(సురేష్ కుమార్ ఎలిశెట్టి, 9948546286)
విశాఖ ఉక్కు
ఆంధ్రుల హక్కు..
నువ్వే ఊపిరి పోసిన
ఈ పదం..
నీ పథమై..
ప్రతి తెలుగు’వాడి’
శపథమై..
సింహనాదమై..
రణనినాదమై..
అంతటి ఇందిరమ్మనే
కదిలించి..
విశాఖ గడ్డపై
పురుడు పోసుకున్న
ఉక్కు కర్మాగారం
అఖిలాంధ్ర కీర్తిప్రతిష్టల
భాండాగారం..!
అందరికీ ఉంటాయి
ఎన్నో కలలు..
జనం కోసం..
జన్మభూమి కోసం
కలలు కనే వాడు
దేశభక్తుడు..
ఆ కలలను నిజం
చేసేందుకు పోరాడేవాడు
నిజమైన యోధుడు..
అలా విశాఖ ఉక్కు కోసం
కలలు గని..
ఆ కలలు నిజం కావడానికి
ఏకంగా ఇరవై ఒక్క రోజులు
నిరాహార దీక్ష చేపట్టిన
మహామనీషి అమృతరావు!
జీవితమంతా పోరాటాలే..
తెలుగు మాటాడే వారి కోసం
ఒక ప్రత్యేక రాష్ట్రం..
పొట్టి శ్రీరాములు కంటే
ముందుగా ఇందుకోసం
దీక్ష చేపట్టిన అమృతరావు..
అంతకు మునుపే క్విటిండియా ఉద్యమంలోకీ
ఒక ఉరుకు..
మనిషి భలే చురుకు
ఆ హుషారు వల్లనే
బాపూజీతో సమావేశం
నాటి నుంచి మరింతగా
ఉరకలెత్తిన ఆవేశం..!
అమృతరావు
ఆ పేరు నిబద్ధతకు నిర్వచనం..
పోరాటానికి బహువచనం..
పేదరికం చదువుకు
అడ్డుకట్ట వేస్తే..
కట్టలు తెంచుకుంది
పోరాట స్ఫూర్తి..
తాను పుట్టిన గడ్డకు
ఏదో చెయ్యాలన్న తపన
నడిపింది ఉద్యమాల వైపు..
రాజీ పడకపోవడమే రివాజు..
పోరాటమే ప్రతిరోజు!
అలాంటి అమృతరావు దీక్ష
ఆ మహనీయుని కల..
ఆయనే పలికిన మాట
విశాఖ ఉక్కు
ఆంధ్రుల హక్కు
నేడిలా భవిత గందరగోళమై
ప్రైవేటు పరమైపోతుంటే..
నీ రక్తం మరగదా
ఆ మహనీయుని
ఆత్మ ఘోషించదా..
తన త్యాగం..తన పోరాటం..
తన ఆరాటం..
కాకూడదు వృధా..
మౌన వ్యధ…
ఓ తెలుగోడా..
మరోసారి చేయెత్తి జైకొట్టి
మహావీరుడు అమృతరావుకు..
బిగించి పిడికిలి..
ఆపెయ్యి ఈ పాడు
ప్రైవేటు కలి..
పాలకుల ఆకలి..!
నీ ఉక్కు నీ హక్కు
ఎవరికో కారాదు భుక్తం..
అదే ఇప్పుడు నీ సూక్తం..
నీకు ఉపయుక్తం..
లే..నీ హక్కును కాపాడుకో..
ఆపేయి..ఈ రాక్షస కేళి..
అదే..అదే..అమృతరావుకు
నీ నిజమైన నివాళి!
💐💐💐💐💐💐💐
(కవిత రచయిత సీనియర్ జర్నలిస్ట్)