సినీగీత గాన హేల సుశీల

Date:

ఆమె మ‌ధుర గ‌ళ శీల‌
న‌వంబ‌ర్ 13 సుశీల‌మ్మ జ‌న్మ‌దినం
(శ్రీధర్ వాడవల్లి, 9989855445)
హాయి హాయిగా, మధురాతి మధురంగా ఆలపిస్తుంటే కొన్ని తరాలు మైమరిచి ఆలకించాయి. వేలవేల పాటలు ఆమె మంత్రగళంలో జీవం పోసుకుని.. పరిమళం అద్దుకున్నాయి. కొత్త అందచందాలతో శ్రోతలకు వీనుల విందు చేశాయి. హృదయాలను రసభరితం చేశాయి. సుశీల పాటలను స్మరించటమంటే కొన్ని దశాబ్దాల తెలుగు చలన చిత్రాల గమనాన్ని కూడా గుర్తు చేసుకున్నట్టే! తన గాత్రంతో వేలాది పాటలు పాడి కోట్లాది శ్రోతల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న గాయనీమణి పి. సుశీల. ఘంటసాల మధుర గాత్రంతో జతకలిసిన సుశీల గొంతు తెలుగు వారికి లెక్కకు మిక్కిలిగా మరచిపోలేని యుగళ గీతాలను అందించింది. కృష్ణశాస్త్రి, పింగళి, సముద్రాల, సినారె, ఆత్రేయ, వేటూరి వంటి ఉద్దండ రచయితల గీతాలు సుశీల గాత్రంలో మునిగి చిరస్మరణీయములయ్యాయి. ఆవిడ ప్రతి పాట ఆణిముత్యమే సినీమావిపై వాలిన తెల్లకోయిల సుశీల. కార్తీకపున్నమి వెలుగులా, మల్లెలవేళ వీచే చల్లగాలిలా, వటపత్రశాయికి పాడే స్వరాల లాలిలా కలత చెందిన మది వేదనను మరిపించె ఇల్లాలి పాటలా జగాన్ని ఏమార్చె మధురస్వరం ఆమె సొంతం.


విజ‌య‌న‌గ‌రంలో జ‌న‌నం
కళల కాణాచి విజయనగరంలో 1935 సంవత్సరం నవంబర్ 13 న జన్మించింది పులి పాక సుశీల. తల్లి శేషావతారం తండ్రి ముకుందరావు. సుశీల గారి తండ్రి వృతిరీత్యా వకీలు ప్రవత్తిరీత్యా వీణా విద్వాంసుడు. తల్లికి సంగీతం అంటే ప్రాణం సుశీలను శాస్త్రీయసంగీత విద్వాసురాలిగా చూడాలని యం.యస్.సుబ్బలక్ష్మి అంత పేరుప్రఖ్యాతులు తన కుమార్తెకు దక్కాలన్నది ఆయన ఆశయం. సినీ సంగీతంలో రాణించాలన్నది సుశీల అభిమతం. ప్రముఖ వాయులీన విద్వాంసుడు ద్వారం వేంకట స్వామి నాయుడు గారి అబ్బాయి భావనారాయణ గారివద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నది. విజయ నగరం మహారాజ వారి కళాశాలనుంచి సంగీతంలో డిప్లమో పొందింది విజయవాడ, హైదరాబాద్, మద్రాస్ మెదలగు చోట్ల కచేరీలు చేసింది ఆ చిరుగమకం. చిత్తూరు రాంవిలాస్ సభ నుంచి తంబూరాని బహుమతిగా పొందింది. శాస్త్రీయ సంగీతంలో మరింత రాణించాలాన్న ఉద్దేశంతో మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో ముసిరి సుబ్రమణ్య అయ్యర్ దగ్గర విద్యను అభ్యసించింది. కె.యస్ ప్రకాశరావు గారు నిర్మించే కొత్త సినిమాకోసం గాయనీ గాయకులకు స్వర పరీక్ష నిర్వచించే క్రమంలో వినూత్న స్వరంతో పెండ్యాల నాగేశ్వర రావు గారిని విస్మయ పరచింది ఓ గళం.
ఎంఎమ్ రాజాతో తొలి యుగ‌ళ‌గీతం
ఆ యువగళానికి ఎ.యం. రాజాతో కలిసి యుగళ గీతం పాడే అవకాశందక్కింది. అదే ఆమె సినీ సంగీతానికి శ్రీకారం చుట్టింది. మలయమారుతంలా మెదలై ఝంజామారుతమై దక్షిణాదిన ఝుమ్మనే నాదమైంది. విరిసిన ఆ రాగం సినీ వినువీధులలో వీనులవిందు చేసింది. అడుతూ పాడుతూ పనిచేసి అలుపు సొలుపు లేక సునాయాసంగా 12 భాషల్లొ 17,695 పాటలు పాడింది. భక్తిరస గీతాలు పాడి తన గానామృతంతో రాముని అభిషేకించిన శబరి. విష్ణువుని ప్రస్తుతించిన ప్రహ్లాదుడి గొంతులో నారాయణ మంత్రమైంది.జననీశివకామిని అంటూ అమ్మలగన్న అమ్మను వేడుకున్నది .పాడిన ప్రతి భక్తి గీతం శ్రోతలకు భక్తిపారవశ్యం కలిగించేవి. పరిణతితో సంగీతంఫై పట్టుసాధించి స్పష్టమైన ఉచ్చారణతో భావాన్ని స్వరాలలో పలికించగల గాయనిగా మన్నన పొందింది. కధానాయికల హావభావాలని సంద‌ర్భోచితంగా పాటలోప్రదర్శించ గల పటిమ గల పడతి. మాయా బజారులో అహ నా పెళ్ళంట అన్న పాట ఓ మచ్చు తునక. ఆమె పాడే తెలుగుపాట పరవశులమై వినాల్సిందే. జోరు మీద ఉన్న తుమ్మెద ఝూంకారంలా మావిచిగురు తిన్న గండుకోయిలలా తెలుగింటి ముంగిట ముత్యాలముగ్గులా పాటల తోటలో ఆకులో ఆకులా పువ్వులో పువ్వులా కొమ్మలో కొమ్మలా నాగమల్లి పరిమళంలా నిత్య వసంతాన్ని పంచే రాగాల కోయిల. స్వర జాణ గళం వీణగా మ్రోగింది ఆ దివ్యరాగం అనురాగమై మానస వీణను మదిలో శ్రుతి చేసింది.


