ఉత్తమ పర్యాటక గ్రామంలో ఎంపిక
గుర్తింపు పత్రాన్ని సీఎంకు అందించిన పర్యాటక మంత్రి
హైదరాబాద్, జనవరి 18: యాదాద్రి భువనగిరి జిల్లా ‘భూదాన్ పోచంపల్లి’ ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. ‘ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ’ (UNWTO) తొలిసారిగా ‘ఉత్తమ పర్యాటక గ్రామం’ పోటీని నిర్వహించింది. ఈ పోటీలో ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల నుంచి 170 ప్రతిపాదనలు వచ్చాయి. భారత్ సిఫార్సు చేసిన మూడు గ్రామాలలో భూదాన్ పోచంపల్లి గ్రామం ‘ఉత్తమ పర్యాటక గ్రామం’గా ఎంపికై అరుదైన ఘనతను సాధించింది.
ఈ సందర్భంగా ప్రగతి భవన్ లో సోమవారం పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, టూరిజం శాఖ ఎండీ బి.మనోహర్ రావులు సీఎం కేసీఆర్ గారిని కలిసారు. ఇందుకు సంబంధించి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ సంస్థ జారీచేసిన గుర్తింపు పత్రాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా వారు అందుకున్నారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను శాలువాతో సీఎం సత్కరించారు. టూరిజం శాఖ అధికారులు చేసిన కృషిని సీఎం కేసీఆర్ అభినందించారు.