మార్చి మొదటివారంలో శంకుస్థాపన
హై మ్యాస్ట్ దీపాల ప్రారంభ కార్యక్రమంలో పాండురంగారెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 25 : శిల్ప కాలనీ అభివృద్ధికి తనవంతు సహకారాన్ని పూర్తిస్థాయిలో అందిస్తానని అమీన్ పూర్ మున్సిపాలిటీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి భరోసా ఇచ్చారు. శిల్ప కాలనీ పార్కులో ఏర్పాటు చేసిన హై మ్యాస్ట్ దీపాలను ఆదివారం సాయంత్రం ఆయన స్విచాన్ చేశారు. చీకట్లు కమ్ముకుంటున్న వేళ పార్కులో ఒక్కసారిగా వెలుగులు పరుచుకున్నాయి. ఆ దీప కాంతులను చూసి కార్యక్రమానికి హాజరైన కాలనీ వాసులు హర్షధ్వానాలు చేశారు.
కౌన్సిలర్ శ్రీమతి రాజేశ్వరి, శివరామరాజు, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తొలుత కాలనీ వాసులు తమ సమస్యలతో ఒక వినతి పత్రాన్ని చైర్మన్ కు అందజేశారు.
తాగునీటికి సంబంధించి ట్యాంకును నిర్మించుకోవడానికి వీలుగా తమకు స్థలం కేటాయించాలని కోరుతూ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ రాసిన లేఖను దీనితో జత చేశారు.
వినతి పత్రాన్ని చదివిన అనంతరం చైర్మన్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ, పార్కులో వాకింగ్ ట్రాక్, పిల్లలకు ఆట స్థలం ఏర్పాటు చేస్తానని తెలిపారు. అక్కడినుంచే సంబంధిత మునిసిపల్ అధికారికి ఫోన్ చేసి, ఆదేశాలు జారీ చేశారు. కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడానికి వీలుగా 25 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు. జనవరి 26 న రిపబ్లిక్ డే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో పార్కు అభివృద్ధికి 25 లక్షలను కేటాయిస్తున్నట్టు ప్రకటించిన విషయాన్ని కూడా ఆయనే జ్ఞాపకం చేశారు.
కాలనీలో మిగిలిన ఇంటర్నల్ డ్రైనేజీ నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని పాండురంగారెడ్డి పేర్కొన్నారు. దాదాపు ఏడాది క్రితం మురుగు కూపంలా ఉన్న పార్కు ప్రాంతం ఇదేనా అంటూ చైర్మన్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. పార్కు అభివృద్ధికి నడుంకట్టి ఒక కొలిక్కి తెచ్చిన కాలనీవాసులు ఆయన అభినందించారు. కార్యక్రమంలో అతిథులను కాలనీవాసులు సత్కరించారు. చైర్మన్ ప్రకటనలను స్వాగతించారు. భరోసా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.