రంగులరాట్నంతో చంద్ర ‘మోహనం’

Date:

నవంబర్ 11న అస్తమించిన నట ‘చంద్ర’కు నివాళిగా
(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి)

‘తేనె’మనసులు ఆస్వాదించలేకపోయినా నేరుగా ‘రంగులరాట్నం’ ఎక్కేశారు మల్లంపల్లి చంద్రశేఖర వరప్రసాద్’అనే చంద్రమోహన్. ఆ సినిమా రూపకర్తలిరిద్దరూ (ఆదుర్తి సుబ్బా రావు, బీఎన్ రెడ్డి) దిగ్దర్శకులే. బీఎన్ వేసిన ఆ నట బీజానికి ఆదుర్తి పందిరి వేశారు. తన చిత్రాలలోనూ అవకాశం ఇచ్చారు. ‘చాంతాడంత పేరు సినిమాలకు పనికిరాదు. నీ పేరు ఇక ‘చంద్రమోహన్’ అనే బీఎన్. ’వారి (బీఎన్ రెడ్డిగారి) చిత్రంలో నటించడం వలన పెద్దలందరితోనూ పరిచయాలు అయ్యాయి. అందరూ నన్ను వారి కుటుంబంలో ఒకడిగా చూసేవారు’ అని చంద్రమోహన్ తరచూ చెప్పేవారు. ఆయనా అలానే వ్యవహరించారు. ’అబ్బాయి. ఇది సీరియస్ ప్రొఫెషన్. వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా సద్వినియోగ పరచుకో. ముఖ్యంగా నీ కారెక్టర్ కాపాడుకో‘ అని నాటి పెద్దలు చెప్పిన హితవునే, ఆయన తన వరువాత వచ్చిన వారికి (వింటారనుకుంటే) చెప్పడం ఆయనతో సన్నిహిత పరిచయం ఉన్న ఈ వ్యాసకర్తకు బాగా తెలుసు.


చిత్రరంగ ప్రవేశ ఆరంభం బాగున్నా, అవకాశాలు వెంటవెంటనే ఊడి పడలేదు. ‘పొట్టివాణ్ణని అంటూ వేషాలు ఇచ్చేవారు కాదు మొదట్లో. ఎస్వీ రంగారావు గారితో ‘సుఖ దుఃఖాలు’,‘బాంధవ్యాలు’, అక్కినేని నాగేశ్వరరావు గారితో ‘మంచి కుటుంబం’, బాపుగారి ‘బంగారు పిచుక’ చేశాక వేషాలు రావడం మొదలైంది. చంద్రమోహన్ ప్లెక్సిబుల్ ఆర్టిస్టు అనే పేరొచ్చింది. ఫలితంగా ఆ నాటి ప్రముఖ నటీనటులతో పనిచేసే అవకాశం, అదృష్టం లభించింది. చంద్రమోహన్ ‘పొట్టి ’తనాన్ని గుర్తించిన ఎస్వీఆర్, ఏఎన్నార్ లే అవశాశాలు ఇప్పించారు. ‘ఒరేయ్! నువ్వు కాస్త పొడుగైతేనా….‘అని ఎస్వీఆర్, ‘నువ్వొక అడుగు ఎత్తు ఎక్కువగా ఉంటే నన్ను దాటివెళ్లిపోయేవాడివి ’అని ఏఎన్నార్ అనడాన్ని మెచ్చుకోలుగానే భావించేవారు. ఎన్టీఆర్ తో పరిమిత సంఖ్యల్లోనే నటించినా, మొదటి సినిమాతోనే ఆయన ఆశీస్సులు అందుకున్నానని చెప్పేవారు. ’ఎన్టీఆర్ కు గురుతుల్యుల బీఎన్ రెడ్డిగారి ‘రంగులరాట్నం’కు క్లాప్ కొట్టింది ఎన్టీఆర్ గారు. మా గురువుగారి చిత్రంలో నటిస్తున్నారు. మీకు మంచి భవిష్యత్ ఉంటుంది. దానిని కాపాడుకోండి’ అని ఆయన సలహా ఇచ్చారు.
పౌరాణిక పాత్రలు చేయాలని ఉన్నా తన ‘ఎత్తు’ సమస్య అయిందనే వారు. అయినా తగిన పాత్రలు (నారదుడు-యశోదకృష్ణ, అభిమన్యుడు-కురుక్షేత్రం, రుష్యశృంగుడు- అష్టలక్ష్మి వైభవం) చేశారు.


‘ఒడ్డు, పొడుగులేక పోవడం కూడా ఒక రకంగా నా అదృష్టం. నాకు తగిన వేషాలు (పాత్రలు) ఉంటాయి. నేనెవరికీ పోటీ కాను. నాకెవరూ పోటీ కాదు. అభిమానులు ఉన్నారు కానీ పరస్పరం దూషించుకునే పరిధులు దాటే అభిమాన సంఘాలు ఉండవు.
ఇతర నటులతో పోల్చుకునే అవకాశమే లేదు. దర్శక నిర్మాతలు సినిమా కథాను గుణంగా పాటలు, ఫైట్స్ పెడతారు కానీ నాకు ఇన్ని పాటలు కావాలనే కోరికలేదు. ఇచ్చిన వేషాన్ని మెప్పించేందుకు ప్రయత్నించడమే నటుడిగా నా పని’ అని చెప్పేవారు. పాత్రే ఆయనతో నడిచింది కానీ ఆయన పాత్ర నుంచి బయటికి రాలేదు. అలా ఆయన చేసిన పాత్రలన్నీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయ. సమకాలీనులు కొందరు కాలం చేసినా, ఇంకొందరు నటనకు దూరమైనా, ఆయన మాత్రం ఇటీవలి కొనేళ్ల క్రితం దాకా నటించారు. ‘ఆర్టిస్టుల టాలెంట్ మీద గాక, టెక్నికల్ సైట్ ప్రయోగాలు పెరిగిపోయాయి. కట్ షాట్స్ పెరిగాయి. సజషన్ షాట్స్ చోటు చేసుకున్నాయి. ‘మేక్ బిలీవ్ ’ గుట్టురట్టయింది. సినిమా వీధిన పడింది . గ్లామర్ పోగొట్టుకుంది. అడియన్స్ అభిరుచి కూడా మారింది’ అని ఒక ముఖాముఖిలో నిర్మొహమాటంగా చెప్పిన ఆయన ‘కాలం తెచ్చే మార్పులకు అనుగుణంగా మారుతూ వెళ్లడమే మనం చేయాల్సిన పని’ అంటూ ఆ దిశగానే సర్దుకువెళ్లారు.


నాయకుడంటే అందగాడు అనుకునే కాలంలో అందవిహీన (డీ గ్లామరైజ్డ్) పాత్ర వేసి (‘పదహారేళ్ల వయసు‘లో దివ్యాంగుడు) మెప్పించారు. అందుకు తానే ఆద్యుడిని కాదనేవారు చంద్రమోహన్. తనకంటే ముందు ఎన్టీరామారావు (రాజు-పేద), ప్రాణ స్నేహితుడు శోభన్ బాబు (చెల్లెలి కాపురం) పాత్రలను ప్రస్తావించేవారు. ఇక సమీప బంధువు, కె.విశ్వనాథ్ చిత్రాలలోని పాత్రలు, రేలంగి నరసింహారావు లాంటి వారి చిత్రాలలో హాస్య ప్రధాన పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.


‘శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు లాంటి వాళ్లు సమ వయస్కులు కావడంతో మా మధ్య చనువు బాగా పెరిగి ఏకవచన ప్రయోగం, కొందరితో ‘ఏరా’ దాకా (ముఖ్యంగా శోభన్ తో)వెళ్లాం’ అని కలసినప్పుడల్లా అనుభవాలు, జ్ఞాపకాలు పంచుకునేవారు. వినేవారుంటే చెప్పడంలో ఆయనకు ఎలాంటి భేషజాలు లేవని అనిపించింది. ‘నేను మొదటిసారి ముఖానికి రంగేసుకున్నప్పటి నుంచి సుమారు పది, పన్నెండేళ్లు మా మధ్య ఆప్యాయతలు, ఆత్మీయతలు ఎక్కువగా ఉండేవి. ఒక సినిమా నిర్మాణం ప్రారంభమైందంటే ఇంట్లో ఏదో శుభకార్యం మొదలైనట్లే. పూర్తయిందంటే ఏదో వెలితి. కన్నీటితో వీడ్కోలు. హీరో నుంచి ప్రతి టెక్నిషియన్, చివరికి లైట్ బాయ్ వరకు ఆ అనుబంధంలోని మాధుర్యాన్ని మరువలేకపోయేవారు‘ అని గుర్తు చేసేవారు.

(వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్ట్)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Young India Skill university a role model for country

CM Revanth Appeals to Industrialists to play a key...

రాష్ట్ర సంపద పెంపునకు ఎం.ఎస్.ఎం.ఈ. పాలసీ-2024

విధానం లేకుండా అభివృద్ధి అసాధ్యంపాలసీ- 2024 ఆవిష్కరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డిహైదరాబాద్,...

యువ వికాసానికి ప్రజా ప్రభుత్వం ద్విముఖ వ్యూహం

ప్రజా పాలనా దినోత్సవంలో తెలంగాణ సీఎం రేవంత్హైదరాబాద్, సెప్టెంబర్ 17 :...

అధికారం పోయిందనే అక్కసులో కె.సి.ఆర్.: రేవంత్

చిల్లరగాళ్లను ఉసిగొల్పుతున్న మాజీ సీఎంకాలకేయ ముఠాలా తెలంగాణాపైకి చిల్లరగాళ్ళురాజీవ్ విగ్రహావిష్కరణలో రేవంత్...