‘‘ఇంకెక్కడిదీ ‘చైతన్య’, శ్రీధర్?’’
(మాడభూషి శ్రీధర్)
అది చందా కాంతయ్య మెమోరియల్ (సికెఎం) కళాశాల, వరంగల్లు, పోచమ్మ మైదాన్ నుంచి మూడునాలుగు కిలోమీటర్లు నడిస్తే దేశాయపేట వచ్చేది. బస్సు వస్తుంది కాని వస్తుందో లేదో చెప్పలేం. సైకిల్ మీద వెళ్లాల్సిందే. లేదా మా సార్లు ‘నేను రానా’ అనడం అప్పుడప్పుడు లిఫ్ట్ ఇస్తే చేరే వాణ్ని.
(మా కళాశాల భవనం ఫోట్ లో ఉన్న చందాకాంతయ్య శ్రేష్టి చందాతో ఈ కళాశాల వచ్చింది. వారి దాతృత్వంతో మా వంటి వాళ్లం చదువుకుంటున్నాం)
సికెఎం ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజిలో బిఎస్సీ చదువుకుంటున్నాను. కాలేజ్ ఎడిటర్ (సంపాదకుడు) పోస్ట్ కు విద్యార్థులకు పోటీ ఉండేది. నేను కూడా పరీక్ష రాస్తాను అంటూ చాలా మంది నవ్వుకున్నారు. వీడు వ్యాస పరీక్ష రాస్తాడట అని. లింగమూర్తి ఉంటే ఇంకెవడైనా గెలుస్తడా? అని హేళన చేసేవారు. నవ్వడం ఎందుకు సరే. అయినా ఓ సారి పరీక్ష కోసం రాస్తానని నిర్ణయించుకున్నాను. రెండేళ్లనుంచి గెలుస్తున్న సంపాదకీయుడి పోటీలో ఏదైనా పోటీ గట్టిగా ఉంటుందని అర్థమైంది. దాదాపు వంద మంది పరీక్షలో పాల్గొంటారని ఊహించలేదు. లింగమూర్తి కన్న ఇంకెవరు రాస్తారు అంటూనే ఇంతమందిపోటీలో ఉంటారా?
నేను ఈ కాలేజికి చేరినప్పుడు తెలుగు అధ్యాపకుడు, మంచి రచయిత, వ్యంగ కవి పేర్వారం జగన్నాథం గారు ప్రిన్సిపల్ గా వచ్చారు. జనధర్మ పత్రిక ప్రింటింగ్ ప్రెస్ లో పనిచూస్తూ వారితో ఎడిటర్ నాన్నగారు ఎం ఎస్ ఆచార్య గారితో వచ్చి చాలాసేపు మాట్లాడుకునే వారు. నాకు సీట్ ఇవ్వడం లో కూడా వారి సాయం దొరికింది కూడా. కాని ఆ తరువాత ఎందుకో ప్రివ్సిపల్ అని జగన్నాథం మారిపోయారు.
మధ్యలో పోటీ అయిపోయింది. ఫలితం వస్తుందో లేదో. వస్తుందో రాదో ఆలోచించలేదు. అనుకోలేదు. దానిగురించి బాధపడలేదు కూడా. రాకపోయినా పోనీ అనుకున్నాను. ఆశ్చర్యం లింగమూర్తి పరీక్షలో ఓడిపోయారు. అంతకన్న ఆశ్చర్యం ఏమంటే ఎక్కువ మార్కులు రావడం వల్ల నేను సంపాదకుడిగా గెలిచాను. నిజానికి ఆ వ్యాసరచన పోటీకోసం ఇచ్చిన పెద్ద కష్టమైన సబ్జెక్టు ఏమీ కాదు. ‘‘భారతదేశ నిర్మాణంలో యువజనుల పాత్ర’’ వంటి దేదో జ్ఞాపకం రావడం లేదు. ఏమయినా సరే నేను బోలెడు పేజీలు రాయాలని నిర్ణయించుకున్నాను. అంతే కన్నా కలర్ ఫుల్ గా అక్కడ రంగు రంగు పెన్నులు వాడుకున్నాను. అండర్ లైన్ చేయడం, హెడ్ లైన్ సబ్ హెడ్ లైన్ లతో తెలుగులో సామెతలు, పెద్దల మంచి మాటలను అండర్ లైన్ కూడా గట్టిగా గీసి. అందుకే సంపూర్ణ (అతి) ఆత్మవిశ్వాసంతో సంపాదకీయుడినైపోతాను నవ్వుకుంటూ అనుకున్నానేమో అనుకున్నా. (పెద్దలు నేర్పడం వల్ల పుస్తకాలు రాసుకునే శక్తి లభించింది, ధన్యులం).
బిఎస్పీ చదువు తోపాటు తెలుగు, ఇంగ్లీషు మొదటి పార్ట్ లో ఉంటాయి. ఇంగ్లీషులో కోదండ రామారావుగారు, సుధాకర్ రెడ్డిగారు, రాజ్ కుమార్ గారు నాకు చాలా గుర్తు ఉంది. ఇప్పడికీ కోదండ రామారావుగారిని కలిసి నమస్కారంచేసుకుంటూ ఉన్నాను. వారు లేకపోతే ఓ నాలుగు ఇంగ్లీషు అక్షరాలు రాకపోయేది కదా. తెలుగు సార్లు నలుగురు పెద్దలు, మంచి లెక్చరర్లు మాకు మంచి పాఠాలు చెప్పేవారు. తెలుగు అంటే చాలా ఇష్టం. ఏదో రాయడం, వ్యక్తిత్వ పోటీలో ఎప్పుడూ గెలిచేవాడిని. మాకు కూడా విప్లవరచయిత వరవరరావుగారు పాఠాలు చెప్పాల్సింది. నేను వారి శిష్యుడినని ఎదురుచూసినాను. కాని నేను చదువకున్నన్ని రోజుల్లో వరవరరావు ఎమర్జెన్సీలో ఏదో కేసుల్లో ఇరికించి జైల్లో బంధించినారు. ఎప్పుడూ ఇదే ఇరికిపోవడం ఉండేనే ఉన్నది కదా.
వరంగల్లు ప్రముఖ రచయిత వేంకట రత్నం గారు మాగజైన్ కు సలహాదారుడు. మంచి స్నేహ జీవి. ఎంతో అభిమానంతో చూసుకునే వారు. ఈ మధ్య ఇప్పడికీ కలిసి ఫోన్ చేస్తూ గురువుగారితో మాట్లాడుతూ ఉన్నాను కూడా. వనం మధుసూదన్ గారు మరో అధ్యాపకులు, మరికొందరు ఉండేవారు. కాకతీయులు అన్నా, రుద్రమ్మ రాణి, ప్రతాపరుద్రుడున్నా ఆయన మనసు పులకలు వచ్చేవి. లక్షల రూపాయాలతో సినిమా చేయించడానికి కలలు కనేవారు. సినిమానిర్మాణం కూడా ప్రారంభించేవారు. వారి కలగానే లేకుండానే ఆయన పోయారు. మాకు సంస్కృతం క్లాస్ లకు విద్యార్థులు ఎక్కువగా ఉండేది. వారు సంస్కృత సార్ శృంగారం రంగరించి సరసంగా పాఠం చెప్పేవారు. మామూలు కాలేజ్ లో అటువంటి లెక్చరర్ మొత్తం జనాలు, పక్కవారి విద్యార్థులు క్రిక్కిరిసి పెద్దగా నవ్వుకుంటూ ఉండేవారు. నిజంగా అది ఎంతో గొప్పతనం కదా. అయినా సరే మేము తెలుగు కోసం ఇష్టపడి కష్టపడి చదువుకోవడానికి వచ్చిన వారు చాలా తక్కువమందే ఉండేది.
కాలేజ్ మాగజైన్ ‘చైతన్య’
కాలేజ్ మాగజైన్ పేరు ‘చైతన్య’. చాలా బాగున్నది కదా. వరవరరావుగారు జైల్లోనే ఉన్నారు. ఎమర్జన్సీ వచ్చింది. కనుక జైల్ నుంచి విడుదల సాధ్యం కాదు. అప్పడికే మా మ్యాగజైన్ చైతన్య సిద్ధమైంది. నేను మిత్రులు చాలా సేపు చర్చలుచేసుకోవడం, వ్యాసాలను ఎంపిక చేయడం, ఎడిట్ చేయడం, రత్నం సార్ మార్గదర్శనం చేసేవారు. అంజయ్యగారు మా ప్రిన్స్ పాల్ గా ఉండేవారు. ఎమర్జన్సీ కాలంలో కూడా మా ప్రిన్స్ పాల్ గా పనిచేసేవారు. అప్పుడు మా సంపాదకీయం లో విప్లవ కవితలు, ఇందిరాగాంధీ పాలనలో అన్యాయాలు వివరించడం, చల్లటి కోకాకోలా ప్రియమనే వారు కాదనే వారూ ఉండే వారు. మనదేశానికి అవసరమా అనుకునే వాణ్ని. దేశాన్ని ఆర్థిక రంగంలో పెంచకుండా ఈ కోకాకోలాలు తాగడమేమిటి అని తిట్టుకునే వాళ్లం. దాని వల్ల ఏం లాభం? విదేశాల సంపన్నులకు కోటఅప్పగించడం కాకుండా చేసేదేమిటి అనేవారం.
