పద్మశ్రీ పురస్కరాల ప్రకటన: సీఎం రేవంత్ అభినందనలు
హైదరాబాద్: పద్మ భూషణ్, పద్మ శ్రీ పురస్కారాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎంపికైన వారికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు నోరి దత్తాత్రేయుడు పద్మ భూషణ్, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం నుంచి గడ్డమణుగు చంద్రమౌళి, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్, కుమారస్వామి తంగరాజ్, వైద్య రంగంలో గూడూరు వెంకట్ రావు, పాల్కొండ విజయానంద్ రెడ్డి, పశుసంవర్థక రంగంలో మామిడి రామా రెడ్డి, విద్యా-సాహిత్య రంగాల నుంచి మామిడాల జగదీశ్ కుమార్, వెంపటి శశి శేఖర్, వెంపటి కుటుంబ శాస్త్రి, కళా రంగం నుంచి దీపికా రెడ్డి, మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, దివంగత గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ లకు పద్మ శ్రీ పురస్కారాలు దక్కడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. సేవా, కళా, ఇతర రంగాల్లో వారు చూపిన అంకితభావం, సేవలతోనే ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపికయ్యారని సీఎం పేర్కొన్నారు.
సన్మానించనున్న సీఎం
పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఘనంగా సన్మానించనున్నారు. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు నోరి దత్తాత్రేయుడుకు పద్మ భూషణ్‌తో పాటు విభిన్న రంగాల్లో సేవలందించిన వారికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన విషయం విదితమే. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పర్యటన ముగించుకొని రాష్ట్రానికి వచ్చిన తర్వాత పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిని ఘనంగా సన్మానించనున్నారు. గతంలో పద్మ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ప్రముఖ నటుడు చిరంజీవితో పాటు ఇతరులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో శిల్పకళా వేదికలో ఘనంగా సన్మానించారు. అదే మాదిరి ఈ ఏడాది కూడా పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిని సన్మానించనున్నారు.

