కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం
ధాన్యంపై 24 గంటల డెడ్‌లైన్
దమ్ముంటే నన్ను జైలుకు పంపండి
బీజేపీని రైతులు రద్దె దించుతారు
ఢిల్లీ కేంద్రంగా కేసీఆర్ రణభేరి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు బీజేపీపై రణభేరి మోగించారు. ధాన్యం కొనుగోలుపై 24 గంటల్లో తేల్చాలని డెడ్‌లైన్ విధించారు. రైతు సమస్యలపై తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టంచేశారు. ధాన్యం కొనుగోలు అంశంపై ఆయన తన క్యాబినెట్‌తో న్యూఢిల్లీలో సోమవారం ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో బీకేఎస్ నేత రాకేశ్ తికాయత్ కూడా పాల్గొన్నారు. ఎన్నికలు వస్తేనే మోడీకి రైతులు గుర్తుకు వస్తారని విమర్శించారు. ఇప్పుడు చెబుతున్నా… రైతులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వమూ మనజాలనదని హెచ్చరించారు. తమ మంత్రులు, ఎంపీలతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సక్రమంగా లేదన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే సీబీఐ, ఇడి, ఇన్‌కంటాక్స్ విభాగాలను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. మోడీ, గోయల్‌కు దణ్ణం పెట్టి అడుగుతున్నాం.. తెలంగాణలో ఉన్న ధాన్యం మొత్తాన్ని కొనాలని విజ్ఞప్తి చేశారు. 24 గంటల్లో ఆ పనిచేయకపోతే రైతు ఉద్యమంతో ఢిల్లీలో భూకంపం సృష్టిస్తామని హెచ్చరించారు. రైతులకు 24 గంటలూ కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కేసీఆర్ అన్నారు. మిషన్ కాకతీయతో రాష్ట్రంలో 40వేల చెరువులను పునరుద్ధరించిన సంగతిని ఆయన గుర్తుచేశారు. కొత్త వ్యవసాయ పాలసీని తీసుకురావాలని కేసీఆర్ కోరారు. తెలంగాణ రైతులు ఏం పాపం చేశారని ఆయన ప్రశ్నించారు.
రైతు ఉద్యమంతో ఢిల్లీలో భూకంపం సృష్టిస్తాం: కేసీఆర్
Date: