ప్రపంచ యుద్ధాల నుంచి సాంకేతిక సమరం వరకూ..
చైనా ప్రవేశంతో మారిపోయిన సీన్
(బుక్కపట్నం వెంకట ఫణికుమార్)
ప్రపంచ యుద్ధం దరిమిల అనేక దేశాలు తీవ్ర సంక్షోభాన్నిచవిచూశాయి. యుద్ధంలో పాల్గొన్న దేశాలన్నింటిలోనూ అభివృద్ధి కుంటుపడి పౌరులకు నాలుగు వేళ్లు నోటికి వెళ్లని దుస్థితి. మొదటి ప్రపంచ యుద్ధం దాదాపు 3 సంవత్సరాల 8 నెలలు సాగింది. అందుకు సాక్ష్యంగా రక్తపు మరకలు ఓ దశాబ్ధం పాటు మిగిలిపోయాయి. క్రమంగా అవి తెరమరుగయినా యుద్ధం ప్రభావం మాత్రం శతాబ్ధం వరకు నిలిచింది.
ఈ చేదు అనుభవం నుంచి బయట పడే క్రమంలో మళ్లీ 2 వ ప్రపంచ యుద్ధం తరుముకు వచ్చింది. 1939 సెప్టెంబర్ నుంచి 1945 వరకు ప్రపంచం మొత్తం కలాన్ని ఎర్రసిరాతో నింపినట్లు భూమి మొత్తం రక్తంతోనూ, శవాల దిబ్బలతోనూ నిండిపోయింది. ఏదో పక్షాన ప్రతి దేశం చేరాల్సిన పరిస్థితి. 6 సంవత్సరాలు భీకరంగా జరిగిన పోరాటాలలో కోట్లమంది మృత్యువాత పడ్డారు. లక్షల మంది క్షతగాత్రులయ్యారు. చిన్న పెద్ద తేడా లేకుండా దివ్యాంగులయ్యారు. ఇది ప్రత్యక్ష యుద్ధాల కారణంగా జరిగే నష్టం. ఇది చరిత్ర.
తీరు మారిన యుద్ధాలు
సాంకేతికంగా అన్ని దేశాల కంటే ముందుండే జపాన్ మళ్లీ రాళ్ల రాపిడితో నిప్పు రాజేసే స్థాయికి పడిపోయిందని చెప్పుకోవచ్చు. ఇది ప్రపంచ యుద్ధాల కారణంగా ఒనగూరే ప్రయోజనం. ఇప్పుడు రక్తపాతం లేదు. నేరుగా ఒకరిని ఒకరు చంపుకోవడం లేదు. అంతా సాంకేతికపరమైన పోరాటమే.
శత్రుదేశం ఆర్థిక మూలాలను దెబ్బకొడుతూ, అనిశ్చితిని సృష్టించడం, పౌరులలో అసంతప్తి రగిలించి శత్రు దేశాలకు అనుకూలంగా మార్చడంలో సాఫల్యత సాధించడం నేటి యుద్ధ నైపుణ్యం. మోలుగా కాకుండా మెదడుతో శత్రుదేశాన్ని నిర్జీవంగా మిగల్చడం సాంకేతికత.
వీటిలో రాటుదేలిన దేశంగా చైనాను చెప్పుకోవచ్చు. డ్రాగన్ వినయం నటిస్తూ నేర్పరితనంతో భారత్ చుట్టూ గోతులు తీయడం తన నైజం. విశ్వాస ఘాతుకానికి పాల్పడడం చైనా పెట్టుబడి. సైనికుల మధ్య జరగాల్సిన యుద్ధం ఇప్పుడు దేశ పౌరులపైకి మళ్లింది. బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేయడం వారి ఖాతాను ఖాళీ చేయడం తరహా అనైతిక చర్యలకు పాల్పడటంలో చైనా నిపుణతను వెయ్యినోళ్ల పొగడాల్పిందే, ప్రపంచ వ్యాప్తంగా స్నేహశీలి దేశంగా చెప్పకునే భారత్‌ను చైనా మాత్రం ఎప్పుడు వంచించడమే.
భారతదేశానికి ప్రధాన శత్రుదేశాలుగా ప్రపంచం అంతా చెప్పుకునే చైనా వింతపోకడలకు నిలువుటద్దం.
చైనా ఉత్పత్తులు భారతదేశంలోకి అక్రమంగా చొచ్చుకురావడం దేశ ఆర్థిక స్థితికి శరాఘాతంగా పరిణమించింది. చైనా పౌరులపై మనం చూపిన సానుభూతి మనకే చేదు అనుభూతిగా మారిపోయింది. గుండు సూది నుంచి అన్నిరకాల గృహోపకరణాలు, ఆట బొమ్మలు ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ పరికరాలు భారతదేశంలోకి విచ్ఛల విడిగా ఎగుమతి చేసింది.
ఈ ఉత్పాతంతో భారతదేశంలోని అన్ని పరిశ్రమలు అవసాన దశకు చేరుకున్నాయని చెప్పవచ్చు. దీనిని బట్టి దేశంలోని ఆర్థిక వ్యవస్థను చైనా ఉత్పత్తులు ఎంత ప్రభావం చూపాయో అర్ధం అవుతున్నది.
