ఎం ఎస్ ఆచార్యవర్యునికి అక్షర నీరాజనం

Date:

శ్రీ వేంకటేశ్వరస్వామిని రోజూ మాడభూషి శ్రీనివాసాచార్య సుప్రభాతంలో స్తుతి చేసేవారు. 

రేఖామయధ్వజ సుధాకలశాతపత్ర

వజ్రాఙ్కుశామ్బురుహ కల్పకశఙ్ఖచక్రైః ।

భవ్యైరలఙ్కృతతలౌ పరతత్త్వచిహ్నైః

శ్రీవేఙ్కటేశ చరణౌ శరణం ప్రపద్యే ॥

(తాత్పర్యం. పరాత్పరుని చిహ్నములైన ధ్వజము, అమృతకలశము, ఛత్రము, అంకుశము, పద్మము, కల్పవృక్షము, శంఖము, చక్రము అను శుభకరములైన రేఖలతో కూడియున్న శ్రీ వేంకటేశ్వరుని పాదములనే శరణు పొందెదను.) తన అంతిమదశలో తన యాది కోల్పోయిన తరుణంలో శరీరంలోని ఒక్కక్క అవయవం నిశ్చైతన్యమవుతున్న సమయంలో మనసులోనుంచి వాగ్రూపంలో బయటపడిన శ్లోకం. 

తాను రోజూ సుప్రభాతం చదువుకునే వారు. అందులో శరణాగతి స్తోత్రంలో అతి క్లిష్ఠమైన శ్లోకం ఇది. 

పరాత్పరుని చరణాలకు శరణు వేడుతూ, ఆ చరణం కింద పాదంలో కనిపించే పరాత్పరచిహ్నాలను తలచుకోవడం ఆశ్చర్యకరం.   ఎవరు అంతిమ కాలములో నన్ను స్మరింతురో వారు నన్ను చేరుదురని భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఉద్బోధించారు. 

12 జులై 1994న మాడభూషి శ్రీనివాసాచార్య ఆ పరాత్పరుని సన్నిధిని చేరిన రోజు. 

జనధర్మ వార పత్రిక 27.10.1958 న ప్రారంభించిన తొలి సంచిక పేజీ ఇది.  సంపాదకుడు ఎం ఎస్ ఆచార్య 12 జులై 2024 న 30 సంవత్సరాలు గడచిపోయింది. 1924న జన్మించిన ఆచార్య గారికి ఈరోజు 99వ ఏళ్ల వయసు. అంటే 100 సంవత్సరాలు. శతజయంతి ఆయన పుట్టిన రోజు 3 అక్టోబర్ 2024న.

ఈ సందర్భంగా ఆచార్యగారికి నివాళి.

తెలుగు పత్రికలపై నిషేధమ్ము ధిక్కరించి పత్రికలు పంచి లాఠీలు తిన్నవాడు

తెలుగు వద్దన్న నిజాము దుష్ట పాలనలోన తెలుగు వర్ధిల్ల వార్తలు వ్రాసినాడు

కుంభకోణాలు కనిపెట్టి, నకిలీ ఎన్ కౌంటర్ల పసిగట్టి ఆనాడె అధికార దుర్నీతి తిట్టినాడు

రజాకార్ రాక్షసాల బాధితులకు అండగా కాగడాపట్టి నిశి రాత్రుల గస్తీ కట్టినాడు

ఎస్వాసుగా కలమెత్తి చెడును ఎండగట్టినాడు ఎదురెవరైన బెదరని గట్టి వాడు

అక్షరాలనధికార మదాంధులకమ్మి పదవులు తోటల పొలాల బిచ్చమెత్తని వాడు

మిగిలిన నాలుగురాళ్లు తగిలిన నాలుగురాళ్లు పత్రికా సౌధపు పునాదులన్నవాడు

నీతిని నిర్భయతను నిలిపి కడగండ్లనెదురొడ్డి నిలకడకు నిలువెత్తు రూపైన వాడు

పర్సెంటేజీలు ఇచ్చి ప్రభువుల ప్రకటనల అవినీతి గడ్డి కాశపడక

ప్రకరణ ప్రచురణలు కూళలకమ్మి అప్పడుపుకూడు వద్దన్న పోతన్నవాడు

తనవారు పరవారు ఎవరు ఏమన్న జనస్వామ్యదొంగల కుట్రలెన్నిన వాడు

జనచైతన్యమ్మె తన ఆశయమ్మని వార్తా వ్యవసాయ వర్క్ హాలికుడైన వాడు

జనధర్మమ్ము తన ధర్మమ్మని ఎంచి జనధర్మ పత్రిక నడిపిన వాడు

పెద్దమనుషుల ఒప్పంద ఉల్లంఘనల నాలుగేళ్లలోనె వెల్లడించిన వాడు

విశాలాంధ్ర ఆశలు నీరు కాగ కుటిలాంధ్ర కులనీతిపైన గళమెత్తిన వాడు

గోదారి దొంగల దారిమళ్లింపుల నడ్డివిరిచి సమతా సమరసేనాని ఐన వాడు

‘వరంగల్ వాణి’ అని జిల్లాల ప్రాంతాల పరిమితులెందుకని నేను ప్రశ్నించ

న్యూయార్క్ టైంస్, వాషింగ్టన్ పోస్ట్ పత్రికల పక్కవారు చదవరా అన్నవాడు

తెలంగాణ స్వాభిమాన స్వాతంత్ర్య దీప్తికై అక్షరాయుధాలనిచ్చిన వాడు

ప్రజానాయకుల వాకిలి కుక్క కాదు పత్రిక ప్రజల పాశుపతమ్మన్న వాడు

నీలాలకు కాసులకు నియమాలు వదిలి భజన సేయు కొన్ని కలాలకన్న

అక్షరాక్షరాన కాకతీయ పౌరుషమ్మునింపి, చురుకైన వాక్యాల చురకలిచ్చి

అహోరాత్రముల ముద్రాక్షరాల యోగముద్ర దాల్చి ప్రభువుల నిద్ర కాల్చి

దుర్జననేతల గుండెల రైళ్లు నడిపి జనవరేణ్యుడైన జనధర్మ జర్నలిస్టు

పఠితల మెదళ్ల బూజుదులిపి, పాతక పాలక ఖాదీల దుమ్ముదులిపి

జనము వైపు నిలిచి జనహితమ్ము దీప్తించిన జనధార్మికుడతడు

కవులకు కలము, రచయితలకు బలము, కళాకారుల వెన్నుదన్ను

జనధర్మపు మాటయై బాటయై వరంగల్లు వాణియైబాణియైన పెన్ను

వచనాలు వ్యాసాలు నవలలు లేఖలు ఎవేవో ఎవరెవరో ఇక్కడ

ఈ అక్షర కర్మాగారాన ఘర్మజలము చిందిన సత్ కర్మవీరులైరి

నాలుగు పేజీల విస్తరించిన నవరంగ జీవరస వ్యాసతరంగ గంగ

సువిశాల భావాల భగీరథ చక్రవర్తి మాడభూషి శ్రీనివాస మూర్తి

జనధర్మమ్మింక రాలేకపోయినా వరంగల్లు వాణి కొంత జీరబోయినా

నీ రాతలు చెరిగిపోవు, నీ విలువలు తరిగిపోవు, ఆ ఫలాలు రాలిపోవు

సైబర్ వీధుల ఆరచనలు మెలుగు గాక, నీ స్ఫూర్తి నారచనలై వెలుగు గాక

తెలుగు విజ్ఞానదీప్తియై నిత్యమ్ము నీ వచనరచన ఇంకింత మెరయుగాక

నిలువెత్తు నీవు, విలువెత్తు నీవు, ఎలుగెత్తి నీవు తెలుగెత్తుదువీవు

వర్ణమై పదమై వాక్యమై కావ్యమై తెలుగైన నీకు తెలివెలుగైన నీకు

ఎవరు మాత్రమేమివ్వగలరు గనుక, నీ వారసుడీ శ్రీధరుడి

హృదయముప్పొంగి స్రవించిన అశ్రువుల రాసినదీ అక్షర నివాళి.

మీ ముని మనవడు

మాడభూషి శ్రీధర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

గణేశుని పూజిస్తే మౌస్ క్లిక్ చేసినట్టే…

నిరాడంబరుడు… విఘ్నలను తొలగించే రాజు(డా. పురాణపండ వైజయంతి)మౌస్‌ని ఒక్కసారి క్లిక్‌ చేస్తే...

గణేశ మండపాలకు ఉచిత విద్యుత్తు: రేవంత్

ఖైరతాబాద్ వినాయకునికి సీఎం పూజలుహైదరాబాద్, సెప్టెంబర్ 07 : ఖైరతాబాద్ గణేశ...

పదేళ్లలో కానిది ఎనిమిది నెలల్లో సాకారం

సుసాధ్యం చేసిన జర్నలిస్టు బంధు రేవంత్‌రెడ్డిజె.ఎన్.జె. హోసింగ్ సొసైటీకి రేపు భూమి...

విఘ్నాధిపతి రూపం – విశ్వమానవాళి గుణగణాలకు ఓ సంకేతం

(వాడవల్లి శ్రీధర్)శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే"శుక్లాంబరధరం అంటే...