యార్థులతోసహా ఏకంగా విద్యాసంస్థలను అమ్ముకునే దురదృష్టపు రోజులు దాపురించాయి. బాలబాలికల పుస్తకాల బరువు, తల్లిదండ్రులకు ధనభారం మోయలేనంతగా పెరిగిపోతున్నాయి. ఇందుకు ముందుగా నిందించాల్సింది, తప్పుపట్టాల్సింది పాలకులనే. ఈ విద్యావ్యాపారం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా మూడుపువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది. లాభసాటిగా ఉన్న ఈ వ్యాపారంలో గతంలో వ్యాపారాలు చేసిన వారు, కాంట్రాక్టర్లు, మరికొందరు రాజకీయ నాయకులు నేరుగా పాలుపంచుకుంటున్నారు. విద్యాశాఖలో పటిష్టమైన చట్టాలు ఉన్నా ఆ చట్టాల అమలు త్రికరణశుద్ధిగా చేయగలిగిన సామర్థ్యం ఉన్న అధికారులు లేకపోవడంతో పరిస్థితి రానురాను అగమ్యగోచరంగా మారుతున్నది. ప్రస్తుత విద్యాసంవత్సరం ఇంకా పూర్తి కాలేదు. పరీక్షలు జరుగుతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేసుకుంటున్నారు. అడిగేవారు, అడ్డగించేవారు కరవైపోయారు. వాస్తవంగా చూస్తే ఒకనాడు ప్రభుత్వ పాఠశాలలే తప్ప ప్రైవేట్ బడులు లేవు. ఎక్కడో పట్టణాల్లో, నగరాల్లో అక్కడక్కడ ప్రైవేట్ బడులు నడిచేవి. వాటిలో కూడా వ్యాపార ధోరణులు కన్పించేవి కావు. లాభనష్టాలతో సంబంధం లేకుండా కేవలం సేవాదృక్పథంతో ఆ విద్యాసంస్థలు నడిచేవి. నిర్వాహకులు సామాజిక బాధ్యతగా భావించి బడులు నడిపేవారు. అందువల్ల ఆనాడు ప్రైవేట్ పాఠశాలలను అరికట్టాల్సిన అవసరం లేకుండాపోయింది. అందుకే చట్టాల అవసరం తలెత్తలేదు. ప్రభుత్వ విద్య కూడా అంతో ఇంతో పటిష్టంగా నడిచేది. కానీ పరిస్థితులు మారిపోయాయి. పాలకుల అశ్రద్ధ, అరకొర నిధులు అవినీతి వీటన్నింటిని మించి నేతలు ఎన్ని నీతులు వల్లిస్తున్నా, ఎన్ని మాటలు చెప్తున్నా రాజకీయ జోక్యంతో ప్రభుత్వ విద్య నానాటికీ దిగజారిపోతున్నది. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. బీదాబిక్కి జనం ప్రైవేట్ విద్య కోసం ఆరాటపడుతున్నారు. ఏమాత్రం ఆర్థిక వసతులు లేక, మరో దారి లేనివారే విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వబాట పడుతున్నారు. గ్రామాలకు ఈ ప్రైవేట్ వ్యాపారం గత రెండు, మూడు దశాబ్దాల క్రితం వరకు అంతగా సోకకపోవడంతో పట్టణాలకు పంపించి చదివించే ఆర్థికస్తోమత లేని మధ్య తరగతి ప్రజలు సైతం తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వ విద్యపై ఆధారపడ్డారు. ఇప్పుడు మండల కేంద్రాలు, చివరకు గ్రామాలకు సైతం ఈ విద్యావ్యాపారం విస్తరించిపోతున్నది. వాహనాలు పెట్టి శివారు పల్లెల నుండి సైతం పిల్లలను తెప్పించుకుంటున్నారు. కూలీనాలి చేసుకొని రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు సైతం ప్రైవేట్ బడుల బాటపడుతున్నారు. ఇక రానురాను ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తు ఏమిటనేది ప్రశ్నార్థకంగా కన్పిస్తున్నది.
ఎందుకు ఈ పరిస్థితి దాపురిస్తున్నది? కారకులు ఎవరు?కారణాలు ఏమిటి? అనేవి అటు అధికార వర్గాలకు కానీ, ఇటు పాలకులకు కానీ తెలియని విషయం కాదు. అయినా ఈ దుర్మార్గపు వ్యాపారానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఒకపక్క మధ్యాహ్న భోజన పథకంలాంటి ఎన్నో ఆశలు చూపుతూ ఉచితంగా పుస్తకాలిచ్చి బోధన చేస్తున్నా ప్రభుత్వ పాఠశాలలకు రావడానికి ఇష్టపడక డబ్బులు చెల్లించి ప్రైవేట్ పాఠశాలల వైపు ఎందుకు మక్కువ చూపుతున్నారో పరిశీలించాల్సిన తరుణమిది. ప్రభుత్వాలు ఏమీ చేయడం లేదని చెప్పడం లేదు. ప్రభుత్వ పథకాలు, ఆశయాలు కాగితాల వరకు బాగానే ఉంటున్నాయి. కానీ ఆచరణకు వచ్చేసరికి అసలు సమస్యలు ప్రారంభమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అన్ని పాఠశాలల్లో కలిపి ఒకటో తరగతిలో దాదాపు నలభై లక్షల మందికి పైగా చేరుతున్నారు. వారిలో యాభైశాతం కూడా ఉన్నత విద్య వరకు చేరుకోవడం లేదు. రకరకాల కారణాలతో ప్రాథమిక విద్య దశలోనే చదువుకు స్వస్తి చెబుతున్నారు. లక్షలాది మంది బాల బాలికలెందరో ఉన్నారు. ప్రభుత్వాలు బడిబాట అంటూ మళ్లీ పాఠశాలల్లో చేర్పించే ప్రయత్నాలు చేస్తున్నా అవి ఆశించిన ఫలితాలు ఇవ్వడంలేదు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతుల కొరత తీవ్రంగా కన్పిస్తున్నది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే అంచనాల ప్రకారం దాదాపు పదివేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అంచనా. ఇక అనేక ప్రభుత్వ పాఠశాలల్లో మంచినీరు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు లేకపోవడంతో బాలబాలికలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. పాలకులు మాటల్లో చెప్తున్నట్లుగా చేతల్లో చూపించలేకపోతున్నారు. దేశాభివృద్ధికే కాదు. మానవ జాతి అభ్యున్నతికి విద్య పునాది అనేది నిర్వివాదం. ఆరేళ్ల నుంచి పధ్నాలుగు యేళ్లవరకు బాలబాలికలందరికి ఉచిత విద్య అందించాలన్న లక్ష్యం కనుచూపు మేరలో కన్పించడం లేదు. ఇక డిపెప్, ఎపెప్, సర్వశిక్షణ అభియాన్ వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి దేశ వ్యాప్తంగా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా పాలకులు కళ్లు
తెరవాలి. బాలబాలికలను భావిభారత పౌరులుగా తీర్చదిద్దాల్సిన విద్యావ్యవస్థను ఇంతటి దారుణ పరిస్థితుల్లోకి నెట్టడం దురదృష్టకరం.
(వ్యాస రచయిత ఫార్మా రంగ నిపుణుడు)
చదువు…కొoటున్నాం
Date: