పింగళి … మాటల డింగరి

0
545

పాతాళ భైరవిలో కొత్త పదాల సృష్టి
(వైజయంతి పురాణపండ)
పాతాళభైరవి – కథ, మాటలు, పాటలు: పింగళి నాగేంద్ర, దర్శకత్వం: కె. వి. రెడ్డి
పింగళి నిఘంటువు….
ఎంతో కష్టపడి ఎన్నో పదాలను అందరినీ ఒకచోట కూర్చోబెట్టి తాతముత్తాతపాదులు ఆ పదాలకు నిఘంటు నివాసం ఏర్పాటు చేశారు. కాని మన ‘బంగారు పాళి పింగళి’ ని మాత్రం ఎంతో కష్టపడకుండా ఎంత బాగానో స్తోత్రం చేశారు. పాపం అలా అనకూడదేమోలే. ఎంతో కొంత కష్టం శాయకుండా అలా ఎలా మిద్దెలు ఎక్కిస్తారు. ఓసారి ఆయన నడచినా పాదాలు, నడిపినా పదాలను పరిశీలన శాయాలి.

ఓనాడు మద్రాసులో పాత పుస్తకాలు అమ్మే వీధుల్లో సంచరిస్తూ, పాకెట్‌ సైజులో బొమ్మరిల్లు అనుబంధంలా ఉన్న పాతాళభైరవి అనే పేరు ఉన్న పుస్తకం కొని చదవగానే, మెదుడులో చురుక్కున తళుక్కుమనే ఆలోచన వచ్చి, తక్షణమే పాతాళభైరవి సినిమాగా రూపొందింది. ‘మొదలుపెట్టారు కొలువు’ అంటూ తన సంభాషణలు ప్రారంభించి, పద నిధులతో. పదపదమంటూ సినీచూపరులను మాటలకు కట్టిపడేశారు.
తెలిసిన కథే…
కథలోని అక్షరలక్షల పోలు పదంబలయందు పరవేసిద్దాం…
కథానాయకుడు తోటరాముడు స్నేహితుడితో కర్ర సాము చేస్తుంటే, ‘కట్టె సాము మీరూనూ’ అంటూ దుష్ట సమాసాన్ని శిష్టంగా మార్చేశారు. తోటరాముడి ఆగడాలను భరించలేక ‘ఓరి భగవంతుడా ఒక కొడుకునిమ్మంటే ఈ రాక్షసుడినిచ్చావేంటిరా’ అని తల్లి చేత చివచివలాడించారు. (ఇదే ప్రయోగాన్ని అతడు సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చేశారు. గిరిబాబు తన కుమార్తె త్రిషను ఉద్దేశించి …. ఓరి దేవుడా కూతుర్నిమ్మంటే క్వశ్చన్ బ్యాంకుని ఇచ్చావేంటి… అంటారు) రాక్షసుడికి కొత్త భాష్యంగా ‘రాక్షసుడంటే రక్షించేవాడు పిన్నీ అంటే రాజు’ అనిపించారు అంజిబాబుతో. పిల్లికి ఎలక సాక్ష్యాన్ని మార్చేసి, ‘పులిగాడికి తోడు పిల్లిగాడు’ అంటూ సామెత కూడా సృష్టించారు. తోటరాముడి చేతలకు… తల నరికి కోటకు కడతారురా అనకుండా ‘కనపడితే కంఠానికొస్తుంది సుమా’ అని కొత్తగొంతు విప్పారు పింగళి.

కాదు కాదు… తప్పు తప్పు…
రాజ్యంలో ప్రజలంతా వినోదం చూస్తుంటే, రాణిగారి తమ్ముడు, ‘వినోదమేంటి? తప్పు తప్పు పరమ ప్రమాదం, పన్నిచ్చుకోవాలి’ అంటూ ‘కాదు కాదు’ పదాన్ని ‘తప్పుతప్పు’గా రూపాంతరం చెందింది. వినోదం చూస్తున్న వ్యక్తి తాను పారశీకుడనని నుడివితే, ‘పారశీకం ఏంటి తప్పు తప్పు పరశోకం’ అని కొత్త భాష్యం పలికారు. ‘టోపీ ఠింగురంగాలా ఉందే’ అంటుంటే, టోపీ కూడా టింగురంగడిలా తయారయ్యిందే అనిపిస్తుంది. కత్తుల్లాంటి మాటలను ‘కటారులా కస్సుమంటున్నావు’ అనడం విన్నారా. కత్తి కస్సుమంటుందా! ఏమో! అంటుందేమో! అనకుండా పింగళి అనరు కదా. మహారాజుకే కాదు ‘కథానాయకుడికీ జై’ అన్నారు పింగళి. ‘తోట ముసలిది’ అంటే తెలుసా? తోటలో పూలు కోసే అమ్మి. ఇది పింగళి నిఘంటువు. తోటరాముడితో ‘నిజం చెప్పమన్నారా, అబద్ధం చెప్పమన్నారా’ అంటూ నిజాయితీగా పలికించారు. రాజ్యంలో జరిగే అన్యాయాన్ని తోటరాముడు చేయి చేసుకుని ఎదిరిస్తే, ‘మా అధికారంతో మీరు చేయి చేసుకోరాదు’ అని తక్షణ కర్తవ్యాన్ని బోధిస్తాడు రాజు (సి.ఎస్‌.ఆర్‌.)

భలే పింగళి–
పింగళి వారి ఇంటి పేరు ‘భలే’ అయితీరాల్సిందే. అమ్మో అమ్మో ఈ పదాలను అదే.. భలే, భళా పదాలను అనంతకోటిలక్షల వేల సార్లు ఉపయోగించేశారు. రాకుమారిని మనసారా ప్రేమించిన తోటరాముడు, ‘మనసు కళగా ఉంటే పని కూడా కళకళలాడుతుంటుంది’ అని ఒక ఫత్వా జారీ చేసేశారు. ‘మనం ప్రేమించడం, మనం అంగీకరించడం అయిపోయింది’ అని ఆరు పంక్తుల (పంక్తి అంటే పది) సంవత్సరాల ముందే రాజముద్ర వేసేశారు. రాజకుమార్తె (మాలతి) కు తగిన వరుడిని అన్వేషించమంటే, రాణి తమ్ముడు ‘నన్ను స్వయంవరం పరీక్షిస్తుందట’. అంటాడు. ఈ వాక్యం అర్థమయ్యిందా? ఏమీ అర్థం కాలేదుగా. అర్థం సేసుకోరా డింభకా.
‘ప్రేమైతే ఎంతైనా చేస్తానే అక్కు’ అని అక్కని అక్కు చేస్తూనే ప్రేమను కూడా చేస్తాడు రాణి తమ్ముడు. కొత్తగా ‘చెలికత్తనం’ కూడా పలుకుతాడు.

నరుడా ఏమి నీ కోరిక–
నేపాళ మాంత్రికుడిని సృష్టిస్తూ, ఆయనకు ‘సదాజపా’ అనే శిష్యుడిని కూడా తయారుచేశారు పింగళి. బహుశః వాడు నిత్యపారాయణం చేస్తుంటాడేమో మరి. ‘హ్రాం ఫట్‌ ఆం హట్‌ చండీ ప్రసన్న చాముండీ ప్రసన్న సోహిండీ ప్రసన్న, కాపాలినీ ప్రసన్న ఆం మంత్రాది దేవతా ప్రసన్నా’ ఈ మంత్రాలు ఏ వేదాలలో ఉన్నాయో, ఏ ఉపనిషత్తులలో ఉన్నాయో. అనువేషణ సాయవలసిందే. అమ్మవారి చేత ‘నరుడా ఏమి నీ కోరిక’ అని శిలా శాసనం వేసేశారు. ‘సంజీవి స్పర్శ సాయరా’ ‘మహాసాహసవంతుడు’ ‘కీడు మూడేను’ ‘తలకోసి ప్రాణం తీస్తారు’. ఈ పదాలతో ఇంత పెద్ద నిఘంటువు పింగళి లక్ష్మీకాంతం చేశారో లేదో కాని, పింగళి నాగేంద్ర చేసి మన మీదకు వదిలేశారు. ‘నువ్వు విజయోస్తు అని దీవించు నేను తథాస్తు అంటాను’ అంటూ అస్తుఅస్తులు పలికించారు. ఇంత కొత్త సాహిత్యం ఎక్కడ నుంచి పుట్టుకొచ్చిందో!!!

