సిద్ద రూపాయకు పే సీఎం జవాబు చెబుతుందా

Date:

కర్ణాటకలో ప్రభుత్వం ఎవరిదీ?
ప్రతి ఎన్నికలో పార్టీలను మార్చే ఓటర్ తీర్పు ఏమిటి?
కన్నడ నాట మహా ఉత్కంఠ
ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా?
బీజేపీని సాగనంపుతారా?
(శివ రాచర్ల)

కర్ణాటక ఎన్నికల పరీక్షలు ముగిసాయి… ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన ఎగ్జిట్ పోల్స్ లెక్కల మీద ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు.
12 సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో నాలుగు కాంగ్రెస్ పార్టీకీ, ఒకటి బీజేపీకీ, మిగిలినవి కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించే హాంగ్ అని ప్రకటించాయి. బిజెపి గెలుస్తుందన్న న్యూస్ నేషన్ కేవలం సాధారణ మెజారిటీకన్నా బీజేపీ ఒకే ఒక్క సీట్ అధికంగా 114 స్థానాలు గెలుస్తుందని ప్రకటించింది. దీన్నీ కూడా హాంగ్ గానే చూడాలి. సువర్ణ న్యూస్ – జన్ కి బాత్ బీజేపీకి 94-117, కాంగ్రెస్ కు 91-106 స్థానాలు ఇచ్చాయి , దీన్ని మీడియా హంగ్ గానే భావిస్తుంది.

India Today-Axis My India కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 122-140 స్థానాలు అంచనా వేసింది. News 24-Today’s Chanakya కాంగ్రెస్ కు 120, బీజేపీకి 92, ABP News-C Voter కాంగ్రెస్ కు 100-112 , బీజేపీకి 83-95, Republic TV కాంగ్రెసుకు 94-118 మరియు బీజేపీకి 85-100,Zee News-Matrize కాంగ్రెసుకు 103-118 మరియు బీజేపీకి 79-94 సీట్లు వస్తాయని ప్రకటించాయి,

పెద్దగా పాపులర్ కానీ సి-డైలీ ట్రాకర్ అనే సంస్థ కాంగ్రెసుకు ఏకంగా 130-157 స్థానాలు వస్తాయని ప్రకటించింది.

ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఏక్సిట్ పోల్ కు ఎక్కువ విశ్వసనీయత ఉంది. వీరి ఎగ్జిట్ పోల్ 2018 కర్ణాటకలో తప్పింది కానీ ఆ తరువాత ప్రతి ఎన్నికలో నిజమయ్యాయి.

ఎగ్జిట్ పోల్స్ మీద భిన్నమైన అభిప్రాయాలు ఉండటం సహజం కానీ కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ 2018లో కూడా ఇలాగే ఉన్నాయి.

ప్రతి ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరుగుతూ వస్తోంది. 2013లో 71.45% ,2018లో 72. 36% . ఈ ఎన్నికల్లో నిన్న సాయంత్రం వరకు 72.68% పోలింగ్ జరిగింది.

బీజేపీకి బలం ఉందని భావించే బెంగళూర్ నగరంలో మాత్రం ఓటింగ్ శాతం తగ్గింది. 2013లో 62% ఓటింగ్ జరుగగా నిన్న కేవలం 54.41% మాత్రమే పోలింగ్ జరిగింది.
గెలుపోటములకు కీలక అంశాలు
కర్ణాటక ఎన్నికల్లో గెలుపు ఓటములను అంచనా వేసే ముందు కొన్ని కీలక అంశాలను గమనించాలి.
1.1983 నుండి ప్రతి ఎన్నికల్లో ప్రభుత్వాలు మారుతున్నాయి.
2.1985 నుంచి రాష్ట్రంలో గెలిచిన పార్టీ లేదా దాని మిత్రపక్షం కేంద్రంలో ఓడిపోతుంది. మరోలా చూస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ లేదా దాని మిత్రపక్షం రాష్టంలో ఓడిపోతుంది.
3.1978 నుంచి పూర్తి కాలం పాలించిన ముఖ్యమంత్రులు కృష్ణ , సిద్దరామయ్య మాత్రమే.