ఇల‌లో విరిసిన క‌ల‌నైన క‌న‌ని ఆనందం
కలనైన కనని ఆనందాన్ని ఇలలో విరిసే టట్లు చేయగల ఆనంద భరిత గానమైంది. మనస్సు ని అందాల బృందావనిలో విహరింపజేసింది. అందుకే కాబోలు నీవులేక వీణ కూడ పలుకలేనన్నది. నీ కఠం విని కర్పూర వీణ సైతం కరిగిపోయింది. ప్రముఖ వీణా విద్వాంసులు చిట్టిబాబు, ఈమని శంకరశాస్త్రి, అయ్యగారి శ్యాంసుందర్ వంటి వారు సుశీల పాటకు వీణా వాద్య సహకారాన్ని అందించారు. అందుకే ఆ పాటలు ఆపాతమధురాలు. ఝుమ్మనే నాదం జోరు మీద ఉన్న తుమ్మెద ఝూంకారమై శివరంజని రాగలాపనతో జనరంజకమైంది. 12 భాషలో 17,695 పాటల స్వర ప్రస్దానం 2016 గిన్నీస్ బుక్ లో స్దానం సంపాదించింది. కృష్ణశాస్త్రి కవితలా, కృష్ణవేణి పొంగుల పాలలా తేనెలొలికే తేటతెలుగుల పాటైయింది. పంచభూతాలకు లేని కులం పాంచ భౌతికానికి వలదని కర్ణామృతాన్ని పంచింది. ఏదేశమేగినా ఎందుకాలిడినా తెలుగు పాటకు పట్టం కట్టే రీతిలో ప్రదర్శన లిచ్చింది. ఆనాటి తరం కధానాయికల నుంచి నేటితరం కధానాయికల వరకూ అనేక గీతాలు ఆమె కఠం నుంచి జాలు వారాయి. బాలు సుశీల యుగళ గీతాలు సంచలనాలే.
సావిత్రి అంటే ప్ర‌త్యేక అభిమానం
మహానటి సావిత్రి అంటే సుశీలకు ప్రత్యేక అభిమానం. లతామంగేష్కర్ సుశీలమ్మ మానసిక గురువు. సుశీల ఫౌండేషన్ ద్వాదా కళాకారులను సత్కరిస్తోంది. అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 1991వ సంవత్సరంలో తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డు. భారతీదాసన్ అవార్డు తో సుశీలమ్మను సత్కరించింది. 2002 తెలుగింటి తెల్లకోకిల స్వరాన్ని మెచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చింది. గాన సరస్వతికి 2008వ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మభూషణాన్ని బహుకరించింది. ఫిలింఫేర్, సినిమా ఎక్స్‌ప్రెస్‌ సుశీలమ్మకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించాయి. 1992 వ సంవత్సరంలో ఆంధ్రవిశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ని అందజేసింది. 1969, 1971 సంవత్సరంలో తమిళ చిత్ర గానానికి 1977,1982 తెలుగు చిత్ర గానానికి జాతీయ పురస్కారాలని అందుకొంది. 1969 నుంచి 2002 వరకూ 12 పర్యాయాలు పలు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ గాయిని అవార్డులను దక్కించుకున్నది సరాగాల సంగతులు గోదారి గట్టు పై చల్లని చిరుగాలిలా సేదతీరుస్తాయి. వయస్సుకు అణుగుణంగా వారి వారి గొంతుకలో ఒదిగే అమె స్వరం సాధంతో సాధించిన వరం. నవరసాలని పలికించి పులకింపజేయగల ప్రజ్ఞాశాలి. అ గానం కార్తీక పున్నమి రేయిలోని కలికి వెన్నల కిరణం, అమె గళానికి అదే అభరణం. ఆ పాటల పూ తోటలో అకులో అకులా పువ్వులో పువ్వులా కొమ్మలో కొమ్మలా మారి పరమాత్మ సైతం అమె లాలిపాటకు వటపత్రంపై నిద్రించక మానడు. అ గానాల దేవికి శ్రోతల హృదయపు కోవెలలో అనురాగాల ప్రేమాభిషేకం ఆ పాటకు పటాభిషేకం. ఆ రాగ హేల సాగాలి శతవసంతాలు.