సాహసం సాయరా… నేపాళ మాంత్రికుడు
‘ఆం… ఆం.. అష్టభైరవి, ‘క్లా కఘం… కాలభైరవి, ఢాం తదరం… ఇక మంత్రబలం చూపించేను… మనోబలం చూపించేను’ అమ్మవారిని ఇలా కొలిస్తే పలుకుతుందేమో!!! నేపాల్‌ను కళవళపరిస్తే నేపాళం వచ్చిందా. కావొచ్చు. ‘డింగిళ్లనండి వందనాలనండి’ ‘నడుములు వంగిన నాయకులంతా గడిబిడ సేయక వెనక్కు వెళ్లండి’ ‘డింగరీ…’ ఎన్నని చెప్పాలి కొత్త ముచ్చట్లు. ‘జనం కోరేది మనం సేయడమా… మనం సేసేది జనం చూడటమా’ మరో కొత్త జాతీయం.

గుణింతాల గుంఫనం… మహాజనానికే మరదలు పిల్ల…
‘గాగీగూగే టోటా టీటూ లీలూలేలో మామీమేమో’ ఈ మాటలను గుణింతాలనుకునేరు… తప్పు తప్పు… మాంత్రికుడి మంత్రాలు. ‘హాహాహూహూ హీహీహిహిహి’ ‘డీడూడేడో డూడూడూడూ’ మరో రెండు మూడు గుణింతాలను అడ్డదిడ్డంగా చదివితే మళ్లీ మంత్రం ఫలిస్తుంది. ‘మహాజనానికే మరదలు పిల్ల, అందరూ బావలే గలగల ఆడవే గజ్జెల కోడి’ నేటికీ ఆ మరదలు పిల్ల మహాజనంలో ఉక్కులా, శిలలా గా…ట్ఠిగా కూర్చుంది. ఈ పిల్ల కూడా గుణింతాలతో ‘లాలలూ లాలలూ లాలలు లాలలు లాలలూ’ అంటూ పాట రూపంలో కొనసాగించింది. ‘కూకం కాకి కాకి కూకే’ ‘గాగిగూగే టాటీటూటే’ ‘నీ కోరిక తీరే కీలకం చూపిస్తాను… సాహసం సాయగలవురా’ అని నేపాళ మాంత్రికుడు భలే రాముడిని తికమకపెడతాడు.

కొత్త మాటలు… కొత్త స్తోత్రాలు
‘సాహసివిరా వరపుత్రుడివిరా’ ‘హ్రాం హ్రీం బభంభం’ ‘భలే డింభకా భలే భలే’… పింగళికి నచ్చిన భలే పదాన్ని పునరుక్తి దోషంతో వాడుతూనే ఉన్నారు. కొండదేవర తెలుసు కదా!!! ‘చూస్తివిరా బొడ్డుదేవరను, ఆ ఉక్కుగదతో పగలమోదమంటోంది. ఆజ్ఞ సాయరా. బలంగా మోదరా’ అంటూ కొత్త దేవరను తప్పు తప్పు కొత్త దేవుడిని పుట్టించారు పింగళి. ‘శ్రీంకాళి హ్రీంకరాళి రక్తనేత్రౌ’ ఈ స్తోత్ర రచయిత పింగళి. గాయత్రీ మంత్రాన్ని, లలితా సహస్ర నామాలను కూడా ఆయన ఆవాహన చేశారు. తనకు పాతాళభైరవి దొరికిన విధానాన్ని బహు చమత్కారంగా విదిలించింది పింగళి పాళీ. ‘ముక్కుకు సూటిగా వెళ్లాను, నక్క తోక తొక్కాను, కుక్క తోక దొరికింది., పట్టుకెళ్లి పాతాళంలో పడ్డాను. అక్కడ దేవి ప్రత్యక్షం అయ్యింది’ అంటూ కట్టె కొట్టె తెచ్చె లాగ పలుకుతాడు. ‘ఆర్యులారా అగ్రజులారా’ ఊరి పెద్దల సంబోధన. వంటకాలను కూడా మంత్రాలు చేసేశారు. ‘లాడూవేనీ పార్ణం బూర్లు (లడ్డు పేణీ పూర్ణం బూరెలు). అసలు పింగళి ఏ పదాన్నీ విడిచిపెట్టరా. ఎందుకు విడవాలి. పట్టుకుని వండి, మనకు రుచికరమైన పద భోజనం అందించొద్దు!!!