  1. సిట్టింగ్ సీఎంలను ఓడించే సంప్రదాయం కర్ణాటకలో కొంచం ఎక్కువ. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం గుండూర్ ,1999 ఎన్నికల్లో జనతాదళ్ సీఎం జె.హెచ్ పటేల్ ,2018లో కాంగ్రెస్ సీఎం సిద్దరామయ్య ఓడిపోయారు.
    సీఎంలకు ఓటమి తప్పదు
    1972 ఎన్నికల్లో అప్పటి సీఎం వీరేంద్ర పాటిల్ కూడ ఓడిపోవలసిన వారే కానీ ఆయన పోటీచేయలేదు. ఆయన సొంత నియోజకవర్గం చిన్నగిరిలో పాటిల్ పార్టీ కాంగ్రెస్(O – ఆర్గనైజేషన్)/NCO /సిండికేట్ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయాడు. ఆ ఎన్నికల్లో ఇందిరా(Congress(R) – requisition) తో కాకుండా వీరేంద్రపాటిల్ తో ఉన్న మంత్రులందరూ ఓడిపోయారు.
    ముక్కోణపు పోటీ
    1999 ఎన్నికల్లో మాత్రం జనతాదళ్ లో చీలిక వచ్చి జెడిఎస్, జెడియుగా విడిపోవటంతో చతుర్ముఖ పోటీ జరిగింది. 2004 నుంచి కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ మధ్య ముక్కోణ పోటీ సాగుతోంది.

కర్నాటకలో చూడటానికి ముక్కోణ పోటి అనిపించినా వాస్తవంలో 150 స్థానాలలో కాంగ్రెస్ బిజెపి మధ్య , 44 స్థానాలలో కాంగ్రెస్ జెడిఎస్ మధ్య ద్విముఖ పోటి ,10 స్థానాలలో బిజెపి జెడిఎస్ మధ్య ముఖాముఖి పోటీ జరుగుతోంది. మిగిలిన 30 స్థానాలలోనే కాంగ్రెస్, బిజెపి & జెడిఎస్ మధ్య త్రిముఖపోటి నెలకొన్నది. అప్పటి నుంచి అస్థిరత
2004 ఎన్నికల నుంచి కర్ణాటకలో ఏ పార్టీ పూర్తి మెజారిటీ సాధించలేదు. కాంగ్రెస్ 1999లో 132 స్థానాలు, 2013లో 122 స్థానాలు గెలిచి సంపూర్ణ మెజారిటీ సాధించింది. సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఐదేళ్లు పూర్తిచేసిన ముఖ్య మంత్రులు ముగ్గురే
గడిచిన నాలుగు దశాబ్దాలలో అంటే 1983 నుంచి 18 మంది సీఎంలు కాగా వారిలో ఐదేళ్ల పూర్తి కాలం పదవిలో ఉన్న సీఎంలు ముగ్గురు మాత్రమే. 1999-2004 మధ్య కాంగ్రెస్ తరుపున యస్ ఎం కృష్ణ, 2013-2018 మధ్య కాంగ్రెస్ తరుపున సిద్దరామయ్య. 1983లో జనతా పార్టీ గెలిచి రామకృష్ణ హెగ్డే సీఎం అయ్యారు. 1984 లోక్ సభ ఎన్నికల్లో జనతాపార్టీ కేవలం నాలుగు ఎంపీ స్థానాలలోనే గెలవటంతో తాము ప్రజా మద్దతు కోల్పోయామని భావించి శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. 1985లో జరిగిన ఎన్నికలలో 139 సీట్లు గెలిచి తిరుగులేని ప్రజాభిమానం ఉందని నిరూపించుకున్నారు.
కాంగ్రెస్ తిరుగులేని రికార్డు
మైసూర్ రాష్ట్రం కర్ణాటకగా మారిన తరువాత జరిగిన ఎన్నికల్లో 1989లో కాంగ్రెస్ గెలిచిన 178 సీట్లు రికార్డ్. జనతాపార్టీ తరువాత జనతాదళ్ , జనతాదళ్ సెక్యులర్ (దేవెగౌడ) & జనతాదళ్ యునైటెడ్(జె.హెచ్ పటేల్) & లోక్ శక్తి (రామకృష్ణ హెగ్డే) ఇలా అనేక చీలిక పేలికల మధ్య 1994 నుంచి కర్ణాటకలో బీజేపీ బలపడుతూ వస్తోంది. 1989 ఎన్నికల్లో బీజేపీకి కేవలం నాలుగు సీట్లు రాగా 1994 లో 40 స్థానాలు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది.
కొత్త నాయకత్వం దిశగా కర్ణాటక బీజేపీ
మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ ,మాజీ ఉప ముఖ్యమంత్రి ఈశ్వరప్ప తమకు బీజేపీ టికెట్ ఇవ్వదని కలలో కూడా ఊహించి ఉండరు. ఈ లిస్టులో బళ్లారి శ్రీరాములు కూడా పడి ఉండేవాడే కానీ బోయ కులం నుంచి సమీప భవిషత్తులో కూడా ప్రత్యామ్నాయ నేత లేకపోవటంతో ఆయనకు సీట్ దక్కింది. లేదంటే శ్రీరాములు తన రాజకీయ గురువు గాలి జనార్దన్ రెడ్డి పార్టీలో చేరవల్సి వచ్చేది.

