కరోనా తీవ్రతపై ఓ విశ్లేషణ
(ఎలిశెట్టి సురేష్ కుమార్)
దేశంలో కరోనా మూడో దశ పెరుగుదల ఒక దశకు వచ్చేసినట్టేనా… ఓ పది రోజులుగా క్రమం తప్పకుండా కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చి అయిదు రోజులుగా ప్రతి రోజు మూడు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.ఇది మొదట్లో కొంత ఆందోళన కలిగించినా అలా పెరుగుతూ
కొత్త కేసుల సంఖ్య ఎక్కడికి చేరిపోతుందోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమైంది. మూడు లక్షలకు పైన మరీ ఎక్కువ పెరగకుండా ఒక స్ధాయి వద్ద కొత్త కేసుల సంఖ్య నిలిచిపోవడం కొంత తెరిపి..అంతేగాక మంగళవారం నాడు కేసుల సంఖ్య అయిదు రోజుల తర్వాత మొదటిసారిగా మూడు లక్షలకు దిగువ
255874 గా నమోదైంది. అంటే కరోనా కర్వ్ ఫ్లాట్ కావడం మొదలైందని అనుకోవచ్చా.. పాజిటివిటీ శాతం కూడా 15.52 కి దిగింది.
పరీక్షలు తగ్గడమే కారణమా!
వాస్తవానికి పరీక్షలు తగ్గిన కారణంగా కొత్త కేసుల సంఖ్య తగ్గిందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇదిలాఉంటే ఫిబ్రవరి 6 వ తేదీ నాటికి కరోనా మూడో దశ తార స్థాయికి చేరుకుంటుందని మద్రాస్ ఐఐటి అంచనా. తాజా తగ్గుదల శుభ పరిణామం అవుతుందా..చూడాలి. నిజానికి కరోనా మూడో దశ సంఖ్యాపరంగా ఆందోళనకరంగా ఉన్నా ఇతరత్రా అంత ప్రమాదకరంగా కనిపించడం లేదు. వైరస్ సోకిన వ్యక్తులు ఆస్పత్రులకు వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇంటి వద్దనే వారం రోజుల సాధారణ చికిత్సతో కోలుకుంటున్నారు.చాలా మంది నిర్ధారణ పరీక్షలు కూడా చేయించుకోవడం లేదు. ఇది ఆశాజనక పరిస్థితి.
ఇక గత రెండు వేవ్‌ల మాదిరిగానే ఇప్పుడు కూడా పెద్ద నగరాల్లో కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ రావడం మరో అనుకూల సమాచారం. ఢిల్లీ…ముంబై..బెంగళూరు వంటి నగరాల్లో కూడా ఆస్పత్రుల చుట్టూ జనాలు తిరుగుతున్న పరిస్థితి లేదు. ఇవన్నీ చూస్తుంటే ఈ దశ అంత ప్రమాదకరం కాదనే సంకేతాలతో పాటు కరోనా అనే మహమ్మారి తనకు తానుగా బలహీనం అవుతున్న స్థాయికి చేరుకుంటోందా అనే ఆశలకి ఊతం లభించే పరిస్థితి. దేశంలో కోట్ల సంఖ్యలో జనాభా వ్యాధికి గురై కోలుకుని సహజసిద్ధ ఇమ్యూనిటీ పెంచుకుంటుంటే..మరోపక్క వాక్సినేషన్ కార్యక్రమంతో
మరింతగా ఇమ్యూనిటీ పెరుగుతుంటే హెర్డ్ ఇమ్యూనిటీ దశకు చేరుతున్నామని భావించవచ్చు.
ఇకపోతే ఇప్పటికే బలహీన పడిన మహమ్మారి జరగబోయే మ్యూటేషన్లలో మరింతగా బలహీన పడితే
అప్పుడిక కరోనా నుంచి విముక్తి దిశగా ప్రపంచం ముందుకు సాగుతున్నట్టే. ఇప్పటికే ఐరోపా దేశాల నుంచి కూడా అలాంటి వార్తలు వినిపిస్తున్నాయి. (వ్యాస రచయిత విజయనగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్)