అత్యాధునిక పరిజ్ఞానం సెంటర్ సొంతం
సమాచార సమన్వయానికి మూలస్థంభంగా ఫ్యూజన్ కేంద్రం
ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఆగస్టు 4: పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ మనందరికీ గర్వకారణమని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానంతో సిసిసి సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. సెంటర్ ప్రారంభోత్సవానంతరం ఆయన ఆహూతులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సీసీసీ అన్ని రాష్ట్ర ప్రభుత్వ శాఖల సమాచార సమన్వయానికి మూలస్థంభంగా ఉంటుందన్నారు. ప్రకృతి విపత్తులను, ప్రమాదాలను, నేరాలను గుర్తించడం, వాటిని ఎదుర్కునేందుకు అధికారులకు సమాచారాన్నిఅందించే అత్యున్నత సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. పట్టుదల, చిత్తశుద్ధి ఉంటే సాధించలేనిదంటూ ఏమీ ఉండదనీ, ఉత్తమమైన పని ఎక్కడ చేసినా ప్రపంచవ్యాప్త గుర్తింపు వస్తుందనీ చెప్పారు. మనలో కొందరు 50శాతమే వర్తమానంలో ఉండి పనిచేస్తుంటారన్నారు.
ఈ కారణంగా ఫలితాలు అనుకున్నట్లుగా రావని సీఎం స్పష్టంచేశారు, అందుకే ఏపనైనా సరే, శ్రమించి పనిచేస్తే అద్భుత ఫలితాలొస్తాయన్నదానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ నిలువెత్తు నిదర్శనమని సీఎం వెల్లడించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ నెరవేరిందన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచే పోలీస్ వ్యవస్థ కోసం.. సంస్కారవంతమైన పోలీసు వ్యవస్థ నిర్మాణం కోసం సిసిసి ఉపయోగపడుతుందని తెలిపారు. గుడుంబా, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్మూలించిన పోలీసులు రాబోయే రోజుల్లో మరింత చురుకుగా పని చేయాలని పిలుపునిచ్చారు.
సీఎం ఇంకా ఇలా అన్నారు…
మంచిని సాధించడానికి సంకల్పంతో పని చేస్తే సత్ఫలితాలు వస్తాయి. చిత్తశుద్ది వాక్శుద్ది సందర్భశుద్ది వుంటే సాధించలేనిదేమీలేదు. గతంలో పనిచేసిన పోలీసు కమిషనర్లు గొప్ప సేవలందించారు. వారిని పిలిచి వారి అనుభవాలను సలహాలు సూచనలు తీసుకోవాలి.
మానవ సమాజం ఉన్నంత వరకు శాంతి భధ్రతల పరిరక్షణ అందుకోసం పోలీస్ వ్యవస్థ కొనసాగుతూనే ఉంటుంది. సమాజానికి సైబర్ నేరాలు, డ్రగ్స్ ప్రమాదకరంగా పరిణమించాయి. వాటిని అరికట్టాల్సిన బాధ్యత పోలీసులదే. మీ అందరి సహకారంతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు వెల్లివిరుస్తున్నాయి. న్యూయార్క్ లాగే మన దగ్గర కూడా నేరాలు పూర్తిగా తగ్గాలి. టెక్నాలజీ అప్ డేట్ కావడం కూడా పోలీసుశాఖకు అవసరమే. తెలంగాణ పోలీసు శాఖ కూడా అద్భుత ఫలితాలు సాధించాలి. ప్రజలకు సేవ అందించే సంస్థలాగా మరింత అభివృద్ధి కావాలి. అందరూ సంస్కారవంతమైన పోలీసులుగా తయారు కావాలి.
ఏ సమస్య ఎదురైనా సమిష్టి ఆలోచనలతో పోలీసులు పరిష్కరించాలి. ఆర్అండ్‌బీ శాఖ మంత్రిని అధికారులనూ, నిర్మాణ సంస్థనూ, టెక్నాలజీని సమకూర్చిన ఎల్ అండ్ టీ కంపెనీనీ సీఎం అభినందించారు. ఈ భవన నిర్మాణం కోసం పనిచేసిన ప్రతి శ్రామికుడికీ,కార్మికుడికీ నమస్కరిస్తున్నానంటూ ప్రసంగాన్ని ముగించారు.