గోదావరి వరదలు, వర్షాలపై అధికారులకు ఆదేశం
అమరావతి, జులై 27 : గోదావరిలో వరద పెరుగుతుండడంతో అన్నిరకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్.జగన్ అధికారులను ఆదేశించారు. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షం సహా ఉప నదులు పొంగి ప్రవహిస్తుండడంతో గోదావరి నదీతీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ ముంపు బాధితులకు బాసటగా నిలవాలని సీఎం ఆదేశించారు. ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల్లో పరిస్థితులను సీఎంఓ అధికారులు వివరించారు. 42 మండలాల్లో, 458 గ్రామాలు అప్రమత్తంగా ఉన్నాయని. సహాయచర్యల్లో 3 NDRF, 4SDRF బృందాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. భారీవర్షాలు కురుస్తున్న ఇతర ప్రాంతాల్లోని వివరాలనుకూడా సీఎంకు వెల్లడించారు. గోదావరి నదికి ఆనుకునిఉన్న జిల్లాల్లో ఇప్పటికే కంట్రోల్ రూమ్స్ పనిచేస్తున్నాయని, ముంపునకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో బోట్లు సహా సహాయక సిబ్బందిని సిద్ధంచేశామని సీఎంకు చెప్పారు. ఏలూరు జిల్లా కుకునూరు, వేలేరుపాడు సహా ఇతర మండలాల్లో ఇప్పటికే సహాయక శిబిరాలను తెరిచామని చెప్పారు. ముంపు ప్రాంత ప్రజలను సహాయక శిబిరాలకు తరలించామని, మందులు సహా ఇతరత్రా అత్యవసర వస్తువులను సిద్ధంగా ఉంచామని తెలిపారు. కోనసీమ జిల్లాలో 150 బోట్లను రెడీ ఉంచామని సీఎంకు వివరించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని మూడు మండలాల్లో ముంపునకు ఆస్కారం గ్రామాల్లో అన్నిరకాలుగా సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు.
సహాయక శిబిరాల్లో ఎలాంటి కొరతా లేకుండా చూసుకోవాలని, తాగునీరు సహా ఇతరత్రా సదుపాయాలు విషయంలో ఎక్కడా లోటు రాకూడదని సీఎం ష్టంచేశారు. సహాయక చర్యల విషయంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని, వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని, ఆమేరకు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టంచేశారు. వరదప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు కోసం సీఎం ఆదేశాల మేరకు ముందస్తుగా ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదలచేశామని అధికారులు చెప్పారు.
అప్రమత్తంగా ఉండండి : జగన్
Date: