కృష్ణ నివాసానికి కేసీఆర్
పార్థివ దేహానికి నివాళులు
ప్రగాఢ సంతాపాన్ని తెలిపిన సీఎం
మహేష్ బాబు, నరేష్‌లకు పరామర్శ
హైదరాబాద్, నవంబర్ 15: సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. నానక్‌రామ్‌గుడాలోని కృష్ణ నివాసానికి వెళ్ళిన కేసీఆర్ మహేష్‌బాబు, నమ్రత, నరేష్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. కృష్ణ ఆత్మకు సద్గతులు కలగాలని ప్రార్థించారు.
తొలుత కృష్ణ మరణా వార్త వినగానే… సంతాప సందేశాన్ని విడుదల చేశారు. ప్రముఖ చలన చిత్ర నటుడు, నిర్మాత..అభిమానులు సూపర్ స్టార్ గా పిలుచుకునే సినీ హీరో కృష్ణ (ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి, 79 ) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు.
నటుడు గా, నిర్మాతగా, దర్శకుడుగా, నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాలపాటు కృష్ణ అందించిన సేవలను సీఎం స్మరించుకున్నారు.
350 పైగా సినిమాల్లో నటించి, సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని సీఎం అన్నారు.
విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు, ప్రజలకు సామాజిక స్పృహ కల్పించే సాంఘీక చిత్రాల నటుడు గా కృష్ణ జనాదరణ పొందారని అన్నారు.
నాటి కార్మిక కర్షక లోకం కృష్ణను తమ అభిమాన హీరో గా, సూపర్ స్టార్ గా సొంతం చేసుకున్నారని సీఎం గుర్తు చేసుకున్నారు.
సొంత నిర్మాణ సంస్థను స్థాపించి, సినిమా నిర్మాణ రంగంలో నూతన ఒరవడులను ప్రవేశ పెట్టిన ఘనత కృష్ణ దేనన్నారు.
కృష్ణ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కృష్ణ పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను సీఎం ఆదేశించారు.
అరమరికలు లేని ముక్కుసూటి వ్యక్తిత్వం
సినీ నటుడు కృష్ణ మరణం తెలుగు సినీరంగానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. చలన చిత్ర రంగంలో సుప్రసిద్ద నటుడు కృష్ణ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమన్నారు. వ్యక్తిగతంగా తాను గొప్ప మిత్రుడిని కోల్పోయానని, ఈ ఇంటికి వారి ఆతిథ్యం మేరకు చాలాసార్లు వచ్చానని సీఎం చెప్పారు. విజయనిర్మల పరమపదించిన సందర్భంలో కూడా తాను వచ్చానన్నారు. కృష్ణ ముక్కుసూటిగా, అరమరికలు లేకుండా మాట్లాడే మనిషి అనీ, విలక్షణమైన నటుడిగా. పార్లమెంట్ సభ్యుడిగా దేశానికి సేవ కూడా చేశారని సీఎం కొనియాడారు.
తాను ఓసారి అల్లూరి సీతారామరాజు సినిమా చాలా బావుంది అని కృష్ణ గారితో అన్నప్పుడు ఆయన నవ్వుతూ.. కేసీఆర్ గారూ మీరు సినిమాలు కూడా చూస్తారా? అన్నారని…
అల్లూరి సీతారామరాజు సినిమాను తాను చాలాసార్లు చూశానని, కృష్ణ గారికి చెప్పానని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
అల్లూరి సీతారామరాజు లాంటి దేశభక్తిని ఉద్భోదించే, స్వతంత్ర పోరాటాన్ని తెలియజెప్పే గొప్ప సందేశాత్మక చిత్రం నిర్మించిన సీనియర్ నటుడుగా, దేశభక్తిని పెంపొందింపజేసే వారి ప్రయత్నాన్ని గుర్తిస్తూ, తెలంగాణ ప్రభుత్వం తరఫున అధికార లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశామని సీఎం అన్నారు.
తాను ఒక మంచి మిత్రుడిని కోల్పోయానని, కృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు. కృష్ణ గారి కుటుంబానికి కూడా ఈ దుఃఖాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నానని సీఎం కేసీఆర్ అన్నారు.