విజ్ఞత చూపండి … సుదర్శన రెడ్డిని గెలిపించండి

0
178

ఆయన గెలుపు చారిత్రక అవసరం
రాజకీయ పార్టీలకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై హర్షం
హైదరాబాద్, ఆగష్టు 19 :
ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించడం తెలుగు ప్రజల, తెలంగాణ ప్రజల గౌరవాన్ని పెంచిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఓటు చోరీకి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఎన్డీఏ కూటమి ఒకవైపు.. మహాత్ముడి స్ఫూర్తితో రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు పోరాడుతున్న ఇండియా కూటమి మరోవైపు… నిలిచాయని చెప్పారు.

వ్యవసాయ కుటుంబంలో జన్మించిన తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం గర్వకారణమన్నారు. ఆయన్ను గెలిపించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు రేవంత్.

పీవీ నర్సింహారావు తరువాత ఒక తెలుగువాడిని ఆ స్థాయిలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ముదావహమని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా మనం ఏకం కావాల్సిన సందర్భం వచ్చిందని రేవంత్ పిలుపునిచ్చారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన రెడ్డిని ఇండియా కూటమి తెలుగువారందరికీ గొప్ప విషయమన్నారు. ఆయనను గెలిపించాలని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు.

సుదర్శన రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఆయన చంద్రబాబు నాయుడు, కెసీఆర్, పవన్ కళ్యాణ్, కమ్యూనిస్ట్ సోదరులు, ఉభయ రాష్ట్రాల బీజేపీ ఎంపీలను కోరారు. ఆయనను గెలిపించడం ఇప్పుడు చారిత్రిక అవసరమని అభిప్రాయపడ్డారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రతిపాదించింది కాంగ్రెస్ పార్టీ కాదనీ ఇండియా కూటమి ప్రతిపాదించిందనీ, ఆయన న్యాయనిపుణుడనీ వివరించారు. ఆయనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఆయన ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ అని చెప్పారు. 1991 లో పీవీ నరసింహారావు నంద్యాల ఎంపీగా పోటీ చేసినపుడు.. ఆనాడు ఎన్టీఆర్ ఆయనపై పోటీ పెట్టకుండా మద్దతు పలికిన విషయాన్ని రేవంత్ గుర్తుచేశారు. ఆ రకంగా ఎన్టీఆర్ రాజకీయ విజ్ఞతను ప్రదర్శించారని చెప్పారు. ఒక తెలుగువాడు ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు విజ్ఞత ప్రదర్శించాలని రేవంత్ రెడ్డి కోరారు. మనమంతా ఏకమై ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here