పి. సుశీల గురించి ఎవ్వరికి తెలియని విశేషాలు
• ఏంటమ్మాయ్…..పాట వ్రాసుకున్న పేపర్ పోగొట్టుకున్నావా!….పైకి రావలసిన దానివి….ఇప్పుడే ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా!?….నిర్మాత దుక్కిపాటి మధుసూధనరావు కోపంగా అడిగాడు….ఆ అమ్మాయిని. నా హాండ్ బాగ్ లోనే పెట్టానండి. ఇప్పుడు వెతికితే కనపడటం లేదు….కాస్త జంకుతూనే…భయం భయం గా చెప్తున్న ఆ అమ్మాయిని….దర్శకుడు కె.వి.రెడ్డి…మ్యూజిక్ డైరెక్టర్ పెండ్యాల….ఆదుకుని….సర్లేండి….ఎవరైనా మర్చిపోతారు….దానిదేముంది……అంటూ… ఇంకో కాపీ తెప్పించి….ఆ అమ్మాయితో పాడించారు.పందొమ్మిదేళ్ళ ఆ అమ్మాయి కది….గొప్ప గుణపాఠమే అయ్యింది. ఇక అప్పటి నుండి….ఏనాడూ….పాట లిరిక్స్ ఉన్న పేపర్ కానీ…పుస్తకం గానీ…మరచిపోయింది లేదు.ఆ పాటే….అనురాగము విరిసేనా…ఓ రేరాజా….దొంగరాముడు(1955) చిత్రం లోనిది.
• వాహినీ స్టూడియోలో ఆ పాట పాడి ఆ అమ్మాయి వెళ్ళాక….ప్రక్కనే…విజయా వారి…మిస్సమ్మ షూటింగ్ జరుగుతోంది.రికార్డ్ చేసుకున్న పాటను….దుక్కిపాటి & కె.వి.రెడ్డి గార్లు వింటున్నారు….రిలాక్స్ అవుతూ. అప్పుడే అటుగా వచ్చిన ఎల్.వి.ప్రసాద్ & చక్రపాణి గార్లు…..ఆ అమ్మాయి పాడిన ఆ పాటను వింటూ….అరే…ఏం రెడ్డి గారూ….లతా మంగేష్కర్ పాట వింటున్నారా….సాధనా వారికోసం పాడారటగా లతా….అదేనా ఇది……అంటూ ఆరా తీశారు ఎల్.వి.ప్రసాద్. ఇది మా సినిమా దొంగ రాముడు కోసం రికార్డ్ చేసింది. పాడింది పి.సుశీల…..అన్నారట. చాలా బాగుంది వాయిస్. మన పిక్చర్ మిస్సమ్మ లో రెండవ హీరోయిన్ కోసం 2 పాటలు ఈ అమ్మాయి చేత పాడించేద్దాం….అని నిర్ణయించి పాడించిన పాటలే…. మిస్సమ్మ లోని….బాలనురా మదనా & బృందావనమది అందరిది పాటలు.