వ్యతిరేకార్థాలు సాయితం…
‘చావకుండా ఎలా బ్రతకడం…’ ‘మీరు బ్రతిమాలుతున్నారు కనక సస్తున్నా తప్పు తప్పు వస్తున్నా’ చావకుండా బ్రతకడం ఏమిటో, సస్తున్నా వస్తున్నా ఏమిటో. ‘సాహసివిరా పింగళీ’ అనక తప్పదు.
ఈ చిత్రానికే శిరమానికం ఈ సంభాషణ. నేపాళ మాంత్రికుడు సదాజపాతో ‘మీ అమ్మణి ఏం చేస్తోందిరా’ అంటే ‘శోకం చేస్తోంది గురూ’ అంటాడు. ఈ వాక్యాన్ని ఒక్కసారి కాదు పది సార్లు తప్పు తప్పు వంద సార్లు అనుకోండి. వ్యాకరణం సరిగా ఉందో లేదో అర్థం కాదు. పింగళికి బాగా అర్థం అయ్యింది కాబట్టే ఇలా రాశారు. ఆయనకు ఏదైనా కుదురుతుంది. ఇలాంటివే ‘సంజీవని స్పర్శ చేశాను గురూ, గయ్యాళిసాయక వయ్యారంగా నన్ను వరించవే బుల్‌బుల్‌’ కూడా. సంజీవని స్పర్శ చేశాను, గయ్యాళి సాయక, శృంగారం (సింగారం) చేసుకు వస్తాను… ఏం రాశాడో మహానుభావుడు. అరవై సంవత్సరాలు దాటిపోయినా ఇలాంటి పదాలు ఇంకా పుట్టలేదంటే, మళ్లీ పింగళి పుట్టి, తన పదాలకు తానే భాష్యం చెప్పుకోవాలి.
ఇవన్నీ ఎలా పుట్టాయో
‘థిగిడీ…థగిడి’ పదాలు ఎలా పుట్టాయో? ‘నవనాడులను కట్టిపడేయడం, కరగ్రహణం, తలబుర్ర, అమ్మాయీమణి, అమ్మణి, డింగరీ’ ఎన్నని రాయాలి, ఎన్నిటిని వివరించాలి. సద్దు సాయకుండా, బుద్ధిగా పాతాâ¶ భైరవిని చూసి, నేపాళ మాంత్రికుడి వెంట తిరుగుతూ, సదాజపాలతో తలబుర్రను ఇందులో ఉంచితే, పింగళి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ‘మా రాజ్యం సుభిక్షకంగా మా ప్రజలు సౌఖ్యంగా ఉండేట్టు అనుగ్రహించు’ అని ప్రార్థించాలి.

ఫలశ్రుతి: ఈ కథ చూచిన వారికి, చూచినవారి వద్ద విన్నవారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభించేట్లు అనుగ్రహించుము తల్లీ.

పింగళి ఫలశ్రుతి: ఈ చిత్రరాణిని చూసినవారికి మనసు సుభిక్షంగా, అందరికీ సౌఖ్యం కలిగేలా, సకల ఆరోగ్య సంపదలు సమకూరేలా ఆగ్రహించకుండా అనుగ్రహించుగాక.
తథాస్తు…


(వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్ట్)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here