భగవంతుని పుణ్యవచనమే భగవద్గీత

Date:

నేడు గీత జయంతి
(డా. పురాణపండ వైజయంతి)
కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించిన వేదాంతమే భగవద్గీత. కురుపాండవ సంగ్రామంలోకి ప్రవేశించిన అర్జునునికి ఎదురుగా బంధువులు, గురువులు, కురు వృద్ధులు కనిపించేసరికి మనసు వికలం అవుతుంది. యుద్ధం చేయలేనని, రాజ్యం కోసం బంధువులను చంపలేనని, తనకు కర్తవ్య బోధ చేయమని అడుగుతాడు అర్జునుడు. రథసారథిగా ఉన్న శ్రీకృష్ణుడికి, రథంలో ఉన్న అర్జునునికి జరిగిన సంవాదమే భగవద్గీత.
సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాల నందనః‘
పారోథ వత్సస్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్‌‘‘
(శ్రీకృష్ణుడు ఉపనిషత్తులు అనే గోవుల నుండి అర్జునుడు అనే దూడను నిమిత్తంగా చేసుకుని గీత అనే అమృతాన్ని పితికాడు. బుద్ధిమంతులు అంతా ఈ గీతామృతాన్ని పానం చేయవచ్చు)


ఇది భారతంలో ఉన్నప్పటికీ దీనిని ప్రత్యేక గ్రంథంగా భావిస్తారు. భగవద్గీతను సంక్షిప్తంగా గీత అనీ, ఇందులో ఉపనిషత్తుల గుణాలు ఉండటంతో గీతోపనిషత్తు అని కూడా అంటారు. ఇందులో ఆత్మ తత్త్వం, జీవన గమ్యం, గమ్య సాధనలను బోధిస్తాడు శ్రీకృష్ణుడు. భగవద్గీతను భగవంతుని పుణ్యవచనంగా భావిస్తారు. సకల వేదాంతసారమిది.
‘గీతా సుగీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్ర సంగ్రహైః‘ యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాత్‌ వినిఃసృతా‘‘ ’
అంటుంది మహాభారతం. గీత చదివితే సకల శాస్త్రాలు చదివినట్లేనని పెద్దలు చెబుతారు. అది సాక్షాత్తు దేవదేవుని ముఖకమలం నుండి వెలువడింది కదా! మానవుని సంపూర్ణ తత్త్వవివేచన, ఆలోచనాసరళి… అన్నిటినీ గీత చర్చించింది. అందువల్లనే నాటి అల్లకల్లోల పరిస్థితుల్లో అర్జునికి హితబోధ చేసింది. మానసిక సంఘర్షణలో సతమతమయ్యే మానవులందరికీ పరిష్కారం చూపుతుంది గీత. నిష్కామకర్మ, నియమిత జీవనం, గీత వివరించినంత స్పష్టంగా మరే భారతీయ గ్రంథం వివరించలేదు.
గంగాస్నానమంత పవిత్రమైనది గీత. అనంత భావసముద్రం. కర్మ, భక్తి, జ్ఞాన, వైరాగ్యాల యోగ సిద్ధివల్లే లభిస్తుందంటుంది గీత. సకల కల్మశాలకు నిలయమైన సమాజంలో కొట్టుమిట్టాడుతూ అనుక్షణం మానసిక ఉద్వేగాలకు గురవుతున్న మానవులకు గీత చక్కని తరణోపాయం.
దైవాన్ని చేరటానికి, జ్ఞాన, యోగ, మార్గాలు సూచించి వాటిని అనుసరించే స్వేచ్ఛ మానవులదే అంటూ గీతను పూజామందిరానికే పరిమితం కాదని సూచించాడు గీతాకారుడు. పూజ అంటే ఆత్మను అర్థం చేసుకొని, ఉత్తమశీలాన్ని పెంపొందించుకోవటమేనని శాస్త్రం చెబుతోంది. బొమ్మకు మొక్కినా నమ్మకం ఉండాలని బోధిస్తోంది భగవద్గీత. నమ్మకమే మన జీవితాల్లో విశ్వాసం పెంచుతుంది. అలాగని ప్రతివారినీ నమ్మరాదు. ఉత్తమవ్యక్తులు ఎలా ఉంటారో తెలుసుకునేందుకు తామస, రజోగుణాల స్వరూపం వివరించి, సాత్విక లక్షణాలు పెంచుకొమ్మంటుంది గీత. కర్మవల్ల కలిగే దోషాలు గమనిస్తూ, వాటిని తొలగించ మంటుంది. అన్నీ వదిలించుకొని ముక్కు మూసుకొని అడవుల్లోకి వెళ్లమని బోధించదు భగవద్గీత. సన్యాసం కంటే, కర్మయోగమే మేలు అని ప్రబోధిస్తుంది. ఏకాగ్రత అంటే ఏమిటో అది ఎలాసాధించాలో, దానివల్ల కలిగే లాభాలు ఏమిటో వివరిస్తుంది.


ధ్యానయోగ విశిష్టత వేల ఏండ్ల క్రితమే బోధించింది గీత. ధ్యానయోగానికి చిత్త ఏకాగ్రత, పరిమిత జీవినం, ఉదాత్త గుణశీలత అవసరమనుకుని మరింతగా యోగలోని పరిపూర్ణత వర్ణించింది. నిష్కామభక్తి ముఖ్యమని చెబుతూ, మనసులో సవాలక్ష కోరికలతో మాత్రం దైవాన్ని అర్థించవద్దని సూచిస్తుంది గీత.
మృత్యువు తప్పదని హెచ్చరిస్తుంది. గతించినవారి కోసం విలపించటం తగదని, ఉన్నంతకాలం మంచి జీవితాన్ని గడపాలని హెచ్చరిస్తుంది. అహింస మంచిదే అయినా, నిన్ను హింసించేవేళ, నిన్ను బాధించేవేళ, హింస తప్పు కాదంటుంది. ఇదే గాంధీజీ అనుసరించిన అహింసా సిద్ధాంతం. గీత సంపూర్ణంగా వేదాంతసారం. అంతేకాదు వైదిక ధర్మస్వరూపం.


కర్మలు ఆచరించమని, ఫలితం మాత్రం భగవంతునిపై వదలాలని చెప్పి, మనలను ఓదార్చుతుంది. దైవాన్ని అర్చించే విధానాన్ని, దైవ మూలస్థితిని, ఆయన స్వరూపాన్ని వర్ణించి, భక్తికి విశ్వాసం ముఖ్యమని బోధిస్తుంది. తల్లి, తండ్రి, గురువు, మహాత్ములలో దైవాన్ని దర్శించటం గీత అలవాటు చేస్తుంది. చిన్నతనమే క్రమశిక్షణకు మార్గమని చెబుతుంది. ఇందుకు సంబంధించి బాలభక్తులను ఉదహరిస్తుంది గీత. మయ్యాసక్త మనః పార్థా.. అంటూ తన మీద పూర్తి విశ్వాసం కలిగి ఉన్నవారిని తానే ఆదుకుంటానని అభయమిస్తుంది గీత. ఇటువంటి ఉదాత్త లక్షణాలున్న గీత, భారతీయ సంప్రదాయ పరంపరల భద్రపేటిక. అందులోని అంతులేని భావభక్తి సంపద అనుభవించవలసిందే, అనుసరించవలసిందే. భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాల అమృత భాండం. కర్తవ్యం వైపు అడుగులు వేయించే మాతృ సమానం. పద్దెనిమిది అధ్యాయాలపరంగా వరుసగా గీత ఏం వివరించిందో గమనిద్దాం…
అర్జున విషాద యోగం
గీత కేవలం అర్జునునికి కృష్ణుడు చేసి హితబోధగానే చాలామంది భావిస్తారు. భారతయుద్ధానికి కర్తవ్యబోధనకు అర్జునుని ప్రేరేపించటం, నిజమే అయినా, భగవానుని ఉద్దేశ్యం మాత్రం విశ్వమానవాళికి అపూర్వమైన వేదాంతసారాన్ని అందించటమే.భారతయుద్ధంలో బంధుమిత్రసహోదరులను చూసి చలించిన అర్జునునికి ధైర్యం చెప్పి కర్తవ్య బోధించిన అధ్యాయమిది.


ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ‘‘

భారతయుద్ధంలో పాల్గొంటున్న వీరాధివీరుల గురించి సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తాడు. యుద్ధవిశారదులు, శస్త్రాస్త్రధారులు ఎందరో ఉన్నారని వివరిస్తాడు. యుద్ధారంభ సూచకంగా భీష్ముడు శంఖాన్ని పూరిస్తాడు. శ్రీకృష్ణార్జునులు యుద్ధానికి సిద్ధమవుతారు. పాండవపక్షంలోని వారంతా అప్రమత్తమవుతారు. యోధానుయోధుల్లో తన బంధుమిత్రుల చూచి చలించిన అర్జునుడు సైన్యం మధ్యలో తన రథం ఆపమంటారు. ఎవరితో యుద్ధం చేయాలో ఆలోచిస్తాడు. పెదతండ్రులు, పినతండ్రులు, తాత, ముత్తాలు, గురువుల, మేనమామలు, సోదరులు, పుత్రులు, మిత్రులు, పిల్లనిచ్చిన మామలు, సుహృదయుల ఎందరినో చూసి విషాదంలో మునిగిపోతాడు. కృష్ణునితో తన వ్యథాపూరిత పరిస్థితి వివరిస్తాడు. అర్జున విషాద యోగంతో ప్రారంభమై సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞాన యోగం, కర్మసన్యాస యోగం, ఆత్మసంయమ యోగం, జ్ఞానవిజ్ఞానయోగం, అక్షరపరబ్రహ్మ యోగం, రాజవిద్యారాజగుహ్యయోగం, విభూతి యోగం, భక్తియోగం, క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగం, గుణత్రయ విభాగ యోగం, పురుషోత్తమ ప్రాప్తి, దైవాసుర సంపద్విభాగ యోగం, శ్రద్ధాత్రయ విభాగ యోగం, మోక్షసన్యాస యోగంతో మొత్తం 18 యోగాలతో భగవద్గీత ముగుస్తుంది.


మోక్షసన్యాస యోగంలో… అన్ని సంశయాలను విడిచిపెట్టి, తనయందు మనసు నిలిపి యుద్ధం (కర్తవ్యం లేదా కర్మ) చేయమని సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్మ ఉపదేశిస్తాడు. అర్జునుడు మోహవిరహితుడవుతాడు. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్రశ్రీర్విజయోభూతిః ధృవానీతిర్మతిర్మమా‘‘ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్ధారిౖయెన పార్థుడు ఉన్న చోట సంపద, విజయం తప్పక ఉంటాయని సంజయుడు ధృతరాష్ట్రునికి చెబుతాడు.
(గీత జయంతి ప్రత్యేకం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆరోజు డి.ఎన్. ప్రసాద్ ఏం చేశారంటే…?

ఎవరూ లేకున్నా ప్రత్యేక సంచికదీని వెనుక డి.ఎన్. ప్రసాద్ కృషిబాలయోగి మరణించి...

A Premier Rural Development Institute of India

National Institute of Rural Development and Panchayati Raj (NIRD&PR)...

Science for the common man

(Dr. N. Khaleel) Four years ago, Corona shook the world....

Watch CHAVA in a Theatre

(Dr Kamalakar Karamcheti) The Hero is captured by the villain...