• కొమ్మనే…ముద్దుగుమ్మనే…అనే బృందగానం మొదట బిట్స్ పాడారు. వాయిస్ బాగుంది అనిపించి…లావొక్కింతయు లేదు…ధైర్యము విలోలంబయ్యే..పద్యం సొలో గా పాడించారు.
• ఇంకా బాగున్నట్లనిపించి…ఏకంగా ఏ.ఎం.రాజా తో డ్యూయెట్టే పాడించేశారు!
• ఎందుకో….పిలిచావెందుకో…. అనే యుగళం.
• 1957 లో దుక్కిపాటి మధుసూధన రావు గారే పూనుకుని..ఏ.వి.ఎం.కాంట్రాక్ట్ నుండి తప్పించారట. అందుకే మాతృసంస్థలుగా అన్నపూర్ణా & విజయా వారిని తలుచుకుంటారు సుశీల గారు.
• విజయనగరంలో 5 సంవత్సరాలు..మద్రాస్ మ్యూజిక్ అకాడెమీలో 3 సంవత్సరాల డిప్లొమా కోర్స్ అంతకు ముందే పూర్తి చేసినా…ఆమె అభిమాన గాయనీమణి లతామంగేష్కర్.
• సినిమా పాటలంటేనే ఇష్టం. ఎన్ని కర్ణాటక కచేరీలు చేసినా…మనసంతా సినిమా పాటల మీదే ఉండేది!
• విజయనగరంలో ఉన్నప్పుడు….ఘంటసాల వారు రేడియో వినేందుకు …సుశీల గారి ఇంటికి వచ్చేవారట!


• మిస్సమ్మ, మాయాబజార్ లలో పాడాక…ఇక తెలుగు సంగీతమంతా పి.సుశీల మయమైపోయింది.
• తేటతేనియలొలికే గళమధురిమ….స్పష్టమైన ఉచ్చారణ…సంగీత సంస్కారం….వెరసి….తెలుగు వారికి దొరికిన అమృతభాండం..పి.సుశీల గారి గళం! వారి పాట విననిదే ఏ రోజూ గడిచేది కాదు మనకు!
• పి. సుశీల గారు తెలుగమ్మాయి గా పుట్టడం….మన అదృష్టం. ఎన్ని భాషలలో పాడినా మనతెలుగమ్మాయి అని అనుకోవడంలో…ఓ సంతృప్తి ఉంది.
• ప్రతి తెలుగమ్మాయి కలలు కనే గళ మాధుర్యం ఆమె సొంతం. ప్రతిరోజు మన చెవిన పడి….కాసేపు సాంత్వన కలిగించి…గుండెలకు చల్లదనం అందించే….చందన పరిమళం….ఆ దైవదత్తమైన దివ్య స్వరం!
• ఆమె పాటలో ఓ జాతి సంస్కారం….సంస్కృతి ఉన్నాయి.
• అంతెందుకు….తెలుగు సినీ సంగీతమంతా సుశీల మయం.


• 5 దశాబ్ధాలు షుమారు 40 వేల పాటలు (అన్ని భాషలు కలిపి)…శ్రోతల హృదయాల ఆనంద పరవశం లో డోలలాడించారు శ్రీమతి.పి.సుశీల గారు.
• పద్మవిభూషణ్ కైవసం చేసుకున్నారు. నేషనల్ అవార్డులకు, ఇతరత్రా అవార్డులకు..లెక్క లేదు.
• ఇక మిగిలినది ఒక్కటే….భారత రత్న…అవార్డ్. అన్నివిధాలా అర్హత ఉన్న వీరికి…తప్పక లభించాలి.
• సౌత్ ఇండియానే కాదు..నార్త్ భాషలలో సైతం పాడారు.
• స్వాతిముత్యం మూవీ లో వటపత్రసాయికి…పాటకు నేషనల్ అవార్డ్ వస్తుందని భావించారట. అది కొంచెం బాధించిందని చెప్తారు.
• ఆ దైవదత్తమైన స్వరం నా అదృష్టం. ఈ జన్మకే కాదు…మరో జన్మలో కూడా…..సంగీతమే ఊపిరిగా ఉండాలని శ్రీమతి. పి.సుశీల అంటుంటారు.
• 13 నవంబర్ శ్రీమతి. పి.సుశీల గారి పుట్టిన రోజు. వారి స్వరం వింటూ…పెరిగిన మనకు నిజంగా పండుగ రోజే! (వ్యాస ర‌చ‌యిత ప్ర‌ముఖ సినీ విమ‌ర్శ‌కుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Who will be triumphing in MAHA elections?

Is it Mahayuti or Maha Vikas Aghadi? Among all parties...

Trump and India: Great expectations

(Dr Pentapati Pullarao) Donald Trump’s election has created great expectations...

Prof.Purushottam Reddy: Renowned Academician

Environmentalist and Developmental Activist  (Prof Shankar Chatterjee)     ...

We are here to help our country: Trump

This is a moment never seen before We are here...