కోడిపందాలు జూదరులకు పండగ
ఇంటి వారికి మనసంతా బెంగ
(సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి)
సంక్రాంతికి కోడి పందాలు సహజం. పల్నాటి యుద్ధం నాటి నుంచి కోడి పందాలను చూస్తూనే ఉన్నాం. సరదాగా జూదమాడి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు ధర్మరాజు. 14 ఏళ్ళ అటవీ వాసం తప్ప లేదు. నేటి జూదరులకు కోడి పందాలు ఒక ఆనందం క్షణాలుగా తయారయ్యాయి. అవి అలాగే మిగిలి ఉంటే పరవాలేదు. కొందరికే ఆ ఆనందం మిగులుతుంది. ఎక్కువమంది డబ్బులు పోగొట్టుకుని కుమిలిపోతారు. కుమిలిపోవడం కాదు. ఆస్తులు హారతి కర్పూరం చేసుకుంటారు. ఇంతకూ కోడి పందాలు ఆడేవారికి అంత డబ్బెలా వస్తుంది? ఉన్న వారికి సరే సరదా అనుకోవచ్చు. కష్టపడి పనిచేస్తే తప్ప నాలుగు వేళ్ళూ నోట్లోకి వెళ్ళని వారు సైతం పందాలకు సై అంటారు. గెలుపు ఆశే కావచ్చు. గెలిస్తే కాసుల వర్షం. లేకపోతే నష్టాల కూపంలోకి కూరుకుపోతారు. ఇంతకీ వీరందరికీ డబ్బులెవరిస్తారు.
ఎక్కడెక్కడి నుంచో కోడి పందాలు కాయడానికి గోదావరి జిల్లాలకు వస్తుంటారు. దగ్గరున్న డబ్బు అయిపోగానే అప్పిచ్చేవారికోసం అటూ ఇటూ చూస్తారు. వారి ఆశకు తగ్గట్టుగానే క్యాష్ బ్యాగ్ తగిలించుకున్న వడ్డీ వ్యాపారులు కనిపిస్తారు. వెంటనే తమకు కావలసిన మొత్తాన్ని అడుగుతారు. ఇచ్చే మొత్తాన్ని బట్టి పత్రాలు రాయించుకునే తీరు ఉంటుంది. అవి కూడా ఆ బ్యాగులోనే ఉంటాయండోయ్. కమిషన్ ఆధారంగా సాధారణంగా అప్పటికప్పుడు రుణాలిస్తారు. ఒకే సారి 25 లక్షల వరకూ కూడా నగదు అప్పుగా ఇస్తారు.
ఇలాంటి సందర్భాలలో పక్కాగా పత్రాలు రాయించుకుంటారు. ఇళ్ళు, పొలాలను తమ పేరుమీద పెట్టించుకుని సంతకాలు చేయించుకుంటారు. అప్పు తీసుకున్న వ్యక్తి గెలిచాడా అదృష్టం లేకుంటే అంతే సంగతులు. ఆత్మహత్యలకు పాల్పడిన వారూ ఉన్నారు. కుటుంబాలకు కుటుంబాలు ఇలా సర్వనాశనమైన సందర్భాలూ ఉన్నాయి. ఇక్కడ విచిత్రమేమిటంటే పందాలు నిర్వహించే ప్రాంతీయులు వాటిని చూసి ఆనందిస్తారు తప్ప, పందేల జోలికి వెళ్ళరు. గోదావరి జిల్లాల్లో ఇదో విశేషం.
తమిళనాడులో జల్లికట్లు ఎలాగో.. కోడి పందాలు గోదావరి జిల్లాల్లో సంప్రదాయం. ప్రభల ఊరేగింపు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. దురదృష్టవశాత్తు కోడిపందాలు మాత్రమే జూదంతో ముడిపడిఉన్నాయి. హైకోర్టుల ఉత్తర్వులను సైతం బేఖాతరు చేసి ఆడతారు. రాజకీయ నేతలు, ప్రముఖులు, సెలబ్రిటీలు సైతం వీటిలో పాల్గొంటారు.