చైనా ఉత్పత్తుల పై రాజ్యసభా సంఘం నివేదిక
దేశంలోకి చొచ్చుకు వచ్చిన చైనా ఉత్పత్తుల కారణంగా దేశంలోని చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు దివాళా తీసే స్థియిలో కొట్టుమిట్టాడుతున్నాయని రాజ్యసభా సంఘం తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. 2018 లో సభాసంఘం దేశవ్యాప్తంగా అధ్యయనం చేసింది. ఆ మేరకు కొన్ని కఠోర సత్యాలను బయటపెట్టింది. దేశంలోని ఆర్థిక వ్యవస్థపై చైనా వస్తువులు సుమారుగా 40 శాతం వరకు ప్రభావితం చూపిందని దేశ పురోగతికి ఇది తీవ్ర అవరోధంగా తన ఆవేదన వ్యక్తం చేసింది.
పరిశ్రమలు మూత పడడం వల్ల నిరుద్యోగ సమస్యలు అధికమయినట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది. ద్వైపాక్షిక ఒప్పందాన్ని చైనా దారితప్పించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. చాప కింద నీరులా దేశాన్ని మొత్తం చైనా ఉత్పత్తులు మార్కెట్లను ఆక్రమించాయని తీవ్ర ఆక్షేపణ తెలిపింది. దేశ నిర్మాణాత్మకతకు ఇది గొడ్డలిపెట్టుగా అభివర్ణించింది. అనుమతించిన ఉత్పత్తులే కాకుండా చైనా తన దేశంలోని అన్ని ఉత్పత్తులను మనపై రుద్దిందని పేర్కొంది.
లెక్కల్లోకి రాని దిగుమతులు
సూదిమొన ప్రవేశ అనుమతి దొరికితే చాలు పందికొక్కు గాదె అంతా ఖాళీ చేసినట్లు చైనా తనకు అందివచ్చిన అవకాశాన్ని వదులుకోలేదు. ఇష్టారాజ్యంగా, ఇబ్బడిముబ్బడిగా ఉత్పత్తులను దేశంలోకి చేరవేసింది. స్థూలంగా చెప్పుకోవాలంటే చైనా తమ పరికరాలను అనేక దేశాలకు విరివిగా ఎగుమతి చేసేందుకు వీలుగా పరిమితికి మించిన ఉత్పత్తి చేసింది.
టోకు ధర తగ్గిపోవడం వల్ల మిగతా దేశాలకంటే తక్కువ ధరకు వస్తువులను సరఫరా చేయడం ప్రత్యేక ఆకర్షణగా మిగిలిపోయింది. ఈ ఆకర్షణే దేశీయ విఫణిని దారుణంగా దెబ్బతీసిందని చెప్పవచ్చు.
అంతెందుకు ప్రభుత్వరంగ సంప్థలెన్నో చైనా ఉత్పత్తుల ధరకు పోటీగా నిలువలేక చేతులెత్తేశాయి. ప్రభుత్వ ఉన్నతాధికారులు అనధికారికంగా వెల్లడించిన సమాచారం మేరకు ప్రజలకు అందించాల్సిన సేవలను ఎలా అందించినా పర్వాలేదు. చవకగా ప్రభుత్వంపై భారం తగ్గితే చాలనే అభిప్రాయం వ్యక్తం చేసే స్థాయికి చైనా ఉత్పత్తులు దేశాన్ని అతలాకుతలం చేశాయి.
భారత ప్రయత్నం వమ్ము
ప్రపంచ దేశాల మధ్య స్నేహభావం వెల్లివిరియాలని భారత్ చేసిన ప్రయత్నాన్ని దుర్వినియోగం చేసిందని ప్రపంచ దేశాలన్నీ కోడై కూసినా భారత్ మాత్రం మౌనంగా చేష్టలుడిగి చూస్తూ వుండిపోయింది. చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉంటంకించింది. ఆ ఉదాసీనత డ్రాగన్ ఆర్థిక పరిపుష్టికి తోడ్పడింది. 2007లో చైనా తమ ఉత్పత్తులను భారత్‌కు 38 బిలియన్ అమెరికా డాలర్లు విలువ కలిగిన వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించాయి.
అవి తర్వాత కాలంలో 2018 కి 89.6 బిలియన్ అమెరికన్ డాలర్లకు ఎగబాకింది. ఇవి అధికారిక గణాంకాలు మాత్రమే. డ్రాగన్ తన ఉత్పత్తులను అనేకం అంచనాలకు అందకుండా దేశంలోకి ప్రవేశపెట్టింది. సైకిళ్లు, బేటరీ ద్విచక్ర వాహనాల విడిభాగాలపే దొంగచాటుగా ఇండియాకు పంపింది. భారతదేశం లోకి క్రమంగా బహిరంగ విఫణిలోకి చొచ్చుకువచ్చింది. ఆంగ్లేయుల పాలన తర్వాత ప్రారంభం అయిన పరిశ్రమలు కనుమరుగయేందుకు చైనా ప్రధాన భూమిక పోషించింది. చైనా దుర్భుద్ధితెలిసిన ఏ దేశం కూడా ఆ దేశపు ఉత్పత్తులను తమ దేశంలోకి అనుమతించదు. తమ దేశ ప్రమాణాలకు అనుగుణంగా ఆ ఉత్పత్తులు లేవనే నెపంతో వాణిజ్య వ్యవహారలకు దూరంగా పెట్టాయి. (తరువాయి త్వరలో)