యడ్యూరప్పకు అధిష్ఠానం చెక్ పెడితే యడ్యూరప్ప సాటి కురుబ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరప్పకు చెక్ పెట్టి టికెట్ రాకుండా చేశాడు . లింగాయత్ నేతలు యడ్యూరప్పకు, జగదీష్ శెట్టర్ కు ఉమ్మడిగా బి యల్ సంతోష్ చెక్ పెట్టాడు.

ఈ ఎన్నికలు మొత్తం బి యల్ సంతోష్ కనుసన్నలలోనే జరిగాయి. ప్రధాని పర్యటనలలో కూడా యడ్యూరప్ప కానీ సీఎం బొమ్మై కానీ పెద్దగా కనిపించలేదు. ముఖ్యంగా చివరి మూడు రోజుల్లో బెంగళూర్ లో జరిగిన రోడ్ షో లో ప్రజలకు పెద్దగా తెలియని చలువరాయ స్వామి (ఎమ్మెల్సీ ), బెంగళూర్ సెంట్రల్ ఎంపీ మోహన్ మాత్రమే ఎక్కువగా కనిపించారు. మల్లేశ్వరం లో జరిగిన రోడ్ షోలో స్థానిక ఎమ్మెల్యే సీనియర్ నేత అశ్వథానారాయణ లేడు .

సీట్ల పంపకం ,ప్రచార బాధ్యతలు ఇవన్నీ గమనిస్తే బీజేపీ కొత్త నాయకత్వాన్ని తయారుచేసుకోవటానికే ప్రాధాన్యత ఇచ్చిందనిపిస్తుంది .
కాంగ్రెస్ ఎందుకు ఓడిపోతోంది…
2018లో గెలిచే ఊపులో ఉన్న కాంగ్రెస్ కలిసికట్టుగా పనిచేయకపోవటం వలనే ఓడిపోయింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెసుకు 38.14% ,బిజేపికి 36.35%,జెడిఎస్ కు 18.3% ఓట్లు వచ్చాయి కానీ సీట్ల విషయానికి వస్తే బీజేపీకి 104,కాంగ్రెస్ 80 ,జెడిఎస్ 37 స్థానాలు గెలిచాయి. అంటే బీజేపీ కన్నా 1. 79% శాతం ఎక్కువ ఓట్లు వచ్చిన కాంగ్రెసుకు బీజేపీ తో పోల్చుకుంటే 24 సీట్లు తక్కువ వచ్చాయి.
పై లెక్కలను అర్థం చేసుకున్నారో లేక డీకే శివకుమార్ మీద జరిగిన లెక్కలేనన్ని ఐటీ మరియు ఈడీ దాడులకు సమాధానం చెప్పాలనుకున్నారో కానీ సిద్దరామయ్య, డికే శివకుమార్ ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే కలిసికట్టుగా పనిచేశారు. కర్ణాటకకు చెందిన ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే కూడా మంచి సమన్వయం చేశారు.

