వినాయకచవితి కానుక
నేతి సూర్యనారాయణ శర్మ సంపాదకత్వంలో శంకరభారతి ప్రచురణలు అందిస్తున్న పుస్తకం ‘గణేశం భజే’. సాధారణంగా కథలు, వ్యాసాలను సంకలనంగా ప్రచురించటం చాలాకాలంగా చూస్తున్నాం. విశేషించి ప్రముఖుల కథలను ఎంపిక చేసి ప్రతి సంవత్సరం తెలుగు కథ… అని ఆ సంవత్సరంలో వచ్చిన ప్రసిద్ధి చెందిన కథలను ఒక పుస్తకరూపంలో చూస్తుంటాం. ఈ పుస్తకం కూడా ఆ కోవకు చెందినదే. విఘ్నేశ్వరుడి మీద పలువురు ప్రముఖులు, సామాన్యులు రచించిన వ్యాసాలను ఒక సంకలనంగా తీసుకువచ్చారు నేతి సూర్యానారాయణ శర్మ. మొఘల్ దర్బార్, శంకర విజయం వంటి పలు నవలలు, వ్యాసాలు స్వయంగా రచించిన నేతి సూర్యనారాయణ శర్మ ఇటువంటి ప్రయోగం చేయటం అభినందనీయం. గణనాయకుడికి సంబంధించిన పలు అంశాలను ఈ వ్యాస సంకలనం ద్వారా తెలుసుకోవచ్చు. ఇదొక మంచి ప్రయత్నం. ఈ పుస్తకాన్ని కానుకగా ఇచ్చే విధంగా మొదటి పేజీని రూపొందించారు. సామవేదం షణ్ముఖ శర్మ, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, విద్యాశంకర భారతీస్వామి, ధూళిపాళ మహాదేవమణి, కడిమిళ్ల వరప్రసాద్, జానమద్ది హనుమచ్ఛాస్త్రి, కుప్పా వెంకటకృష్ణమూర్తి, శ్రీరమణ వంటి ప్రముఖులతో పాటు అనేక ఇతర వ్యాసాలతో మొత్తం 28 వ్యాసాల సంకలనంగా మన ముందుకు వచ్చింది. ఆదిశంకరాచార్య విరచిత గణేశ పంచరత్నమ్ కూడా ప్రచురించడం విశేషం.
ఇటువంటి పుస్తకాన్ని ఒకటి కాదు కనీసం ఐదు పుస్తకాలు కొనుగోలు చేసి, సన్నిహితులకు కానుకగా ఇచ్చి, జ్ఞానాన్ని నలుగురికి పంచటం మంచిదేమో ఆలోచించండి.
సంపాదకుడు: నేతి సూర్యనారాయణ శర్మ
పుస్తకం: గణేశం భజే
పేజీలు: 164
వెల : 250 రూపాయలు
ప్రతులకు: 99517 48340, 91218 68065 సమీక్ష: గణేశం భజే
గణేశునిపై విశేష రచనలు
Date: