Home టాప్-స్టోరీస్ సమయ పాలనతో సాగే రామాయణం

సమయ పాలనతో సాగే రామాయణం

0
సమయ పాలనతో సాగే రామాయణం

వాల్మీకి సంస్థ కార్యక్రమంలో డాక్టర్ వైజయంతి
ట్యాంక్ బండ్ పై వాల్మీకి విగ్రహానికి డాక్టర్ లక్ష్మణ్ హామీ
హైదరాబాద్, ఏప్రిల్ 06 :
రామాయణ మహాకావ్యం మొత్తం సమయ పాలన అనే అంశంపై నడుస్తుందని డాక్టర్ పురాణపండ వైజయంతి చెప్పారు. ఈ అంశాన్ని రామ జననం నుంచి పట్టాభిషేకం వరకూ సోదాహరణంగా వివరించారు. వాల్మీకి సాంస్కృతిక సంస్థ శ్రీరామ నవమి పురస్కరించుకుని హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో గనుల శాఖ డైరెక్టర్ గా వ్యవహరించిన వి.డి. రాజగోపాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. పార్లమెంటు సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్, తెలుగు యూనివర్సిటీ పూర్వ రిజిస్ట్రార్ టి. గౌరీశంకర్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రామాయణంలో ప్రతి కార్యానికీ, సమయంతో సంబంధం ఉంటుందని… ఇప్పుడు మనం దీనిని టేమింగ్ అనీ, సమయ నిర్వహణ అనీ అంటున్నామనీ వైజయంతి తెలిపారు. విశ్వామిత్రుని వెంట రాముల వారిని యాగ రక్షణకు పంపమని వసిష్ఠుడు చేసిన సూచనను పాటించడం.. సీత స్వయంవరం సహా పట్టాభిషేక సమయంలో కైక తన రెండు కోరికలనూ కోరడం కూడా సమయం చూసి చేసినవే అని చెప్పారు.

ఏ సమయంలో ఏది ఏ రీతిలో చెప్పాలో కచ్చితంగా అలాగే జరుగుతుందన్నారు. అడవులకు వెళ్లిన రాముడిని హనుమంతుడు కలవడం ఆపై సుగ్రీవునితో మైత్రి, వాలి వధ, హనుమంతుని సముద్ర లంఘనం, సీతాదేవికి తన రాకను తెలియజెప్పిన సమయం…. ఇలా ప్రతి అంశంతోనూ సమయానికి అనుబంధం ఉందని తెలిపారు. రాముని పట్ల దశరధుని వాత్సల్యం అనంతరం రాముడు సోదరుల పట్ల చూపిన అభిమానాలు ఉపమానాలతో వివరించారు. అనంతరం డాక్టర్ వైజయంతికి వాల్మీకి సంస్థ జీవన సాఫల్య పురస్కారం అందజేసింది.

అంతకు ముందు సాయంత్రం నాలుగు గంటలకు రామాయణం నేపధ్యంగా 57 మంది కవులు రాసిన కవితలను చదివారు. వీటితో ప్రచురించిన ఈ- పుస్తకాన్ని డాక్టర్ లక్ష్మణ్ ఆవిష్కరించారు. కవులందరినీ రాజగోపాల్ సత్కరించారు.

మొత్తం కార్యక్రమం దాదాపు సుదీర్ఘంగా ఆరుగంటలపాటు సాగింది. ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మణ్ ప్రసంగిస్తూ, ట్యాంక్ బండ్ పై వాల్మీకి విగ్రహ ప్రతిష్టకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here