2018 ఎన్నికల్లో ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో కాంగ్రెస్ జెడిఎస్ పోటాపోటీగా ఉన్న కొన్ని స్థానాలలో బిజెపి బలహీనమైన అభ్యర్థులను పెట్టటం లేదా తమ ఓట్ బ్యాంకును జెడిఎస్ కు మళ్లించింది. కిత్తూర్ కర్ణాటక ప్రాంతంలో కూడా ఇదే ఎత్తుగడతో కాంగ్రెస్ సీట్లకు గండి కొట్టింది.
జెడిఎస్ కోసం కుమార స్వామి పోరు
దేవెగౌడ వారసుడిగా కుమారస్వామి జేడీఎస్ ను రాజకీయంగా బతికించటానికి గత రెండు ఎన్నికల నుంచి పోరాడుతున్నారు. జేడీఎస్ కు గత ఎన్నికల్లో 37 సీట్లు రాగా ఈసారి అది 20-25 మధ్యన ఉంటుందని అంచనా. కాంగ్రెస్, బీజేపీలతో డబ్బు విషయంలో పోటీ పడలేకపోయామని పోలింగ్ జరుగుతుండగానే కుమారస్వామి చెప్పటం జేడీఎస్ కు కొంత నష్టం చేసింది. ఈ ఎన్నికల్లో హంగ్ అంటే సాధారణ మెజారిటీ 113కు దగ్గర దగ్గరగా ఆంటే 108 స్థానాలు లేదా పూర్తి మెజారిటీ సాధిస్తే రాబోయే ఎన్నికల నాటికి జేడీఎస్ మీద మీడియా విశ్లేషణ కూడా చేయకపోవచ్చు. దేవెగౌడ కుటుంబంలో చీలిక వచ్చి పెద్ద కుమారుడు కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరవచ్చు.

ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఓటరుకు వ్యక్తిగతంగా లబ్ది చేకూర్చే వాగ్దానాలు, రాష్ట్ర స్థాయి అంశాల మీద హామీలు ఇచ్చారు. అందరికన్నా ముందు కుమారస్వామి “పంచరత్న” పేరుతో 2022 నవంబర్ నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర కర్ణాటకలో ప్రవేశించిన అక్టోబరు 2022 నుంచి కాంగ్రెస్ ప్రచారం మొదలైనట్లు భావించాలి.
ఈ ఎన్నికల్లో ప్రభావం చూపిన అంశాలు
జెడిఎస్ హామీలలో రైతు కూలి కుటుంబాలకు రెండు వేల రూపాయలు, గర్భిణులకు ఆరు నెలల పాటు ఆరువేల రూపాయలు, సంవత్సరానికి ఐదు సిలిండర్లు ప్రధానమైనవి.

అధికారంలో ఉండటంతో ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పుకోవటంలోనే బిజెపి సమయం ఎక్కువ గడిచిపోయింది. అవినీతి అతిపెద్ద ఎన్నికల అంశం అయ్యింది. 40% సీఎం అని కాంగ్రెస్ దాదాపు సంవత్సరం కిందట మొదలు పెట్టిన ప్రచారానికి బిజెపి వద్ద సమాధానం కనపడలేదు.

2021 జూలైలో కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్స్ అసోసియేషన్ చైర్మన్ డి.కెంపన్న బిల్లుల చెల్లింపునకు 40% కమీషన్ అడుగుతున్నారని ప్రధాని మోడీకి ఉత్తరం రాయటంతో మొదలైన 40% సీఎం ప్రచారాన్ని పోలింగ్ రోజు వరకు కాంగ్రెస్ సజీవంగా ఉంచింది.
పే సీఎం పేరుతో రాష్ట్రం మొత్తం వాల్ పోస్టర్లు వేశారు.
వాస్తవానికి దీనికి పునాది 2018లో ప్రధాని మోడీనే వేశారు. ఆ ఎన్నికల ప్రచారంలో అప్పటి సీఎం సిద్దరామయ్యను సిద్ద “రూపాయ” అని 10% కమీషన్ సీఎం అని మోడీ ఆరోపించారు. అది 2023కు 40% కమీషన్ సీఎం అయ్యింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం లకు ఇచ్చిన 4% రిజర్వేషన్ రద్దు చేస్తామని బిజెపి చెప్పింది. ఆ నాలుగు శాతం లో లింగాయత్ , వక్కలిగలకు ఇవ్వాలని బిజెపి నేతలు డిమాండ్ చేశారు.

లింగాయత్ లలోని పంచాశాలి లింగాయత్ లు రిజర్వేషన్ కోసం చేసిన పోరాటం కూడా బిజెపి కి కొంత నష్టం. మహారాష్ట్రతో బెళగావి సరిహద్దు వివాదం, గోవాలో కలాస -బందూరి నీటి ప్రాజెక్ట్ వివాదం కూడా బీజేపీకి నష్టమే.
వీటన్నిటిని మించి నిరుద్యోగ సమస్య, రాష్ట్ర స్థాయిలో యడ్యూరప్ప తరువాత గట్టి నాయకుడు లేకపోవటం బీజేపీ ఎదుర్కొనే అతి పెద్ద సమస్యలు.
కాంగ్రెస్ లో అందరం కలిసికట్టుగా ఉన్నామన్న సంకేతాలు వర్గాల గొడవలు లేకపోవటం వారి తొలి విజయం. సిద్దరామయ్య రూపంలో అనుభవం ఉన్న ప్రజానేత నేత ,డికే శివ కుమార్ రూపంలో పోరాడగల నేత, మరియు ఎన్నికల ఖర్చు పెట్టుకోగల నేత ఉండటం, దళితుడైన మల్లిఖార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉండటం కలిసివచ్చింది.
2018 ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గేను సీఎంగా ప్రకటిస్తారా అని అడిగిన మోడీ ఈ ఎన్నికల ప్రచారంలో ఆ ఊసు ఎత్తలేదు.
నందిని వర్సెస్ అమూల్ పాల సమస్య ,ఉద్యోగ అవకాశాల మీద వాగ్ధానం కాంగ్రెస్ కు ప్లస్.
సిద్దరామయ్య AIHINDA , కురుబ, ముస్లిం ఓట్లలో కన్సాలిడేషన్ ,లింగాయత్, వక్కలిగలలో మంచి శాతం ఓట్లు ఆకర్షించటం తదితర కారణాల వలెనే ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. 1999 లో వక్కలిగ నేత యస్ ఎం కృష్ణ నేతృత్వంలో కాంగ్రెస్ గెలిచి కృష్ణ సీఎం అయినట్లే ఇప్పుడు అదే వక్కలిగ నేత డికే శివకుమార్ సీఎం అవుతాడన్న అంచనాతో వక్కలిగల ఓట్లు బాగానే కాంగ్రెస్ కు అంది ఉండొచ్చు. ఇది జెడిఎస్ కు నష్టం చేస్తుంది.
సాంప్రదాయక బీజేపీ మద్దతు దారులైన లింగాయత్ ఓట్లు యడ్యూరప్ప రూపంలో ఈసారి బిజెపి కోల్పోతుంది కానీ గతం కంటే వక్కలిగ ఓట్లు ఎక్కువ సాధిస్తుంది.
జెడిఎస్ హామీలలో రైతు కూలి కుటుంబాలకు రెండు వేల రూపాయలు, గర్భిణి స్త్రీలకు ఆరు నెలల పాటు ఆరువేల రూపాయలు, సంవత్సరానికి ఐదు సిలిండర్లు ముఖ్యమైనవి. కానీ కుటుంబ విబేధాలు తీవ్రమైన ప్రభావం చూపుతాయి. తమకు సాంప్రదాయ మద్దతుదారులైన వక్కలిగల ఓట్లు ఈసారి కాంగ్రెస్, బిజెపి రెండు పార్టీలు చీలుచుకోవటంతో జెడిఎస్ నస్టపోతుంది.
గాలి జనార్దన్ రెడ్డి పారి KRPP అద్భుతాలు సృష్టించే అవకాశం లేదు. ఒకటి లేదా రెండు సీట్లు గెలిచే అవకాశం ఉంది. కల్యాణ కర్ణాటకలో KRPP వలన ఐదు ఆరు స్థానాలలో బీజేపీకి నష్టం జరగచ్చు.
ముగింపు
ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లు కాంగ్రెస్ గెలిస్తే అది బొమ్మై అవినీతి, అసమర్ధత ఓటమి. సిద్దరామయ్య ,డికెల నాయకత్వ సమర్ధత. కాంగ్రెస్ సోషల్ మీడియా .
బిజెపి గెలిస్తే మోడీ ప్రచారం , బి యల్ సంతోష్ ప్రణళిక కారణాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Who will be triumphing in MAHA elections?

Is it Mahayuti or Maha Vikas Aghadi? Among all parties...

Trump and India: Great expectations

(Dr Pentapati Pullarao) Donald Trump’s election has created great expectations...

Prof.Purushottam Reddy: Renowned Academician

Environmentalist and Developmental Activist  (Prof Shankar Chatterjee)     ...

We are here to help our country: Trump

This is a moment never seen before We are here...