దేశాయపేట లో విప్లవమైన గేయాలు, పాటలు, కార్యక్రమాలు మా చుట్టూ జరుగుతూ ఉండేది. (ఆ తరువాత కాలంలో నేను, శ్రీశ్రీ కార్యక్రమంలో ప్రసంగించడాన్ని నేను విన్నాను. అప్పుడే అరెస్టు చేద్దామంటానుకున్నారు. తెలుసుకున్న శ్రీశ్రీ ఎంకెక్కిడికో వెళ్లిపోయారనే వారు). పుస్తకం ప్రచురించడానికి వేయికన్నా ఎక్కువ చాలా ఆ మాగజైన్ కాపీలు ఇవ్వాలని ప్రెస్ కు సిద్ధం చేస్తున్నారు.
ప్రిన్సిపల్ అంజయ్యగారికి కూడా నావల్ల కష్టాలు వస్తూనే ఉండేవి. ఏం నాయనా విప్లవాలు వస్తున్నాయని సంపాదకీయంలో రాస్తావా. కొంపలు మునగవా మరి. కనీసం భావవిప్లవం అన్నా బాగుండేది కదా అని అంజయ్య సార్ తలబాదులుకునే వారు. ఎవరేమన్నా సరే, అప్పడికి ప్రింట్ అయిపోయింది కదా, ఓ పనైపోయింది అనుకున్నాను. కాని సళ్ల పండుగ ముందుంది అని తెలియదు. మాగజైన్ కాపీలు పంచడం అయిపోయింది. ఇంకా 25 జూన్ 1975 వచ్చింది. ఎమర్జన్సీ, విప్లవ మాగజైన్లు అంటే జైలుకు పోవడమే అని అర్థం కాలేదుకదా. ఇప్పడికీ ఇదే పరిస్థితి.
పోలీసులు దిగారు. ఆఫీసర్లు, అంజయ్యసార్, కలెక్టర్ తరఫున అధికారులు వచ్చి మాగజైన్ రక్షించడానికి విప్లవ వ్యాసాలున్న పేపర్లన్నా తీసేద్దామా అని సాధ్యం కాలేదని బాధపడేవారు. ఆలోచించేవారు. సాధ్యం కాదని తెలిసి మాగజైన్లు మొత్తం కట్టగట్టితీసి పారేయాలని ఎవరనుకుంటారు? నానాతంటాలు పడి, పోటీలోనిలబడి గెలిచి, ఆహా ఓహో అనుకుని సంపాదకీయం రాసుకుంటూ ఉండకుండా ఈ ఎమర్జన్సీ ఎందుకు రావడం. అయినా ఇక్కడ దేశాయిపేటలో రాయడం ప్రింట్ కావడం, డిల్లీలో ఇందిరాగాంధి వంటి పెద్దలకు చెప్పేదెవరు. చేస్తున్నదేమిటి. అర్థం కాదు. మా కాలేజ్ లో నేనున్న క్లాస్ లో ఓరోజు అధికారులు చేరుకున్నారు. మా అందరినుంచీ మాగజైన్ తిరిగి వాపస్ చేయాలని గట్టిగా చెప్పారు. వరసగా మా సంచిక ఇవ్వాలని అందరినుంచి తీసుకుంటున్నారు. మొత్తం లెక్క రాసుకుని, ప్రతి క్లాస్ లో ఒక్కొక్కడినుంచి పేరు రోల్ నెంబర్ ప్రకారం చైతన్య మాగజైన్ సంచికలు వసూలు చేసుకుంటున్నారు. ఈ మధ్యలో కొంటె క్లాస్ మేట్ లు ఈ పుస్తకం తీసేసి ఇచ్చే ముందే ఆ పుస్తకాల్లో వారి పేర్లు వీరి పేర్లు తిట్టుకుంటూ గడ్డాలు మీసాలు పెయింట్ చేసుకుంటూ పూర్తి చేసి వాపస్ ఇచ్చారని నేను మిత్రులూ చూడడం చూసి నవ్వుకున్నాను. కాని ఏం చేసేది? ఇప్పడికీ ‘ఒక్క కాపీ అయినా ఇవ్వండిరా’ అని అడిగితే దిక్కులేదు. ఇంతకూ ఆవిధంగా ప్రచురించిన సంచికలు ఎక్కడున్నాయని వెతుక్కునే వాడిని.
ఆ సమయంలో ప్రిన్సిపల్ గా మా కె జయశంకర్ గారు వచ్చారు. మా తెలంగాణ ప్రజా పిత అని గౌరవం పొందిన మహానుభావుడు. ఆ కాలేజీ సమస్యలన్నీ తీర్చడానికి సమర్థుడు, విద్యాసేవా రంగంలో ప్రతిభావంతుడు, ఓపిక ఉన్నవాడని ఆయనకీర్తి కలిగిన వారు. నిజమే కూడా. ఆ తరువాతకాకతీయ యూనివర్సిటీకి రిజిస్ట్రార్ గా ఆయన్ను ఎంచుకున్నారు. చాలా సమర్థంగా నిర్వహించారు కూడా. అందుకే తెలంగాణ సాధనకు చాలా జాగ్రత్తగా నడిపేవారు. పోలీసు కాల్పులలో ఎవరిచంపకుండా, అహింస లేకుండా ఉద్యమం సాగించాలని జాగ్రత్తగా పనిచేయించేవారని కె చంద్రశేఖర్ రావ్ (గత ముఖ్యమంత్రి) గారు, ముఖ్యంగా జయశంకర్ నాతో కూడా చాలా సార్లు అనేవారు. 1969 నాటి ఉద్యమంలో చాలా మంది కాల్పుల్లో చనిపోయారు. అది మళ్లీ జరగకూడదు, అదే మన విజయానికి కారణం అని జయశంకర్ అనేవారు. అప్పుడు ఎమర్జన్సీలో ఎందుకంటే సికె ఎం కాలేజి నడపడం వరంగల్లు లో ఒక పెద్ద సమస్య గా అనేవారు. మాతో సహా అందరినీ వీళ్లంతా ఓ గొప్ప నక్సలైట్లు అనేవారు. పోయి పోయి నీకే ఇక్కడ సీట్ దొరికింది అని కూడా తిట్టేవారు. మా కమిటీకి జిల్లా కలెక్టర్ గారు ప్రెసిడెంట్ గా ఉండేవారు. అంటే అంత పెద్ద అధికారి ఉంటే తప్ప ఈ కాలేజి కష్టమని బ్రతిమాలుకుని కమిటీ పెద్దలు అభ్యర్థించారు. (ఈ మధ్య కాలంలోనే మొత్తం కాలేజీ పాలక సంఘం వారు ప్రభుత్వానికి అప్పగించారు కూడా. అంత సీరియస్ ప్రాబ్లమ్ అన్నమాట)
(Samachar, Hindi for “information” was founded in February 1976, after the merger of United News of India, Press Trust of India, Samachar Bharati and Hindustan Samachar. The news agency was directly under the control of the government of India.)
నా పని మౌనమే. మరేదీ చేయలేని స్థితి. ఎమర్జన్సీ. ఆ ఎమర్జన్సీ పోయిన తరువాత అప్పడికి జయశంకర్ గారు కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా ఉన్నారు. నేను అప్పడికే, జనధర్మ, ఆ తరువాత ఈనాడు విలేకరిగా, సమాచార భారతి జర్నలిస్టుగా పనిచేస్తున్న రోజులు. ఎమర్జన్సీ కాలంలో సమాచార భారతిని మాత్రంన్యూస్ పేపర్లకు న్యూస్ ఏజన్సీలను రద్దు చేసారు ఇందిరమ్మ గారు. వారితో పిటిఐ, యూఎన్ ఏ, హిందూస్తాన్ సమాచార్, సమాచార భారతి ఏజెన్సీ కలిపి ‘సమాచార్’ ఏజెన్సీ అని మాత్రమే ఉండేది. ప్రభువులు గారి ఆజ్ఞల ప్రకారమే వార్తలు ఇచ్చేవారు, అవే వేయాలి కదా మరి. అందుకు ఎమర్జెన్సీ కాలంలో పత్రికలన్నీ సైలెంట్ గా అంటే మౌనంగా అంటూ సంపాదకీయాల స్తలాలలో ఖాళీగా తెల్లబోసి వదిలిపోయే స్థితి. ఇందిరాగాంధీని విమర్శిస్తే జైలుకుపోవలసిందే. అప్పుడు సమాచార భారతి రోవింగ్ (విభిన్న జిల్లాలకు వెళ్లే) కరెస్పాండ్ గా నానియమించారు. వారి నుంచి వార్తలను కూడా జనధర్మ వరంగల్ వాణి దినపత్రికలకు టెలిప్రింటర్ ద్వారా పంపించేవారు. వరంగల్లు ప్రెస్ లో మా మధ్యలో ఈ టెలిప్రింటర్ ఉండడం మాకో పెద్ద ఆకర్షణ అయ్యేది. ఏదో నగరం నుంచో టపటపా వార్తలు సొంతంగా వాటికి అవే టైప్ వచ్చి ఉండేవి. వచ్చేవారంతో చూసి ఓహో ఇదా టెలిప్రింటర్ అని చూసేవారు. అంతకు ముందు కేవలం టెలిగ్రామ్ లు మాత్రమే అప్పుడు మాకు తెలుసు. ఫాక్స్, ఈ మెయిల్ వంటివి ఆతరువాత వచ్చినాయి. మేము వార్తలు పంపడానికి పోస్ట్ అండ్ టెలిగ్రామ్ తప్ప మరేదీ లేదు. అప్పుడు క్యూలో నిలబడి, తెలుగులో వార్తను ఇంగ్లీషులో టైప్ చేసి ఇవ్వాలి. మాకో నిపుణుడు టెలిగ్రామ్ ఏ వి నరసింహారావు అని చిరకాల మిత్రుడు ఉన్నాడు. (ఆ తరువాత అనేక బ్యాంక్ అధికారిగా, లా ప్రొఫెసర్ గా మారి, ఆయన లా డిపార్ట్ మెంట్ హెడ్ గా ఉన్నారు, అదో పెద్దకథ), కట్టుకట్టుకడ కడా అంటూ మాతో మాట్లాడుతూనే చేతితో టక్ టక్ అంటూ వార్తలను ఈ మిత్రుడి ద్వారా హైదరాబాద్ కు, బాంబేకు, విజయవాడ, మద్రాస్ లకు వేరే వేరే ఎడిటర్లకు ఎడిషన్లకు పంపేవాళ్లం.
ఇంకెక్కడిదీ చైతన్య, శ్రీధర్
అది సరే. అదో పాతకథ. ఆ దశలో నా చైతన్య మాగజైన్ ఒక్క కాపీ కూడా ఉండదా అని బాధపడుతూ, సార్ ఒక్క కాపీ కూడా ఇవ్వలేరా అని జయశంకర్ గారిని అర్ధించేవాడిని.
‘‘ఇంకెక్కడిదీ చైతన్య, శ్రీధర్, నీకు ఏమైందో తెలుసా. మొత్తం నీవు ఎడిటర్ గా ఉన్ చైతన్య సంచికలన్నీ ఒక్కొక్కటి వెతికి పట్టి కట్టగట్టి, అంత్యక్రియలు చేసినట్టు, పెట్రోల్ చల్లి, మరీ కాల్చిపడేసారు. అందుకు నేను సాక్షిని. ఆ అన్యాయానికి అధికారులు పోలీసులు కలిసి నిలబడి అన్ని సంచికలు బూడిదయ్యే దాకా చూసారు, ఏం చెప్పను’’ అని బాధగా చెప్పారు జయశంకర్ సార్.
చివరకీ అక్షరాలమీద అంత అత్యాచారం చేస్తారా అని ఇప్పడికీ కష్టపడుతూ ఉంటాను.
ఇదీ మా వరంగల్లు ఎమర్జన్సీ కథ.
(వ్యాస రచయిత మహీంద్రా లా కళాశాల డీన్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్)