అమీన్ పూర్ మునిసిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి
కాలనీవాసులతో భేటీలో సమస్యలపై భరోసా
శిల్ప కాలనీ, అమీన్ పూర్: అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా రూపుదిద్దుకున్న శిల్ప కాలనీలో పార్కుల అభివృద్ధి, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు, రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్య పనుల నిర్వహణ కార్యక్రమాలను చేపడతామని మునిసిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి చెప్పారు. ఆదివారంనాడు ఆయన కాలనీవాసులతో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో కాలనీ వాసులు తమ సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. పార్కులలో అసాంఘిక కార్యక్రమాలు, బిల్డింగ్ మెటీరియల్స్, ఇతర భారీ వాహనాలతో చాలా ఇబ్బందిగా ఉంటున్న విషయాన్ని కూడా వివరించారు. ఈ అంశంలో పోలీసు శాఖతో మాట్లాడి, పోలీసు పహారా ఏర్పాటు చేయిస్తానని చైర్మన్ తెలిపారు. ఎన్నికల కోడ్ కాలపరిమితి ముగియగానే, దశల వారీగా కాలనీ సమస్యల పరిష్కారానికి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ, దోమల మందు పిచికారీ, తదితర పనులు చేపట్టవలసిందిగా మునిసిపల్ సిబ్బందిని ఆదేశిస్తానని పాండురంగారెడ్డి తెలిపారు.
ఇందుకు సంబంధించి కౌన్సిలర్ శ్రీమతి రాజేశ్వరిని బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. కాలనీవాసులతో ఎప్పటికప్పుడు మాట్లాడాలని కూడా ఆమెను కోరారు.
కాలనీలో ఉన్న రెండు పార్కులలో ఒకదానిని పది లక్షల రూపాయలు మంజూరు చేసి అభివృద్ధి చేస్తానని చెప్పారు. మౌలిక సౌకర్యాలను కల్పించే బాధ్యత తనదని, తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఇక్కడి బిల్డర్లు ఈ కాలనీని హె.ఎం.డి.ఏ. అనుమతితో నిర్మాణాలు చేపట్టారని పేర్కొన్నారు.
ఈ క్రమంలో అధికారులలో కొంత గందరగోళం ఏర్పడిన మాట వాస్తవమని, ఇకపై ఇటువంటి అంశాలకు తావు లేకుండా చూసుకుంటామని చైర్మన్ చెప్పారు. గతం గతః అంటూ పాత అంశాలను మనసులో పెట్టుకోవద్దని, అసెంబ్లీ ఎన్నికలలో పటాన్ చెరు బి.ఆర్.ఎస్. అభ్యర్థి జి. మహిపాల్ రెడ్డికి ఓటు చేయాలని పాండురంగారెడ్డి కాలనీ వాసులకు విజ్ఞప్తి చేశారు.
డ్రైనేజీ అవుట్ లెట్ ఏర్పడడానికి తీవ్రంగా కృషి చేసినందుకు చైర్మన్ పాండురంగారెడ్డి, ఇటీవలే బదిలీపై వెళ్లి కమిషనర్ శ్రీమతి సుజాతతో పాటు కలెక్టర్, ఇతర అధికారులకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీమతి రాజేశ్వరి దంపతులు, తదితరులు పాల్గొన్నారు.