కోవింద్ నేతృత్వంలో కమిటీ
ఒక దేశం – ఒక ఎన్నికపై అధ్యయనం
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)
రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. మాజీ రాష్ట్రపతి ఆధ్వర్యంలో కమిటీ అంటే పెద్ద విశేషమే ఉంటుంది. కాదు ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అంశాన్ని అధ్యనం చేయడానికి ఈ కమిటీ ఏర్పాటయింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఈ కమిటీ అధ్యనం చేస్తుంది. ఒక పక్కన ఈ నెల్ 18 నుంచి 22 వరకూ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం, తదుపరి ఈ కమిటీ ఏర్పాటు కావడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. యూనిఫార్మ్ సివిల్ కోడ్ కూడా కేంద్రం పరిశీలనలో ఉండడం కూడా దీనికి తోడవుతోంది. ప్రత్యేక సమావేశాలను ఎందుకు ఏర్పాటు చేస్తోంది తెలియక విపక్షాలు తలలు పట్టుకుంటున్నాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి ఉంది. మే-జూన్ నెలల్లో జాతీయ ఎన్నికలు జరుగుతాయి. ఈ క్రమంలో కోవింద్ కమిటీ ఏర్పాటు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో గడిచిన ఐదేళ్లల్లో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించే అవకాశముంది. ఇదే సమయంలో పార్లమెంటుకు తక్షణం ఎన్నికలు నిర్వహించడానికి ఉద్యుక్తులయ్యే అవకాశమూ లేకపోలేదు. అంటే కేంద్రంలో ముందస్తు ఎన్నికలకు సన్నద్ధమవడమే. దీనితో పాటు మరిన్ని రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహిచేందుకూ కసరత్తు చేసే వీలుంది. మరొక విశేషం ఏమిటంటే… కీలక నిర్ణయాలను తీసుకోవడానికి ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలు విభిన్నమైన అంశాలను చర్చకు పెడుతున్నాయి. ఈ చర్చ జరుగుతుండగానే, తమ పనిని సానుకూలం చేసుకుంటున్నాయి. కాబట్టి కేంద్రం ఏ దిశగా అడుగులు వేస్తుందో ఊహకు అందడం లేదు. అదేదో తేలాలంటే 18 వ తేదీ దాకా ఆగాల్సిందే.
కేంద్రం ఆశ్చర్యకర నిర్ణయం
Date: