రెండో బహుమతితో దేశం దృష్టికి కృష్ణా జిల్లా ఘనత
హైదరాబాద్, జులై 18 : కార్టూన్ అంటే గీతలు గీయడమే కాదు. ఆ గీత అందర్నీ ఆకట్టుకునేలా.. ఆలోచింపచేసేలా చేయడం. అందులో సిద్ధహస్తులు హరికృష్ణ. ఆయన ఆలోచన సరళి ఆయనకు అఖండ కీర్తిని సాధించి పెట్టింది.
కృష్ణా జిల్లా, ఉయ్యూరు మండలం కలవపాముల గ్రామానికి చెందిన ప్రముఖ కార్టూనిస్టు హరి కృష్ణ నాగేశ్వరం జాతీయ స్థాయిలో మరోసారి ఘనత సాధించారు. కార్టూన్ వాచ్ మాసపత్రిక ఆధ్వర్యంలో, చత్తీస్ఘడ్ ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంటు సహకారంతో “Drinking/smoking is not a matter of pride” అనే అంశంపై జరిగిన జాతీయ కార్టూన్ పోటీలో హరి కృష్ణ గీసిన కార్టూన్‌కు రెండవ బహుమతి లభించింది.
ఈ సందర్భంగా కార్టూన్ వాచ్ మాస పత్రిక సంపాదకులు శ్రీ త్రయంబక్ శర్మ గారు మాట్లాడుతూ ఫలితాలను ఖరారు చేయడం చాలా కష్టం అయింది కాబట్టి ఫలితాల విడుదలకు కొన్ని గంటలు ఆలస్యం అయింది అన్నారు.

ఈ విజయాన్ని పురస్కరించుకుని హరి కృష్ణ మాట్లాడుతూ, పోటీ నిర్వాహకులకు, పోటీ న్యాయనిర్ణేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఈ బహుమతి ఎంతో “కిక్” ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.
గతంలో కూడా హరి కృష్ణ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అనేక బహుమతులు అందుకున్నారు. “హరి కృష్ణ కార్టూన్స్” అనే పేరుతో కార్టూన్ల పుస్తకాన్ని వెలువరించారు. అంతేకాదు, సోషల్ మీడియా వేదికలపై ఉన్న ఫాలోయింగ్ ను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు “సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్” అవార్డు కూడా ఇచ్చిoది.
హరి కృష్ణ విజయాలు కార్టూన్ ప్రపంచంలో ఆయన ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని స్పష్టంగా తెలియచేస్తున్నాయి.

