ఓపెనర్లలా ఆడిన జంట
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)
మ్యాచ్ ని గెలిపించడం ఎంత ప్రధానమో… ఓటమి నుంచి రక్షించడం కూడా అంతే ముఖ్యం. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ లో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో తొమ్మిదో వికెట్ కి మంచి భాగస్వామ్యాన్ని ఏర్పరచి భారత జట్టును ఫాలో ఆన్ ప్రమాదం నుంచి గట్టెక్కించిన బుమ్రా-ఆకాష్ దీప్ ఆడిన తీరుకు నిదర్శనం ఇదే. తొలి నాలుగు వికెట్లను 74 పరుగులలోపే కోల్పోయిన జట్టును కె.ఎల్. రాహుల్, పంత్, రవీంద్ర జడేజా, ఆ తరవాత బుమ్రా-ఆకాష్ దీప్ జంట ఈ గండం నుంచి బయట పడేసింది. వర్షానికి వర్షానికి మధ్య సాగిన ఈ మ్యాచ్ ఆస్ట్రేలియన్స్ ఆశించిన విధంగా సాగి ఉంటే, ఆట రసవత్తరంగా ఉండేది. ఆతిథ్య జట్టుకు అవకాశమూ ఉండేది. ఈ అవకాశాన్ని బుమ్రా-ఆకాష్ దీప్ ద్వయం దెబ్బతీసింది. ఫాలో ఆన్ తప్పించుకోవడానికి ఇంకా ముప్పై మూడు పరుగులు చేయాల్సిన తరుణంలో రవీంద్ర జడేజా పవెలియనుకు చేరాడు.
అప్పుడు క్రీజులోకి వచ్చేముందు ఆకాష్ దీప్ కు కోచ్ గౌతమ్ గంభీర్ ఏదో చెప్పడం కనిపించింది. డిఫెన్స్ ఆడు అని చెప్పినట్టు అనిపించింది. కొంతసేపు నెమ్మదిగా ఆడిన ఆకాష్ కు అంతకు ముందు బుమ్రా కొట్టిన సిక్స్ స్ఫూర్తి అయ్యిందో ఏమో గానీ, ఒక పక్క నెమ్మదిగా ఆడుతూనే, చక చకా పరుగులు తీశాడు. అవసరమైన చోట బ్యాట్ ఝుళిపించి, బౌండరీలూ చేసాడు. బుమ్రా-ఆకాష్ దీప్ జంట అటు పేసర్లకూ, ఇటు స్పిన్ కూ కొరుకుడు పడకుండా ఆడుతూ ఫాలో ఆన్ తప్పించారు. అంతే స్టేడియం చప్పట్లతో మార్మోగింది. బాక్సులో ఉన్న ఇండియన్ ప్లేయర్స్ కూడా హర్షధ్వానాలు చేశారు.
దీనికి ప్రధాన కారణం ఆటను డ్రాగా ముగించేందుకు వందశాతం అవకాశం ఉండడం. పదేపదే పడిన వాన కారణంగా ఒక వేళ ఫాలో ఆన్ ఆడాల్సి వస్తే, కొత్త బంతితో కష్టమే. దాదాపు 90 నెట్టుకురావడం మాటలు కాదు. ఇది, భారత జట్టులో హర్షానికి కారణం. ఈ రీత్యా బుమ్రా-ఆకాష్ దీప్ గొప్ప మేలు చేశారు. ఒత్తిడిని తట్టుకుని, నిలిచారు. 2001 మార్చిలో కోల్కతా టెస్టులో ఆస్ట్రేలియాపై ఫాలో ఆన్ ఆడుతూ ఐదో వికెట్ కు ద్రావిడ్-లక్ష్మణ్ చేసిన 376 పరుగుల రికార్డు భాగస్వామ్యానికి బుమ్రా-ఆకాష్ దీప్ చేసిన 39 పరుగుల భాగస్వామ్యం తీసిపోదు. ఆటను గెలిపించడం ఎంత ముఖ్యమో, ఓడిపోయే దశలో జట్టుకు ఊపిరులూదడం కూడా అంతే ముఖ్యం. బుమ్రా-ఆకాష్ దీప్ జోడి చేసింది అదే. అందుకే భారత శిబిరంలో… ప్రధానంగా రోహిత్, కోహ్లీ మోములో ఆ ఆనందం. గంభీర్ వదనంలో ఆ హర్షం.