(వైజయంతి పురాణపండ, 8008551232)
ఆయనది జగమంత కుటుంబం. ఆయనది ఏకాకి జీవితం కాదు. ఆయన విరించి, తన కలం అనే విపంచితో ఎన్నో సంగీత రాగాలు అక్షరీకరించారు. ఆడవారిని కించపరిచేలా, అసభ్య పదజాలం లేకుండా పాటలు రాయాలి అని చెప్పిన తండ్రి మాటను రక్తంలో కలిపేసుకున్నారు. ఏనాడూ ఒక్క పాట కూడా అసభ్యంగా ఉంది అనిపించుకోలేదు. అన్నీ మంచి పాటలే. అన్నీ మంచి మాటలే. ఆయనే మంచి మనిషి. తనలో తాను పాడుకుని, తనలో తాను ఆత్మ విమర్శ చేసుకుని పాటను బయటకు ఇచ్చారు.
సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌ని వాయిదా పద్ధతి ఉంది అంటూ వ్యంగ్యం పలికింది ఆ కలం.
మారదు కాలం మారదు లోకం… శిలాక్షరాలు.
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక…
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమీ… విశ్రమించవద్దు ఏ క్షణం… అంటూ జయం నిశ్చయం కావటానికి ధైర్యాన్ని పలికారు.
శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వ…
విధాత తలపున ప్రభవించినది.
ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు…
మెరిసే తారలదేరూపం…
ఒకటా.. రెండా. అన్నీ మంచి పాటలే..
అన్నీ మంచి మాటలే…
ఎంత బాధ్యత.. ఎంత నిబద్ధత.. ఎంత కృషి… ఎంత పట్టుదల…
ఏనాడూ ఆ పదాలలో తప్పు లేదు.. ఆ మాటలలో అశ్లీలం లేదు…
సమాజం పట్ల బాధ్యత…
అక్షరాన్ని సరస్వతిగా భావించారు..
అక్షరాన్ని పవిత్రంగా తలంచారు..
సిరివెన్నెల అన్నట్లుగానే… ఆయన కలం సిరి వెన్నెలలు కురిపించింది.
తెలుగువారికి సిరిసంపదల అక్షర సుధామయూఖలు ప్రసరింపచేశారు.
నా ఉచ్ఛ్వాసం కవనం… నా నిశ్వాసం గానం…
పాటలలోనే తన ప్రణాళిక ముందుగానే తయారుచేసుకున్న కవిర్షి.. మహర్షి…
తన పాండిత్యాన్ని కె. విశ్వనాథ్‌తో కలిసి తెలుగు ప్రేక్షకులకు పంచారు.
త్రివిక్రమ్ అన్నట్లుగానే…
తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం…
బలపం పట్టి భామ బళ్లో…వంటివి రాశారు.
దిగజారుడు సాహిత్యం, అర్థం పర్థం లేని సాహిత్యం కాకుండా…
ఇరుకు సందుల్లో కూడా మంచి సాహిత్యాన్ని నడిపారు.
ఆయన ఖర్చు చేసుకున్న జీవితం ఎవరికి తెలుసు.
ప్రపంచం అంతా పడుకున్న తరవాత లేస్తాడు…అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు…
ఒక మనిషిని కదిలించగల శక్తి సీతారాముడిది…
నిజం
పూర్తిగా నిజం..
ముమ్మాటికీ నిజం..
ముమ్మాటికీ అంటే… మూడు మార్లు…
నిజం.. నిజం.. నిజం..
ఒక మనిషిలో ఆలోచన రేకెత్తించారు…
ఒక మనిషిలో చైతన్యం రగిలించారు..
ఆదిభిక్షువు వాడినేమి అడిగేది… బూడిదిచ్చేవాడినేది కోరేది…
నిందాస్తుతిలో పాట రచించారు.
ఎంత మాట్లాడుకున్నా… ఎన్నిసార్లు మననం చేసుకున్నా…
చాలా తక్కువే…
ఆయన ఆలోచన వేరు…
ఆయన ప్రణాళిక వేరు..
ఆయన పలుకులు వేరు..
ఆయన బాట వేరు..
చావు గురించి ఆయన పలికిన వేదాంతం…
బహుశ ఆదిశంకరుడి అంశ ఆయనలో ప్రవేశించిందేమో…
వివేకానందుడి ఆలోచన ఆయనను ఆవహించిందేమో…
అవును
ఆయనను తెలుగు అక్షరం ఆవహించింది…
ఆయనను ఆవాహన చేసుకుంది.
ఇంకేముంది…
ఆదిభిక్షువును చేరి తన పాటను అక్కడ పాడి వినిపిస్తారు.
శివపూజకు చేరింది ఈ సిరిసిరివెన్నెల మువ్వ. (నివాళి రచయిత సీనియర్ జర్నలిస్ట్)